Advertisement
Advertisement
Abn logo
Advertisement
Jul 25 2021 @ 02:16AM

కరోనా కోరల్లో బాల్యం

కుటుంబాలను చిదిమేస్తున్న మహమ్మారి

బాల కార్మికులుగా మారుతున్న పిల్లలు

ఆర్థిక సమస్యల వల్లే చిన్నారులకు దుస్థితి

20 రోజుల్లో 638 మంది బాలలకు విముక్తి

మొత్తంగా 2,535 మంది చిన్నారుల రెస్క్యూ


హైదరాబాద్‌, జూలై 24 (ఆంధ్రజ్యోతి): ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపిన కరోనా.. బాల్యాన్ని బంధీ చేసింది. కుటుంబాలను ఆర్థికంగా అతలాకులం చేసి.. చిన్నారుల బోసి నవ్వులను చిదిమేసింది. అనేక వ్యవస్థలను కుప్ప కూల్చిన మహమ్మారి.. అమాయక చిన్నారులను బాల కార్మికులుగా మార్చింది. కరోనా దెబ్బకు ఆర్థికంగా ఛిద్రమైన అనేక కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో తమ పిల్లలను పనికి పంపుతున్నాయి. దీంతో అనేక మంది చిన్నారులు బాల కార్మికులుగా మారుతున్నారు. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను వ్యవసాయ కూలీలుగా మారుస్తుంటే.. మరికొందరు కిరాణా, మెకానిక్‌, వస్త్రాల, ఫర్నిచర్‌ దుకాణాలు, హోటళ్లలో పనికి పెడుతున్నారు. ఆపరేషన్‌ ముస్కాన్‌-7లో భాగంగా పోలీసులు చేస్తున్న తనిఖీల్లో ఈ విషయం బయటకు వచ్చింది. కరోనా సంక్షోభం వల్ల ఆర్థిక సమస్యలు తలెత్తడంతో చిన్నారులు బాల కార్మికులుగా మారతున్నారని విచారణలో తేలింది. పేదరికం వల్ల కొన్ని కుటుంబాలు మనుగడ సాగించేందుకు చిన్నారులపై ఆధారపడుతున్న పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయని వెల్లడైంది. ఆపరేషన్‌ ముస్కాన్‌-7ను పర్యవేక్షిస్తున్న పోలీస్‌ శాఖలోని మహిళా భద్రత విభాగం బాలల రెస్క్యూ గణాంకాలను గురువారం వెల్లడించింది.

వాటి ప్రకారం.. గత 20 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 638 బాలకార్మికులకు పోలీసులు విముక్తి కల్పించారు. మొత్తంగా 2,535 మంది చిన్నారులను రెస్క్యూ చేశారు. అందులో 2,293 మంది బాలురు, 132 మంది బాలికలున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన 361 మంది ఉన్నారు. 2,535 మందిలో 1,664 మందిని వారి తల్లిదండ్రులకు అప్పగించగా.. 871 మందిని బాలల సంరక్షణ కేంద్రాలకు తరలించారు. రాష్ట్రవ్యాప్తంగా చిన్నారులతో పనులు చేయిస్తున్న యజమానులపై 442 కేసులు నమోదు చేశారు. రెస్క్యూ చేసినవారిలో బాలకార్మికులు, వీధి బాలలు, యాచక వృత్తి వారే ఎక్కువగా ఉన్నారు. 638 మంది బాల కార్మికులను, యాచక వృత్తి చేస్తున్న 95 మంది చిన్నారులను బాలల సంరక్షణ కేంద్రాలకు తరలించారు. ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న 14 మంది, 379 మంది వీధి బాలలకు విముక్తి కల్పించారు. రాష్ట్రంలో కొన్నేళ్లుగా బాల కార్మిక వ్యవస్థ క్రమంగా తగ్గుతూ వస్తోంది. అయితే కరోనా కారణంగా అది మళ్లీ పెరుగుతోందని ఈ గణాంకాల ద్వారా స్పష్టమవుతోంది.

జీహెచ్‌ఎంసీలోనే అధికం

రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలతో పొల్చితే జీహెచ్‌ఎంసీలోనే ఎక్కువగా బా లకార్మికులున్నారు. ఇప్పటి వరకు రెస్క్యూ చేసిన చిన్నారుల్లో.. సగానికిపైగా హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోనే ఉండటం గమనార్హం. పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్రతో పాటు రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, బిహార్‌, మధ్యప్రదేశ్‌, ఝార్ఖండ్‌కు చెందిన చిన్నారులే అధికంగా హైదరాబాద్‌లో పనిచేస్తున్నారు.

అనాథలుగా 143 మంది

కరోనా సెకండ్‌వేవ్‌లో అనేక మంది చిన్నారులు తల్లిదండ్రులను పొగొట్టుకుని అనాథలయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 143 మంది అనాథలైనట్లు మహిళా, శిశు సంక్షేమశాఖ గుర్తించి తమకు సమాచారం ఇచ్చిందని పోలీస్‌ ఉన్నతాధికారులు తెలిపారు. అంగన్‌వాడీ టీచర్లు, డిస్ట్రిక్ట్‌ చైల్డ్‌ ప్రొటెక్షన్‌ యూనిట్ల సహకారంతో అనాథలకు తాత్కాలిక పునరావాసం కల్పించామని వివరించారు. అనాథలైన 143 మంది భవిష్యత్‌లో బాల కార్మికులుగా మారకుండా చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వ శాఖల సమన్వయంతో వారికి స్వయం ఉపాధి కల్పిస్తామని పేర్కొన్నారు. 


Advertisement
Advertisement