లబ్ధిదారుల దీవెనలే ఆస్తులు

ABN , First Publish Date - 2021-04-13T08:52:35+05:30 IST

‘‘ఒక్కో వలంటీర్‌కు ఒక్కో కథ ఉంది. చెప్పడానికి సమయం చాలదు. మానవత్వం, మంచితనమే ప్రామాణికాలుగా ఎంతో సేవ చేస్తున్నారు.

లబ్ధిదారుల దీవెనలే ఆస్తులు

గ్రామాలకు, సర్కారుకు మధ్య వలంటీర్లే అసలైన వారధులు

విమర్శలను పట్టించుకోవద్దు

ఇక ఏటా మిమ్మల్ని సత్కరిస్తా

వలంటీర్లకు సీఎం సత్కారం


విజయవాడ, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి) : ‘‘ఒక్కో వలంటీర్‌కు ఒక్కో కథ ఉంది. చెప్పడానికి సమయం చాలదు. మానవత్వం, మంచితనమే ప్రామాణికాలుగా ఎంతో సేవ చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి వలంటీరూ మిత్ర, రత్న, వజ్రాలే’’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌...వలంటీర్లపై ప్రశంసల జల్లు కురిపించారు. రాష్ట్రంలో వలంటీర్‌ వ్యవస్థ ఏర్పాటుచేసి 20 నెలలు. ఈ సందర్భంగా వారికి సేవాపురస్కారాలు అందించే కార్యక్రమాన్ని కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం పోరంకి గ్రామంలో సోమవారం నిర్వహించారు. తొలుత మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం వలంటీర్లను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘‘ఇక నుంచి ప్రతి ఏడాది వలంటీర్లను సత్కరిస్తాం. సేవామిత్ర, సేవారత్న, సేవావజ్ర పురస్కారాలతో వలంటీర్లను గుర్తిస్తున్నాం.


ఇందుకోసం రూ.241కోట్లను కేటాయించాం. ఈ ఏడాది సేవామిత్ర పురస్కారాన్ని అందుకున్న వారు వచ్చే ఏడాదికి సేవారత్నగా మారాలి. సేవారత్న అందుకున్న సేవావజ్ర పురస్కారాన్ని అందుకోవడానికి సేవ చేయాలి. సేవామిత్ర పురస్కారానికి రాష్ట్రంలో 2,18,151 మందిని, సేవారత్నకు నాలుగువేల మందిని, సేవావజ్రకు ఒక్కో నియోజకవర్గం నుంచి ఐదుగురు చొప్పున ఎంపిక చేశాం’’ అని వివరించారు. త్వరలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒక నియోజకవర్గంలో, రాయలసీమలో ఒక నియోజకవర్గంలో ఈ కార్యక్రమంలో పాల్గొంటానని సీఎం జగన్‌ తెలిపారు. ‘‘పేదరికం కష్టాలు తెలిసిన వాళ్లు, వాటిని అనుభవించినవాళ్లే వలంటీర్లుగా చేరారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిస్వార్థంతో సేవ చేస్తున్నారు. సంక్షేమ పథకాలు అందుకుంటున్న లబ్ధిదారుల దీవెనలే వలంటీర్లకు పెద్ద ఆస్తి. కరోనా సమయంలో వలంటీర్లు కీలక భూమిక పోషించారు. సెలవు రోజుల్లోనూ ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలను అందజేశారు’’ అని వివరించారు. రాష్ట్రంలో కొంతమంది వలంటీర్లు చేసిన సేవా కార్యక్రమాలను జగన్‌ ఉదాహరణలతో సహా చదివి వినిపించారు.


‘‘32 రకాల సేవలను చేస్తూ ప్రజలకు గ్రామ, వార్డు సచివాలయాలకు, ప్రభుత్వానికి మధ్య అసలైన వారధిగా ఉన్న వలంటీర్లకు ఒక ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ప్రతిపక్షాలు, ఇతరులు ఎలాంటి విమర్శలు చేస్తున్నా భయపడకుండా క్రమశిక్షణతో ముందుకు సాగాలి’’ అని సూచించారు. అనంతరం వలంటీర్లకు అందజేసే నగదును వారి అకౌంట్లలో జమయ్యే కార్యక్రమాన్ని ఆన్‌లైన్‌లో ప్రారంభించారు. వలంటీర్లు చేసిన సేవకు సంబంధించిన చిత్రాలతో రూపొందించిన బుక్‌లెట్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పేర్ని నాని, వెలంపల్లి శ్రీనివాసరావు, పంచాయతీ రాజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, వలంటీర్‌ వ్యవస్థ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ జైన్‌, పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-13T08:52:35+05:30 IST