Abn logo
Apr 5 2021 @ 10:12AM

హయత్‌నగర్‌‌లో చిట్టీల పేరుతో 4 కోట్లకు టోకరా

  • కరోనా వచ్చిందని కనిపించకుండా పోయిన నిర్వాహకురాలు
  • ఇల్లు, పోలీ‌స్‌స్టేషన్‌ ముందు బాధితుల ధర్నా 
  • తనకు సంబంధం లేదంటున్న కొడుకు

హైదరాబాద్/హయత్‌నగర్‌ : చిట్టీల పేరుతో సుమారు నాలుగున్నర కోట్లు వసూలు చేసిన ఓ మహిళ కనిపించకుండా పోయింది. దీంతో బాధితులు నిర్వాహకురాలి ఇంటి ముందు ఆదివారం ఆందోళనకు దిగారు. అనంతరం హయత్‌నగర్‌ పోలీ‌స్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. పోలీసుల కథనం ప్రకారం.. సప్పిడి పూలమ్మ అలియాస్‌ అప్పమ్మ 20 సంవత్సరాలుగా హయత్‌నగర్‌ ప్రగతినగర్‌ కాలనీలో నివాసం ఉంటోంది. సొంత ఇంటి వద్ద పాడి గేదెలను పెంచుతూ పాల వ్యాపారం చేస్తోంది. భర్త ప్రతా్‌పరెడ్డి, కోడలు పారిజాతం సహాయంతో చిట్టీల వ్యాపారం కూడా నిర్వహిస్తోంది. ఆరు నెలల క్రితం భర్త ప్రతా్‌పరెడ్డి మృతి చెందాడు. కొడుకు వనస్థలిపురం పనామా వద్ద ఫ్లెక్సీ షాపు నిర్వహిస్తాడు. పూలమ్మ వద్ద కాలనీ చుట్టూ ఉంటున్న ఎంతో మంది పేదలు లక్ష మొదలుకుని రెండు లక్షల దాకా చిట్టీలు వేశారు. కొందరు చిట్టీ ఎత్తుకుని పూలమ్మకే రూ.2 చొప్పున వడ్డీకి ఇస్తారు.

అదే వడ్డీ పైసలు మరో చిట్టీకి చెల్లిస్తారు. అలా ఒక్కొక్కరు సుమారు రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు పూలమ్మకు ఇచ్చారు. భర్త చనిపోయిన తర్వాత నుంచీ పూలమ్మ మిత్తి పైసలు ఇవ్వడంలో ఆలస్యం చేస్తోంది. అప్పటి నుంచీ బాధితులు పూలమ్మను డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. రేపు మాపు అంటూ ఆరు నెలలుగా దాటవేస్తోంది. మూడు రోజుల క్రితం కరోనా వచ్చిందని పూలమ్మ కనిపించకుండా పోయింది. ఉన్నట్టుండి శనివారం సాయంత్రం గేదెలను మరో చోటికి తరలించింది. ఇదంతా గమనించిన బాధితులు పూలమ్మ ఎక్కడికో వెళ్లిపోతోందని ఆదివారం ఉదయం ఆమె ఇంటి వద్ద ఆందోళన చేశారు. 


నాకు సంబంధం లేదు..

తమ డబ్బులు కోసం బాధితులు పూలమ్మ కొడుకు నరే‌ష్‌రెడ్డిని డిమాండ్‌ చేస్తున్నారు. తనకు ఏ సంబంధం లేదని, ఎవరిని అడిగి అంత డబ్బు ఇచ్చారని ఎదురు ప్రశ్నిస్తున్నాడు. బాధితులు మాట్లాడుతూ తమ డబ్బుతో భూములు, విలువైన ప్లాట్లు కొనుగోలు చేశారని, ఈ వ్యవహారం మొత్తం కోడలు పారిజాతానికి తెలుసునని అంటున్నారు. కష్టపడి సంపాదించుకున్న తమ డబ్బులు ఎగ్గొట్టాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  


వడ్డీకి ఆశపడి

రెండు రూపాయల వడ్డీకి ఆశపడి కొందరు బాధితులు ఎత్తుకున్న చిట్టీ డబ్బులు తిరిగి పూలమ్మకే ఇచ్చేవారు. ఒంగూరు పద్మ అనే మహిళ భర్తకు తెలియండా ఆమె, ఆమెకు తెలియకుండా భర్త ఇలా కొడుకు, కోడలు నలుగురూ కలిసి రూ. 10 లక్షల వరకూ పూలమ్మకు ఇచ్చారు. అంజమ్మ అనే వృద్ధురాలు రూ. 6 లక్షలు, గాలమ్మ అనే మరో మహిళ రూ. 2.50 లక్షలు ఇచ్చారు. ఇలాంటి వారు దాదాపు 100 మందిపైనే ఆమె వద్ద చిట్టీలు వేసినట్లు అంచనా. మొత్తం సొమ్ము సుమారు  నాలుగు కోట్ల వరకూ ఉంటుందని బాధితులు చెబుతున్నారు. హయత్‌నగర్‌ పోలీసులు బాధితుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. 

Advertisement
Advertisement
Advertisement