సీజేఐ జస్టిస్‌ రమణ యాదాద్రి పర్యటన వాయిదా

ABN , First Publish Date - 2021-06-14T08:53:11+05:30 IST

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ యాదాద్రి సందర్శనలో స్వల్ప మార్పు చోటుచేసుకుంది.

సీజేఐ జస్టిస్‌ రమణ యాదాద్రి పర్యటన వాయిదా

  • రేపు లేదా ఎల్లుండి సందర్శన
  • సీజేఐని కలిసిన అసెంబ్లీ స్పీకర్‌  పోచారం శ్రీనివాసరెడ్డి,
  • డీజీపీ మహేందర్‌రెడ్డి, పోలీసు ఉన్నతాధికారులూ..


హైదరాబాద్‌, యాదాద్రి, బర్కత్‌పుర, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ యాదాద్రి సందర్శనలో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. తన తండ్రి తిథి సోమవారం ఉండడంతో ఆలయ సందర్శనను ఆయన వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. మంగళవారం లేదా బుధవారం ఆయన యాదాద్రికి వెళ్లే అవకాశాలున్నట్లు అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్‌కు విచ్చేసిన సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణను యాదాద్రి ఆలయ సందర్శనకు సీఎం కేసీఆర్‌ ఆహ్వానించిన సంగతి తెలిసిందే. దీంతో.. ఆ లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రాన్ని తప్పక దర్శిస్తానని సీజేఐ ఆయనకు తెలిపారు. ఈ మేరకు ఆయన పర్యటన సోమవారం ఉండొచ్చని అధికారవర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి. కానీ, అది మంగళవారానికి వాయిదా పడినట్టు ఆలయ వర్గాలు తెలిపాయి. కాగా.. సీజేఐ జస్టిస్‌ రమణ రాక సందర్భంగా ఆయన హోదాకు తగినట్టుగా ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు ఉండాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఈ మేరకు మంత్రి జగదీశ్‌ రెడ్డి, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, సీఎంవో ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌ రెడ్డి.. శనివారమే (12న) కొండపై ఏర్పాట్లను పరిశీలించారు. సీజేఐ వెంట యాదాద్రి ఆలయ సందర్శనకు రాష్ట్ర హైకోర్టు సీజే జస్టిస్‌ హిమ కోహ్లి, ఇతర న్యాయమూర్తులు, జిల్లా మంత్రి, అధికారులు పాల్గొంటారని తెలుస్తోంది.


ప్రముఖుల శుభాకాంక్షలు 

రాజ్‌భవన్‌లో బస చేసిన సీజేఐ జస్టిస్‌ రమణను ఆదివారం పలువురు ప్రముఖులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివా్‌సరెడ్డి ఆయనను కలిసి.. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైనందుకు శుభాకాంక్షలు తెలిపి పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. అలాగే.. జస్టిస్‌ జోయ్‌మాల్యా బాగ్చి, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, జస్టిస్‌ ఎం.ఎన్‌.రావ్‌ (మాజీ సీజే), జస్టిస్‌ విలాస్‌ అఫ్జల్‌ పుర్కర్‌, జస్టిస్‌ సి.వై.సోమయాజులు, జస్టిస్‌ ఎం.ఎ్‌స.కె.జైస్వాల్‌, జస్టిస్‌ యతిరాజులు, జస్టిస్‌ సీతారామ మూర్తి, జస్టిస్‌ ఎల్‌.నర్సింహా రెడ్డి (పట్నా హైకోర్ట్‌ మాజీ సీజే, సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రిబ్యునల్‌ చైర్మన్‌), జస్టిస్‌ భవానీ ప్రసాద్‌, జస్టిస్‌ సీవీ రాములు (లోకాయుక్త, తెలంగాణ), జస్టిస్‌ వామన్‌రావు, జస్టిస్‌ జి.భిక్షపతి సీజేఐను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. 


మానవహక్కుల కమిషన్‌ చైర్మన్‌ జి.చంద్రయ్యతో పాటు సభ్యులు ఆనందరావు, ఇర్ఫాన్‌ మొయినుద్దీన్‌, కార్యదర్శి విద్యాధర్‌ భట్‌ సీజేను కలిసి సత్కరించారు. ఎస్‌ఆర్‌నగర్‌లోని సీజే నివాసంలో జస్టిస్‌ ఎన్వీ రమణను మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. బల్కంపేట ఎల్లమ్మ దర్శనానికి రావాలని ఆహ్వానించారు. రెండు, మూడు రోజుల్లో వీలు చూసుకుని వస్తానని సీజేఐ హామీ ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. అలాగే.. డీజీపీ మహేందర్‌ రెడ్డి, హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌, సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌, రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ప్రభాకర్‌రావు సీజేఐని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, ఆలిండియా జుడిషియల్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు కూడా పుష్పగుచ్ఛాలు అందజేశారు.

Updated Date - 2021-06-14T08:53:11+05:30 IST