సివిల్స్‌ మెరిసిన మృగేంధర్‌

ABN , First Publish Date - 2020-08-05T09:39:26+05:30 IST

జాతీయ స్థాయి సివిల్స్‌ పరీక్షల్లో ఖమ్మం కుర్రాడు మరోసారి మెరిశాడు. వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్‌లాల్‌ కుమారుడు బానోతు

సివిల్స్‌ మెరిసిన మృగేంధర్‌

జాతీయస్థాయిలో 505వ ర్యాంకు

ఐపీఎస్‌గా శిక్షణ పొందుతూ ఐఏఎస్‌కు.. 

నాన్న లక్ష్యాన్ని నేరవేర్చడమే ధ్యేయం : మృగేంధర్‌లాల్‌


ఖమ్మం కలెక్టరేట్‌, ఆగస్టు 4 : జాతీయ స్థాయి సివిల్స్‌ పరీక్షల్లో ఖమ్మం కుర్రాడు మరోసారి మెరిశాడు. వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్‌లాల్‌ కుమారుడు బానోతు మృగేంధర్‌లాల్‌ జాతీయస్థాయిలో సివిల్స్‌లో 505వ ర్యాంకు సాధించాడు. రఘునాధపాలెం మండలం ఈర్లపూడి గ్రామానికి చెందిన మృగేంధర్‌లాల్‌ గతేడాది సివిల్స్‌లో 551వ ర్యాంకు సాధించి ప్రస్తుతం ఐపీఎస్‌గా నాసిక్‌లో శిక్షణ పొందుతున్నాడు. అక్కడ శిక్షణ పొందుతూనే మంగళవారం ప్రకటించిన ఈ ఏడాది సివిల్స్‌ ఫలితాల్లోనూ 505వ ర్యాంకు సాధించి మరోమారు సత్తా చాటాడు. 


నాలుగో ప్రయత్నంలో..

మృగేంధర్‌ స్వగ్రామం ఖమ్మానికి సమీపంలోని రఘునాఽథపాలెం మండలంలోని ఈర్లపూడి గ్రామం. మొదటి నుంచి చదువులో ముందుండే మృగేంధర్‌ ఒకటో తరగతి నుంచి  ఐదు వరకు ఖమ్మంలో న్యూ ఇరా పాఠశాలలతో ఆ తర్వాత పదోతరగతివరకు సెంచరీ స్కూల్‌లో, ఇంటర్మీడియట్‌ హైదరాబాద్‌ కళాశాలలో చదివాడు. ఆ తర్వాత మద్రాస్‌ ఐఐటీలో ఎలక్ర్టానిక్స్‌లో బీటెక్‌ పూర్తిచేశాడు. ఆంథ్రోపాలజీ ఆప్షనల్‌ సబ్జెక్టుగా తీసుకుని ఢిల్లీలోని వాజీరాం ఇన్‌స్టిట్యూట్‌ లో శిక్షణ పొందాడు. 2016-17లో మొదటిసారి పరీక్ష రాసినప్పుడు ర్యాంకు రాలేదు. రెండో సారిగా 2017-18లో రాయగా అప్పుడు ఇంటర్వ్యూ వరకు వచ్చి మిస్సయ్యాడు. ఆ తర్వాత 2018-19లో ఐపీఎస్‌గా ఎంపికయ్యాడు. ఆరు నెలలక్రితం నేషనల్‌ పోలీస్‌ అకాడమీలో శిక్షణ పొందిన మృగేంధర్‌ ప్రస్తుతం మహారాష్ట్రలో నాసిక్‌లో పోలీస్‌ శిక్షణ పొందుతున్నాడు. ఆ శిక్షణ పొందుతూనే 2019-2020 ఏడాదికి సివిల్స్‌లో 505 ర్యాంకు సాధించాడు, నాలుగో ప్రయత్నంలో సివిల్స్‌లో ఐఏఎస్‌ను పట్టుదలతో సాధించి ఔరా అనిపించాడు. 


మృగేంధర్‌ ఏమంటున్నాడంటే..

‘మా నాన్న కలెక్టర్‌ కావాలన్నది తాతయ్య కల. కానీ తీరలేదు. కానీ నాన్న లక్ష్యాన్ని నెరవేర్చాలన్న లక్ష్యంతో చదివా. లక్ష్యాన్ని ఎంచుకున్నప్పుడు దాన్ని సులువుగా సాధించే మార్గాన్ని అన్వేషించాలి. మూడేళ్లుగా ఎవరితో సంబంధాలు పెట్టుకోకుండా కష్టించి చదివా. ఏ అంశాన్ని ఎంత వరకు అవసరం తెలుసుకున్న దాన్ని ఎలా గుర్తించుకోవాలన్న సందేహాలకు సమాధానాలు దొరికితే విజయం మనదవుతుంది. మా తాతయ్య.. మా నాన్న మదన్‌లాల్‌ను కలెక్టర్‌గా చూడాలని ఆశపడ్డాడు. కానీ నాన్నేమో అనకోకుండా రాజకీయాలకు వచ్చాడు. సర్పంచ్‌ నుంచి ఎమ్మెల్యే వరకు అయ్యారు. కానీ తాతయ్య కలను మాత్రం నెరవేర్చలేక పోయారన్న వెలితి ఉంది. తాతయ్య కల.. నాన్న లక్ష్యాన్ని నేను తీర్చాలని అనుకున్నా. అదే లక్ష్యంతో సివిల్స్‌కు సిద్ధమయ్యా. నాన్న మదన్‌లాల్‌ ఎమ్మెల్యే అయినప్పటికీ నావెన్నంటి ఉండే వారు. ఎంతటి ఒత్తిడిలో ఉన్నా రైల్వేస్టేషన్‌కు వచ్చిరైలు ఎక్కించేవాడు.. ఆయన ప్రోత్సాహమే నా విజయానికి కారణం. మాది రాజకీయ కుటుంబం కావడంతో సమాజాన్ని దగ్గరిగా చూశా. ఐఏఎస్‌ లాంటి ఉన్నత చదువులతో సమాజానికి మరింత దగ్గరకావచ్చనేది నా ఉద్దేశం. 

Updated Date - 2020-08-05T09:39:26+05:30 IST