ముగిసిన ధాన్యం సేకరణ

ABN , First Publish Date - 2021-06-22T04:27:23+05:30 IST

యాసంగి ధాన్యం సేకరణ ఖమ్మం జిల్లాలో సోమవారంతో పూర్తయ్యింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో మిల్లర్ల కేటాయింపు, ధాన్యం రవాణాలో తీవ్ర జాప్యం జరగడంతో కొనుగోళ్లు మందగించాయి.

ముగిసిన ధాన్యం సేకరణ

ఖమ్మం జిల్లాలో 3,40,374 మెట్రిక్‌టన్నుల కొనుగోలు

44,683 మంది రైతులకు రూ.680.06కోట్ల చెల్లింపులు

ఖమ్మం కలెక్టరేట్‌, జూన్‌ 21: యాసంగి ధాన్యం సేకరణ ఖమ్మం జిల్లాలో సోమవారంతో పూర్తయ్యింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో మిల్లర్ల కేటాయింపు, ధాన్యం రవాణాలో తీవ్ర జాప్యం జరగడంతో కొనుగోళ్లు మందగించాయి. దీంతో కొనుగోలు కేంద్రాల్లో రైతులు, అధికారులు అవస్థలు పడ్డారు. జిల్లా వ్యాప్తంగా 445కేంద్రాలు ప్రారంభించాలని భావించినా 306 కేంద్రాల ద్వారా ధాన్యాన్ని సేకరించారు. సోమవారంతో కొనుగోలు కేంద్రాలన్నీ మూసేసినట్టు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. వానాకాలంలో జిల్లాలో రైతులు పండించిన ధాన్యం సేకరణ సజావుగా జరిగినా యాసంగిలో అనేక ఇబ్బందులు తలెత్తాయి. జిల్లాలో ధాన్యం దిగుబడులు అధికంగా రావడం.. పార్‌బాయిల్డ్‌ మిల్లులు లేని కారణంగా ఇతర జిల్లాల మిల్లులపై ఆధారపడాల్సి వచ్చింది. మొత్తంగా  306 కొనుగోలు కేంద్రాల్లో 44,683 మంది రైతుల నుంచి  3,40,217.280 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించిన అధికారులు దాదాపు 680.06కోట్లు చెల్లించి.. ఖమ్మం జిల్లాను రాష్ట్రంలో మూడోస్థానంలో నిలిపారు. వానాకాలంలో రైతులు అధికంగా సన్నరకాలు పండి ంచడంతో జిల్లా అవసరాలకు అనుగుణంగా మిల్లింగ్‌ చేశారు. అప్పట్లో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాలేదు. యాసంగిలో దాదాపు లావురకాలనే అధికంగా సాగుచేయడంతో వాటిని పార్‌బాయిల్డ్‌ మిల్లులకే రవాణా చేయాల్సి వచ్చింది. జిల్లాలో కేవలం ఎనిమది మాత్రమే పార్‌బాయిల్డ్‌ మిల్లులు ఉండడంతో సేకరించిన ధాన్యాన్ని నల్లగొండ, కరీంనగర్‌, పెద్దపల్లి, సూర్యాపేట, వరంగల్‌ జిల్లాలకు తరలించారు. అయితే అక్కడ జిల్లాల్లో కూడా ధాన్యం అధికంగా రావడంతో జిల్లానుంచి తరలించిన ధాన్యాన్ని మిల్లర్లు దిగుమతి చేసుకోవడంలో తీవ్ర జాప్యమైంది. అక్కడ రోజుల తరబడి వేచి ఉండాల్సి రావడం.. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణపై ప్రభావం పడింది. అది ప్రత్యక్షంగా రైతులు సమస్యలను అనుభవించాల్సి వచ్చింది. అయినా కలెక్టర్‌ ఆర్వీకర్ణన్‌, అదనపు కలెక్టర్‌ ఎన్‌ మఽధుసూదన్‌, జిల్లా పౌరసరఫరాల సంస్థ అధికారులు సోములు, రాజేందర్‌ ఎప్పటికప్పుడు రవాణాపై దృష్టిసారించి సమస్యలను అధిగమించగలిగారు. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ కూడా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రితో ఫోన్లో మాట్లాడి జిల్లా సమస్యలను పరిష్కరించారు. జిల్లాలో 44,683 మంది రైతుల నుంచి 680 కోట్ల 06లక్షల 54,955 విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేశారు. వీటిలో  27,789 మంది రైతులకు ఇప్పటి వరకు రూ. 439 కోట్ల 12లక్షల 58,259లను చెల్లించారు. ఇంకా 16,894 మందికి రూ.240 కోట్ల 94లక్షల 06,696ను చెల్లించాల్సి ఉంది.

పదిరోజుల్లో చెల్లింపులు పూర్తిచేస్తాం

ఎన్‌ మధుసూదన్‌, ఖమ్మం అదనపు కలెక్టర్‌

జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు సోమవారంతో ముగిసింది. ఇప్పటి వరకు రూ 680 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేశాం. మిల్లింగ్‌ కూడా దాదాపు పూర్తికావచ్చింది. ధాన్యాన్ని మరాడించడం కూడా వేగిరం చేస్తున్నాం. ఇంకా మిగిలిన రూ 240 కోట్లతో పది రోజుల్లో చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నాం.

ఖమ్మం జిల్లాలో ధాన్యం సేకరణ వివరాలు ఇలా :

మొత్తం కొనుగోలు కేంద్రాలు : 445

తెరిచినవి : 306

కొనుగోలు చేసిన ధాన్యం : 3,40,217.280 మెట్రిక్‌ టన్నులు

మొత్తం రైతులు : 44,683

ధాన్యం విలువ : రూ.680.06కోట్లు

ఇప్పటి వరకు చెల్లించినవి : రూ.439.12కోట్లు

ఇంకా చెల్లించాల్సినవి : రూ.240.94కోట్లు

Updated Date - 2021-06-22T04:27:23+05:30 IST