ఇకపై NRI లకు పిల్లలను దత్తత తీసుకోవడం చాలా సులువు..
ABN , First Publish Date - 2021-09-15T19:25:32+05:30 IST
ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐ), విదేశీయులకు పిల్లలను దత్తత ఇచ్చేందుకు సంబంధించిన ప్రక్రియను సరళతరం చేసేలా సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ (సీఏఆర్‌ఏ) పలు మార్గదర్శకాలకు రూపకల్పన చేసింది. ‘హిందూ దత్తతలు, నిర్వహణ చట్టం’ (హెచ్‌ఏఎంఏ) ప్రకారం వీటిని రూపొందించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రవాస భారతీయులు, విదేశీయులకు...
కలెక్టర్ వెరిఫికేషన్ జరగ్గానే ఎన్‌వోసీ
న్యూఢిల్లీ: ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐ), విదేశీయులకు పిల్లలను దత్తత ఇచ్చేందుకు సంబంధించిన ప్రక్రియను సరళతరం చేసేలా సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ (సీఏఆర్‌ఏ) పలు మార్గదర్శకాలకు రూపకల్పన చేసింది. ‘హిందూ దత్తతలు, నిర్వహణ చట్టం’ (హెచ్‌ఏఎంఏ) ప్రకారం వీటిని రూపొందించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రవాస భారతీయులు, విదేశీయులకు పిల్లలను దత్తత ఇస్తే పాటించాల్సిన నియమ నిబంధనలను తొలిసారిగా సీఏఆర్‌ఏ సిద్ధం చేసింది. పిల్లలను దత్తత తీసుకోవాలనుకునే విదేశీయులు, ఎన్‌ఆర్‌ఐలు స్థానిక కోర్టు నుంచి నిరభ్యంతర ధ్రువపత్రాన్ని(ఎన్‌ఓసీ) పొందడం కష్టతరంగా ఉండేది. ఇకపై ఆ అవసరం లేకుండా నేరుగా సీఏఆర్‌ఏ స్వయంగా ఎన్‌వోసీని జారీ చేస్తుంది. ఇందుకోసం జిల్లా మెజిస్ట్రేట్ (కలెక్టర్) ద్వారా జరిపిన వెరిఫికేషన్ నివేదికను ప్రాతిపదికగా తీసుకుంటుందని సంబంధిత అధికారవర్గాలు పేర్కొన్నాయి. ఇక దేశంలోపసి పిల్లలను దత్తత ఇచ్చే క్రమంలో సొంత రాష్ట్రం వారికే తొలి ప్రాధాన్యం ఇచ్చేలా నిబంధనలు వచ్చే అవకాశం ఉందని తెలిపాయి.