అమర్‌రహే!

ABN , First Publish Date - 2021-06-16T09:30:15+05:30 IST

దేశానికి రక్షణగా నిలిచి.. చైనా బలగాల దాడిలో ప్రాణాలు వదిలిన కల్నల్‌ బిక్కుమళ్ల సంతోష్‌ బాబు అమరత్వం శాశ్వతంగా నిలుస్తుందని రాష్ట్ర ఐటీ, మునిసిపల్‌ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.

అమర్‌రహే!

  • సంతోష్బాబు అమరత్వం శాశ్వతంగా నిలుస్తుంది
  • భారత సైన్యంలో ధైర్యాన్ని నింపిన ముఖ్యమంత్రి: కేటీఆర్‌
  • సూర్యాపేటలో కల్నల్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి

సూర్యాపేట, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): దేశానికి రక్షణగా నిలిచి.. చైనా బలగాల దాడిలో ప్రాణాలు వదిలిన కల్నల్‌ బిక్కుమళ్ల సంతోష్‌ బాబు అమరత్వం శాశ్వతంగా నిలుస్తుందని రాష్ట్ర ఐటీ, మునిసిపల్‌ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. గల్వాన్‌ లోయలో చైనా బలగాల దాడిలో కల్నల్‌ సంతో్‌ష బాబు మరణించి ఏడాది అయిన సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని కుటుంబ సభ్యులతో కలిసి మంత్రులు కేటీఆర్‌, జగదీశ్‌ రెడ్డి మంగళవారం ఆవిష్కరించారు. అనంతరం మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ, కల్నల్‌ సంతో్‌షబాబు మనల్ని విడిచి వెళ్లి ఏడాది అయిందంటే నమ్మలేకపోతున్నానని అన్నారు. ఆయన ఆత్మ శాంతించేలా, ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి నింపేలా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం గర్వించదగ్గ విషయమన్నారు. కల్నల్‌ సంతో్‌ష బాబు కుటుంబానికి సీఎం కేసీఆర్‌ భరోసా కల్పించి, సముచిత స్థానం ఇచ్చారన్నారు. ఆయన చర్య భారతదేశ సైన్యానికి ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందన్నారు.నిత్యం అనేక కార్యక్రమాల్లో పాల్గొంటాం. కానీ, ఇలాంటి అరుదైన కార్యక్రమంలో పాల్గొన్నప్పుడే ఆత్మ సంతృప్తి కలుగుతుంది. ఎంతకాలం జీవించామనేది గొప్ప కాదు. ఎలా జీవించామనేది ముఖ్యం’’ అని అన్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు సంతో్‌షబాబు కుటుంబానికి అండగా ఉండడంతోపాటు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను మంత్రి జగదీశ్‌ రెడ్డి నెరవేర్చారని కొనియాడారు.


తెలంగాణ ఆశాకిర ణం కేటీఆర్‌: మంత్రి జగదీశ్‌ రెడ్డి

తెలంగాణ భవిష్యత్తు ఆశాకిరణం మంత్రి కేటీఆర్‌ అని విద్యుత్తు శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మంత్రి కేటీఆర్‌ సుమారు 18 లక్షల మందికి ఐటీ రంగంలో ఉద్యోగాలు కల్పించారని వివరించారు. అంతరిస్తున్న చేనేత రంగాన్ని ఆదుకున్న గొప్ప వ్యక్తిగా కేటీఆర్‌ను కీర్తించారు. హైదరాబాద్‌ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దారని తెలిపారు. కల్నల్‌ సంతో్‌ష బాబు దేశం కోసం ప్రాణత్యాగం చేసిన గొప్ప వ్యక్తిఅని, ఆయన్ను కన్న తల్లిదండ్రులు దేవుళ్లతో సమానమని అన్నారు. కల్నల్‌ వర్ధంతి రోజునే ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం గర్వంగా ఉందన్నారు.


ప్రభుత్వ కార్యక్రమానికి ఎందుకు పిలవలేదు: ఎంపీ కోమటిరెడ్డి

హైదరాబాద్‌: ప్రతిపక్ష ప్రజా ప్రతినిధుల పట్ల టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ట్విటర్‌లో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన పార్లమెంటు స్థానం పరిధిలోని సూర్యాపేటలో ప్రభుత్వమే కల్నల్‌ సంతోష్‌ బాబు విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించి తనను ఎందుకు పిలవలేదని నిలదీశారు. ప్రతిపక్షాలను ఎదుర్కొనే ధైర్యం లేకనే తనను పిలవలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని టీఆర్‌ఎస్‌ పార్టీ పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఉన్నత చదువులు చదివినట్లు గొప్పలు చెప్పుకొనే కేటీఆర్‌ ఒక్కసారి భారత రాజ్యాంగాన్ని కూడా చదివితే బాగుండునని కోమటిరెడ్డి సూచించారు.


సముచిత గౌరవం ఇచ్చారు: సంతోషి

కల్నల్‌ సంతో్‌ష బాబు వీర మరణం అనంతరం సీఎం కేసీఆర్‌ తమకు సముచిత గౌరవం ఇచ్చారని సంతోష్‌ సతీమణి సంతోషి అన్నారు. తన భర్త మరణానంతరం సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రులు కేటీఆర్‌, జగదీశ్‌ రెడ్డి, ప్రతి ఒక్కరూ అండగా ఉన్నారని తెలిపారు. దేశం కోసం ప్రాణాలర్పించిన సంతోష్‌ బాబును తీసుకు రాలేమని, కానీ, మీ కుటుంబానికి అండగా ఉంటామని సీఎం భరోసా ఇచ్చారని తెలిపారు. తన పిల్లల భవిష్యత్తుకు ఎంతో భరోసా ఇచ్చారని, నివాసం కోసం ఇంటి స్థలం, తనకు గౌరవప్రదమైన ఉద్యోగం కల్పించారని వివరించారు. 


ఈ సందర్భంగా, సంతోష్బాబు పిల్లలతో మంత్రి కేటీఆర్‌ కాసేపు ముచ్చటించారు. అనంతరం విగ్రహాన్ని రూపొందించిన శిల్పి శ్రీనివాసరెడ్డిని సన్మానించారు. కాగా, మంత్రి కేటీఆర్‌ను సంతోష్బాబు కుటుంబ సభ్యులు సన్మానించారు. అంతకు ముందు ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ ఆవరణలో రూ.21.69 కోట్లతో మెయిన్‌ రోడ్డు విస్తరణ పనులకు, రూ.7 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ అదనపు భవనాల నిర్మాణాలకు సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరించారు.

Updated Date - 2021-06-16T09:30:15+05:30 IST