వంట నూనెకు చైనా మంట

ABN , First Publish Date - 2021-01-07T09:09:42+05:30 IST

కరోనాతో ప్రపంచాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టిన చైనా, ఇప్పుడు వంట నూనెల ధరలు భారీగా పెరగడానికీ కారణమైంది.

వంట నూనెకు చైనా మంట

  • అన్ని నూనెలూ కిలో వందపైనే
  • లాక్‌డౌన్‌ తర్వాత భారీగా డ్రాగన్‌ నిల్వలు
  • అంతర్జాతీయంగా పెరిగిపోయిన ధరలు
  • రాష్ట్రంలో తగ్గిన ఆయిల్‌పామ్‌ ఉత్పత్తి
  • ఎక్కువ ధరకు తెలంగాణలో అమ్మకం


 (అమరావతి-ఆంధ్రజ్యోతి): కరోనాతో ప్రపంచాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టిన చైనా, ఇప్పుడు వంట నూనెల ధరలు భారీగా పెరగడానికీ కారణమైంది. పామాయిల్‌ నుంచి వేరుశెనగ వరకు అన్ని నూనెల ధరలూ ఆకాశాన్ని అంటుతున్నాయి. గత ఆరునెలల్లో వంట నూనెల ధరలు 30-40 శాతం పెరిగిపోవడంతో  కొనాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి వచ్చింది. ఆరు నెలల కిందట లీటరు పామాయిల్‌ ధర రూ.75 ఉంటే ఇప్పుడది రూ.100కు చేరింది. సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ రూ.102 నుంచి రూ.140కు, వేరుశెనగ నూనె రూ.120 నుంచి రూ.150కు పెరిగాయి. సాధారణంగా ధరలో హెచ్చుతగ్గులు ఏర్పడుతుంటాయి. కానీ, వంటనూనెల ధర పెరగడమే తప్ప తగ్గడం కనిపించడం లేదు. మరో నెలన్నర వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వ్యాపార వర్గాలు అంటున్నాయి. ఆ తర్వాత కూడా తగ్గుతాయనే నమ్మకం లేదంటున్నాయి. నిత్యావసరాల ధరల నియంత్రణను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇటీవల కందిపప్పు ధరలు చుక్కలను తాకినా ఇప్పుడు వంటనూనె ధరలు పెరిగినా పట్టించుకున్న దాఖలాల్లేవు. కాగా, తెగులు వల్ల ఈ ఏడాది రాష్ట్రంలో ఆయిల్‌ పామ్‌ ఉత్పత్తి సుమారు 30శాతం తగ్గిపోయింది. ఇది ధరలపై కొంత ప్రభావం చూపింది. 


చైనా రిజర్వులే కారణం.. 

కరోనా, లాక్‌డౌన్‌ తర్వాత చైనా వంట నూనెల రిజర్వు నిల్వలను భారీగా పెంచేస్తోంది. ఇది కూడా భారత్‌లో వంట నూనెల ధర పెరగడానికి కారణమవుతోంది. ముఖ్యంగా కరోనా, లాక్‌డౌన్‌ కాలాల్లో చాలా దేశాలు ఎగుమతి, దిగుమతులను ఆపేశాయి. దీంతో నూనెలను దిగుమతి చేసుకునే దేశాల్లో తీవ్ర కొరత ఏర్పడింది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టాక ఎగుమతి, దిగుమతులను పునరుద్ధరించారు. ఈ నేపథ్యంలో చైనా ముందుచూపుతో భారీగా వంటనూనెలను దిగుమతి చేసుకోవడంతోపాటు, భారీగా నిల్వ చేయడం ప్రారంభించింది. ఇది అంతర్జాతీయంగా వంటనూనెల ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. ముడి పామాయిల్‌ సగటు దిగుమతి ధర గతేడాది మేలో రూ.41,000 ఉండగా, నవంబరుకు అది రూ.63,830కి పెరిగింది. అలాగే, సోయాబీన్‌ ధర రూ.48,550 నుంచి రూ.72,460కి, ముడి సన్‌ఫ్లవర్‌ ధర రూ.52,863 నుంచి రూ.83,930కి పెరిగింది. 2019-నవంబరు నుంచి 2020-అక్టోబరు వరకు 13.2 మిలియన్‌ టన్నుల వంట నూనెలను భారత్‌ దిగుమతి చేసుకుంది. వాటిలో ప్రధానంగా పామాయిల్‌ను ఇండోనేసియా, మలేసియా దేశాల నుంచి, సోయా నూనెను అర్జెంటీనా, బ్రెజిల్‌ దేశాల నుంచి, సన్‌ఫ్లవర్‌ నూనెను ఉక్రెయిన్‌, రష్యా, అర్జెంటీనా నుంచి భారత్‌ దిగుమతి చేసుకుంది. వీటిలో అత్యధికంగా 7.21 మిలియన్‌ టన్నులు పామాయిల్‌ ఉంది. ఇక వంట నూనెలపై మన దేశంలో దిగుమతి సుంకాలు భారీగా ఉన్నాయి. ముడి పామాయిల్‌పై 37.5 శాతం, రిఫైన్డ్‌ పామాయిల్‌పై 45 శాతం, ముడి సోయాబీన్‌, ముడి సన్‌ఫ్లవర్‌ నూనెలపై 35 శాతం దిగుమతి సుంకాలను భారత ప్రభుత్వం విధిస్తోంది. దిగుమతి సుంకాలను తగ్గిస్తే కొంత వరకు ధరలు తగ్గుతాయని వ్యాపారులు చెబుతున్నారు.

Updated Date - 2021-01-07T09:09:42+05:30 IST