Abn logo
Jul 31 2021 @ 02:45AM

అర్హత ఉంటే 90 రోజుల్లో పట్టా

పేదలకు వసతి సమస్య రావద్దనే 

30 లక్షల ఇళ్లు మంజూరు చేశాం

మున్సిపల్‌ రోడ్లపై దృష్టి పెట్టండి

పుర అధికారులతో సీఎం 

వర్షాకాలం పోగానే మరమ్మతులు

సచివాలయాల్లో రిజిస్ర్టేషన్లకు సన్నద్ధం


అమరావతి, జూలై 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అర్హులైన పేదలందరికీ దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లో ఇంటి స్థలాలను ప్రభుత్వం మంజూరుచేస్తుందని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అన్నారు. పేదలు ఆక్రమించుకొని ఉంటున్న ప్రాంతాల్లో వారికి కనీస సదుపాయాలు లేని పరిస్థితి ఉండకూడదనే భారీఎత్తున 30 లక్షలకుపైగా ఇళ్ల స్థలాలు మంజూరుచేశామని, వాటిలో 15 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించామన్నారు. రోడ్లు-భవనాల శాఖతో సమన్వయం చేసుకుని మున్సిపాలిటీలు, నగరాల్లో రోడ్ల మరమ్మతులకు కార్యాచరణ రూపొందించుకోవాలని, వర్షాకాలం ముగియగానే దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. శుక్రవారం మున్సిపల్‌శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ‘‘పట్టణాలు, నగరాలను పరిశురఽభంగా ఉంచుకోవాలి. రోడ్ల మరమ్మతులకు ప్రాధాన్యమిచ్చి చేపట్టాలి. నిర్మాణాల కూల్చివేతలతో పట్టణాలు, నగరాల్లో పోగుపడే వ్యర్థాలపై దృష్టి పెట్టాలి’’ అని సీఎం కోరారు. అయితే, విశాఖ, విజయవాడ, తిరుపతిలో ఇప్పటికే వ్యర్థాల ప్లాంట్లు ఉన్నాయని.. రాజమహేంద్రవరం, కాకినాడ, ఏలూరు, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, అనంతపురంలో కూడా వాటిని ఏర్పాటుచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని సీఎంకు అధికారులు వివరించారు. కాగా, గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ప్రక్రియకు సన్నద్ధం కావాలని సీఎం ఆదేశించారు. దీనివల్ల ప్రతి రెండు వేల జనాభాకు ఒక రిజిస్ట్రేషన్‌ ఆఫీసు వచ్చి.. ప్రజలకు సేవలు మరింత చేరువవుతాయన్నారు. దీంతోపాటు ఆ గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని భూములపై తగిన పర్యవేక్షణ ఉండి, ఆక్రమణలు, అన్యాక్రాంతాలకు ఆస్కారం ఉండదని తెలిపారు. అర్హులైన వారు రాజమార్గంలో పట్టా తీసుకునే పరిస్థితిని రాష్ట్రంలో సృష్టించామని వ్యాఖ్యానించారు. 


షెడ్యూల్‌ ప్రకారమే టిడ్కో పనులు

విశాఖపట్నంలో చేపట్టే బీచ్‌కారిడార్‌, మల్టీలెవల్‌ కార్‌ పార్కింగ్‌, నేచురల్‌ హిస్టరీ పార్క్‌, మ్యూజియంపై సీఎం సమీక్ష చేపట్టారు. టిడ్కో ఇళ్ల నిర్మాణాలు, జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనపై కూడా సమీక్షించారు. నిర్దేశించుకున్న షెడ్యూల్‌ ప్రకారం టిడ్కో ఇళ్లు పూర్తి కావాల్సిందేనని  అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులకు ఇళ్లు అప్పగించేటప్పుడు అన్నీ రకాల వసతులతో ఇవ్వాలని, మౌలిక సదుపాయాల కల్పనలో రాజీపడొద్దని సూచించారు. ‘‘విజయవాడ, గుంటూరు, నెల్లూరులో భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తి చేయడానికి కార్యాచరణ సిద్ధం చేయాలి. గత ప్రభుత్వం హయాంలో ఈ ప్రాజెక్టులను అసంపూర్తిగా విడిచిపెట్టారు. మంగళగిరి-తాడేపల్లి, మాచర్ల, కర్నూలులో ట్రీట్‌మెంట్‌ ప్లాంట్ల ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలి’’ అని కోరారు. పులివెందులలో పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టిన మహిళామార్ట్‌ నిర్వహణపై సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. మిగతా చోట్ల కూడా ఇలాంటి ప్రయత్నాలు చేయాలని ఆదేశించారు.