మరియమ్మ కుటుంబానికి న్యాయం చేయాలి: సీఎల్పీ నేత భట్టి

ABN , First Publish Date - 2021-06-22T05:09:41+05:30 IST

మరియమ్మ కుటుంబానికి న్యాయం చేయాలి: సీఎల్పీ నేత భట్టి

మరియమ్మ కుటుంబానికి న్యాయం చేయాలి: సీఎల్పీ నేత భట్టి
ఖమ్మం ఆసుపత్రి వద్ద విలేకరులతో మాట్లాడుతున్న సీఎల్పీ నేత భట్టి

గవర్నర్‌ను, అవసరమైతే సీఎంను కలుస్తాం

దళిత సాధికారతపై మాట్లాడే అర్హత కేసీఆర్‌కు లేదు

పోలీసులకు విచ్చలవిడి అధికారాలివ్వడం వల్లే ఇలాంటి ఘటనలు.. 

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపాటు 

ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో మరియమ్మ కుమారుడికి పరామర్శ

ఖమ్మం, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : ‘యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసుల అదుపులో ఉండి మృతిచెందిన మరియమ్మ కుటుంబానికి న్యాయం చేయాలి. అప్పటి వరకు మేం పోరాడుతూనే ఉంటాం. పోలీసులకు విచ్చలవిడి అధికారాలు ఇవ్వడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. పోలీసుల తీరు దళితుల మరణాలకు కారణమవుతోంది. ఇలాంటి క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దళిత సాధికారత గురించి మాట్లాడే అర్హతలేదు’ అని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఓ చోరీ కేసు విషయమై యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకోగా.. మృతిచెందిన ఖమ్మం జిల్లా చింతకాని మండలం కోమట్లగూడేనికి చెందిన అంబడిపూడి మరియమ్మ కుమారుడు ఉదయ్‌కిరణ్‌ను ఆయన సోమవారం ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో పరామర్శించారు. ఈ సందర్భంగా భట్టి విలేకరులతో మాట్లాడారు. మరియమ్మ మృతి కేసును తప్పుదారి పట్టించి, ఆమె మరణానికి కారణమైన, ఆమె కుమారుడిని తీవ్రంగా గాయపరిచిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దొంగతనం కేసు విషయంలో అడ్డగూడూరు పోలీసులు మరియమ్మ, ఆమె కుమారుడు ఉదయ్‌కిరణ్‌, అతడిస్నేహితుడు శంకర్‌ను పోలీసులు విచక్షణారహితంగా చితకబాదారని ఆరోపించారు. నాలుగురోజుల పాటు చిత్రహింసలకు గురిచేశారని, పోలీసులు కొట్టిన దెబ్బలు, పెట్టిన చిత్రహింసలవల్లే మరియమ్మ ఈనెల 18న అడ్డగూడూరు పోలీసుస్టేషన్‌లో మృతిచెందిందని భట్టి తెలిపారు. రాష్ట్రంలో పోలీసులకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విచ్చలవిడి అధికారాలు ఇవ్వడంతో సామాన్యులు, ఎస్సీ, ఎస్టీ వర్గాలు, పౌరుల హక్కుల కాలరాసేలా పోలీసులు ఇలాంటి దాష్టీక చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. నిజంగా దళిత సాధికారిత ఉంటే మరియమ్మ మృతికి కారకులైన పోలీసులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని, ఆమె కుటుంబానికి ప్రభు త్వం, రాజ్యాంగ పరంగా అందాల్సిన సహాయం ఎందుకు అందించలేదని ప్రశ్నించారు. మరియమ్మ చనిపోయిన సంఘటన బయటకు పొక్కకుం డా పోలీసులు దాచిపెట్టారని, ఇందుకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అలాగే మరియమ్మ కుటుంబానికి ఆర్థిక సాయంతో పాటు కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, ఇందుకోసం గవర్నర్‌ను కలిసి న్యాయం కోరతామని, అవసరమైతే సీఎంను కూడా కలిసి విన్నవిస్తామన్నారు. రాష్ట్రంలో దళిత, గిరిజనులకు అన్యాయం జరగకుండా ఒక రక్షణ వ్యవస్థను ఏర్పాటుచేయాలని, రాజ్యాంగాన్ని కాపాడాలని సూచించారు. లేదంటే పేదల కోసం ఏర్పాటు చేసిన చట్టాల అమలు కోసం కాంగ్రెస్‌ పక్షాన పోరాటం చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో పోలీ సులు చేస్తున్న దాష్టీకాలను కట్టడి చేయకపోతే రాష్ట్రంలో తిరుగుబాటు తప్పదని, పేద, దళిత గిరిజనులను పోలీసు వ్యవస్థతో చంపిస్తూ వారి శవాలపై నడుస్తూ అధికారం చెలాయిస్తామంటే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, కాంగ్రెస్‌ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ప్రీతమ్‌ తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌, సీపీని కలిసిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీసు స్టేషన్‌లో మృతిచెందిన మరియమ్మ కుటుంబానికి న్యాయం చేయాలని, మరియమ్మ, ఆమె కుమారుడు ఉదయ్‌కిరణ్‌ను కొట్టి హింసించిన వారిపై చర్యలు తీసుకోవాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్‌ తదితరులు కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, నగర పోలీసు కమిషనర్‌ విష్ణు ఎస్‌ వారియర్‌ను కలిసి విజ్ఞప్తిచేశారు. దొంగతనం కేసులో అమానుషంగా పోలీసులు వ్యవహరించారని, అనాగరికంగా కొట్టి హింసించారని, ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని సూచించారు. మరియమ్మ కుటుంబానికి ఎక్స్‌గ్రేషి యాతో పాటు బాధితుడు ఉదయ్‌కిరణ్‌కు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు.

నా తల్లి మరణానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోండి

ఖమ్మం సీపీకి ఉదయ్‌కిరణ్‌ ఫిర్యాదు

తన తల్లి మరియమ్మ మృతికి కారణమైన, నన్ను తీవ్రంగా కొట్టి గాయపరిచిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఎస్సీ, ఎస్టీ వేధింపులచట్టం కింద న్యాయం చేయాలని మృతురాలు మరియమ్మ కుమారుడు అంబడిపుడి ఉదయకిరణ్‌ ఖమ్మం పోలీసు కమిషనర్‌ విష్ణు ఎస్‌ వారియర్‌కు ఫిర్యాదు లేఖ పంపారు. ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉదయ్‌కిరణ్‌ ఆ ఫిర్యాదు ప్రతిని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు కూడా పంపాడు. తాము ఏ తప్పూ చేయలేదని, కానీ తమపై ఉన్న ఈర్ష్యతో తన బావ నాగరాజు చర్చిఫాదర్‌ బాలశౌరికి తమపై చెడుగా చెప్పడంతోనే ఇదంతా జరిగిందని, తమకు న్యాయం చేయాలని ఉదయ్‌కిరణ్‌ తన ఫిర్యాదులో సీపీని కోరాడు.

మా అమ్మ అడ్డగూడూరు పోలీసుస్టేషన్‌లోనే చనిపోయింది

‘ఆంధ్రజ్యోతి’తో ఉదయ్‌కిరణ్‌

తన తల్లి యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీసుస్టేషన్‌లోనే మృతి చెందిందని, తనను, తన స్నేహితుడిని కూడా విచక్షణా రహితంగా కొట్టారని అంబడిపూడి మరియమ్మ కుమా రుడు ఉదయ్‌కిరణ్‌ కన్నీటి పర్యంతమయ్యాడు. యాదాద్రి జిల్లా పోలీసులు కొట్టిన దెబ్బలతో తీవ్రంగా గాయపడి ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడిని ‘ఆంధ్రజ్యోతి’ సోమవారం పల కరించగా.. తన బాధను వెలిబుచ్చాడు. ‘మా అమ్మ మరియమ్మ యాదా ద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం గోవిందాపురంలో చర్చి ఫాదర్‌ వద్ద వంటపని చేస్తోంది. ఈనెల 3న మా అమ్మను చూడడానికి నేను, నా స్నేహితుడు శంకర్‌ కలిసి గోవిందాపురం వెళ్లి అక్కడే ఉన్నాం. చర్చిఫాదర్‌ హైదరాబాద్‌ వెళ్లి వచ్చారు. రూ.2లక్షలు పోయాయని  ఈనెల 7న మమ్మల్ని అడగడంతోపాటు మామీద దొంగతనం వేయడం తో భయపడి అక్కడినుంచి స్వగ్రామం చింతకాని మండలం కోమట్ల గూడెం బయల్దేరాం. సూర్యాపేట వచ్చిన తర్వాత ఫాదర్‌కు ఫోన్‌ చేసి.. మేం డబ్బులు తీయలేదు, మేం దొంగతనం చేయలేదని చెప్పాం. కానీ చర్చిఫాదర్‌ మాపై కేసు పెట్టడంతో ఈనెల 15న నలుగురు అడ్డ గూడూరు పోలీసులు కోమట్లగూడెం వచ్చి నన్ను, నాస్నేహితుడిని చింత కాని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి బెల్టు, కర్రలతో తీవ్రంగా కొట్టారు. 16న ఉదయం చింతకాని నుంచి కారులో అడ్డగూడూరు తీసు కెళ్లారు. మళ్లీ 17న ఉదయం చింతకానికి తీసుకువచ్చారు. అంతేకాదు విచారణ పేరుతో మా అమ్మను స్టేషన్‌కు తీసుకొచ్చి.. అనంతరం కొణిజర్లలో ఉంటున్న మా అక్కను కూడా పిలిపించారు. మా అక్కను స్టేషన్‌ బయట ఉంచి మా అమ్మను, నన్ను తీవ్రంగా కొట్టారు. మా అక్కను తిరిగి సొంతూరుకు పంపించారు. ఆతర్వాత 18న ఉదయం 4గంటలకు మళ్లీ కారులో మమ్మల్ని కొట్టుకుంటూనే అడ్డగూడూరు తీసుకెళ్లి, నన్ను, మా అమ్మను స్టేషన్‌లోని ఒక గదిలో, నాస్నేహితుడు శంకర్‌ను  మరో గదిలో ఉంచారు. పోలీసు దెబ్బలకు మా అమ్మకు ఆయాసం వచ్చింది. తీవ్రమైన భయానికి గురైంది. అరటిపండును చెరిసగం తిన్నాం. ఉదయం 9:30గంటల ప్రాంతంలో మా అమ్మ నా కాళ్లమీద పడిపోయింది. ఆమె లేవకపోవడంతో వెంటనే పోలీసులకు చెబితే వారు మా అమ్మను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత సాయంత్రానికి చనిపోయిందని చెప్పారు. మా అమ్మది సహజ మరణంకాదు, స్టేషన్‌ బయట చనిపోలేదు. అడ్డగూడూరు పోలీసులు కొట్టి, హింసించడం వల్ల పోలీసుస్టేషన్‌లోనే చనిపోయింది.’ అంటూ ఉదయ్‌కిరణ్‌ తన శరీరంపై గాయాలను చూపించాడు. తాము దొంగతనం చేయలేదని స్పష్టంచేస్తున్న ఉదయ్‌కిరణ్‌.. ఖమ్మం ఆసుపత్రిలో తనకు వైద్యం సక్రమంగానే అందుతోందని తెలిపాడు.

Updated Date - 2021-06-22T05:09:41+05:30 IST