ఏకపక్షంగా ఒప్పందం రద్దు

ABN , First Publish Date - 2022-09-16T09:00:48+05:30 IST

ఏకపక్షంగా ఒప్పందం రద్దు

ఏకపక్షంగా ఒప్పందం రద్దు

ప్రాజెక్టు పనుల కోసం 200 కోట్లు ఖర్చు చేశాం 

ఇతరులకు కాంట్రాక్టు ఇవ్వకుండా స్టేటస్‌ కో ఇవ్వండి

హైకోర్టులో ఎన్‌ఎంపీఎల్‌ తరఫు న్యాయవాది వినతి 


అమరావతి, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): బందరు పోర్టు నిర్మాణం విషయంలో తమతో చేసుకున్న కన్‌సెషన్‌ అగ్రిమెంట్‌ మేరకు తన బాధ్యతలు నిర్వర్తించడంలో ప్రభుత్వం విఫలమైందని నవయుగ మచిలీపట్నం పోర్టు లిమిటెడ్‌ (ఎన్‌ఎంపీఎల్‌) హైకోర్టుకు తెలియజేసింది. ఎన్‌ఎంపీఎల్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌  వాదనలు వినిపించారు. ఒప్పందం ప్రకారం పోర్టు నిర్మాణానికి అవసరమైన మొత్తం భూమిని ఒకేసారి అప్పగించాలన్నారు. ప్రభుత్వం ఇస్తామన్న భూమి కూడా వివాదాల్లో ఉందని తెలిపారు. పిటిషనర్‌ ఒప్పంద నిబంధనలు పాటించలేదని ప్రభుత్వం భావిస్తే ముందుగా నోటీసులు ఇచ్చి, నిర్దిష్ట గడువు ముగిశాకే రద్దు చేసుకోవాలన్నారు. నిబంధనలేమీ పట్టించుకోకుండా ప్రభుత్వం ఏకపక్షంగా ఒప్పందాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు. ఒప్పందంలోని షరతుల మేరకు ప్రభుత్వం నడుచుకోలేదనే విషయాన్ని సింగిల్‌ జడ్జి పరిగణనలోకి తీసుకోలేదన్నారు. ఈ వ్యవహారంలో స్టేటస్‌ కో ఉత్తర్వులు ఇవ్వకపోతే కాంట్రాక్ట్‌ను వేరేవారికి అప్పగించే ప్రమాదం ఉందన్నారు. ఎన్‌ఎంపీఎల్‌ తరఫున వాదనలు ముగియడంతో ప్రభుత్వం తరఫున ఏజీ పూర్తిస్థాయి వాదనల కోసం విచారణ మంగళవారానికి వాయిదా వేస్తూ జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌, జస్టిస్‌ ఏవీ రవీంద్రబాబుతో కూడిన ధర్మాసనం గురువారం ఆదేశాలిచ్చింది. ఒప్పందం మేరకు బందరు పోర్టు నిర్మాణాన్ని నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయడంలో నవయుగ మచిలీపట్నం పోర్ట్‌ లిమిటెడ్‌ విఫలమైందంటూ 2019లో ప్రభుత్వం కన్‌సెషన్‌ ఒప్పందాన్ని రద్దు చేసింది. దీన్ని సవాల్‌ చేస్తూ ఎన్‌ఎంపీఎల్‌ డైరెక్టర్‌ వై.రమేశ్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాన్ని విచారించిన సింగిల్‌ జడ్జి... ప్రభుత్వ ఉత్తర్వులను సమర్థిస్తూ ఎన్‌ఎంపీఎల్‌ పిటిషన్‌ను గత నెల 25న కొట్టివేశారు. ఆ తీర్పును సవాల్‌ చేస్తూ ఎన్‌ఎంపీఎల్‌ ధర్మాసనం ముందు అప్పీల్‌ వేసింది. ఈ వ్యాజ్యం గురువారం విచారణకు రాగా దమ్మాలపాటి వాదనలు వినిపించారు. ‘‘ఒప్పందంలోని నిబంధన 3.2.1(బి) ప్రకారం ప్రాజెక్టు పనులు ప్రారంభానికి ముందే అవసరమైన మొత్తం 4800 ఎకరాల భూమిని ఒకేసారి అప్పగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రభుత్వం ఇవ్వజూపిన 2900 ఎకరాల్లో 539 ఎకరాల విషయంలో మాత్రమే ఎలాంటి వివాదం లేదు. భూములు ఆక్రమణలో ఉన్నాయని తహసీల్దార్‌ ఇచ్చిన నివేదికలో కూడా పేర్కొన్నారు. భూమిని అప్పగించకుండా 2018 నాటికి ఫైనాన్సియల్‌ క్లోజర్‌ ఏవిధంగా సాధ్యం? పోర్టు నిర్మాణ ప్రాంతానికి చేరుకునేందుకు మౌలిక వసతులు కల్పించడంతో పాటు ప్రాజెక్టు అవసరమైన భూములు ఎలాంటి వివాదం లేకుండా ఎన్‌ఎంపీఎల్‌కు అప్పగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సింగిల్‌ జడ్జి పరిగణనలోకి తీసుకోవాల్సింది. రాయితీలకు వీలు కల్పిస్తున్న స్టేట్‌ సపోర్ట్‌ అగ్రిమెంట్‌ (ఎన్‌ఎ్‌సఏ) అమలు చేయాలని ఎన్‌ఎంపీఎల్‌ చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రాజెక్టు పనుల కోసం ఇప్పటికే రూ.200 కోట్లు ఖర్చు చేశాం. నిర్మాణ పనులు వేరే సంస్థకు అప్పగించకుండా స్టేటస్‌ కో ఉత్తర్వులు ఇవ్వకపోతే తీవ్రంగా నష్టపోతాం. తగిన ఉత్తర్వులు ఇవ్వండి’’ అని కోరారు.

Updated Date - 2022-09-16T09:00:48+05:30 IST