జగన్ అక్రమాస్తులను ప్రభుత్వ ట్రెజరీలో జమ చెయ్యాలి
ABN , First Publish Date - 2021-07-03T06:13:48+05:30 IST
క్విడ్ ప్రోకో ఫార్ములా ప్రయోగించి డొల్ల కంపెనీలు సృష్టించి మనీలాండరింగ్‌తో జగన్ పాల్పడిన ఆర్థిక నేరాలకు, విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ ఆర్థిక నేరాలకు సామీప్యత ఉంది. ఆ ముగ్గురి విషయంలో....
క్విడ్ ప్రోకో ఫార్ములా ప్రయోగించి డొల్ల కంపెనీలు సృష్టించి మనీలాండరింగ్‌తో జగన్ పాల్పడిన ఆర్థిక నేరాలకు, విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ ఆర్థిక నేరాలకు సామీప్యత ఉంది. ఆ ముగ్గురి విషయంలో వలే జగన్ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి.
పెద్దమొత్తంలో రుణాల ఎగవేతకు తెగబడి బ్యాంకులను మోసం చేసిన ఆర్థిక నేరగాళ్ల నుంచి సొమ్మును జప్తు చేసి బ్యాంకులపరం చేసిన విధంగానే, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి గతంలో ప్రజలను మోసగించి దోపిడి చేసిన వేల కోట్ల సొమ్మును కూడా జప్తు చేసి ప్రభుత్వ ట్రెజరీలో జమచేసి ప్రజా ప్రయోజనాలకు, రాష్ట్రాభివృద్ధికి ఉపయోగించాలి. బ్యాంకులను మోసం చేసి దేశం నుంచి పారిపోయిన ఘరానా వ్యాపారవేత్తలు విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలకు చెందిన రూ.9,371 కోట్లను ప్రభుత్వరంగ బ్యాంకులకు, కేంద్రానికి ఎన్‌ఫోర్స్ డైరెక్టరేట్ (ఈడీ) బదిలీ చేసింది. ఈ ముగ్గురు ఎగవేతదారులు వల్ల బ్యాంకులకు రూ.22,586 కోట్లు నష్టం వాటిల్లగా రూ.18,170 కోట్ల విలువ చేసే ఆస్తులను జప్తు చేశారు.
40 శాతం ఆస్తులను పిఎస్ బిలకు అప్పగించారు. అదేవిధంగా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దొంగ జీఓల ద్వారా ప్రజలను, ప్రభుత్వాన్ని మోసం చేసిన వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడి అక్రమ, అవినీతి సంపదను కూడా ప్రజలపరం చేయాలి. సీబీఐ అఫిడవిట్‌లో పేర్కొన్న రూ.43 వేల కోట్ల అవినీతి సంపదను ప్రభుత్వ ట్రెజరీలో జమ చేయాలి. ఇప్పటివరకు జగన్‌కు సంబంధించిన రూ.10 వేల కోట్లు విలువ చేసే ఆస్తులను జప్తు చేశారు. మిగిలిన అవినీతి సంపదను కూడా జప్తు చేసి ప్రభుత్వానికి అప్పగించాలి. పరారీలో వున్న ఘరానా ఆర్థిక నేరస్థులను వదిలేది అంటున్నారు సంతోషం. మరి వ్యాపార, రాజకీయరంగాలకు చెందిన ఘరానా ఆర్థిక నేరస్థుల సంగతి ఏమిటి? వారిపై ఉన్న అవినీతి కేసుల విచారణను ఏళ్ల తరబడి కొనసాగించడం వల్ల సాక్షులను ప్రభావితం చేసి శిక్షలు పడకుండా తప్పించుకొంటున్నారు. సుపరిపాలన అంటే సత్వరం నేరగాళ్లకు శిక్షలు పడేలా చూడటమేనని కొన్నేళ్ళ క్రితమే సుప్రీంకోర్టు భాష్యం చెప్పింది. ప్రజాధనం బాహాటంగా దోచుకున్న వారే అందలాలు ఎక్కుతున్న వైనం విస్మరించరానిది. అవినీతిని, ఆర్థిక నేరగాళ్లని సహించేది లేదన్న విస్పష్ట హెచ్చరిక పనికిరానిదిగా మిగిలిపోకూడదు.
క్విడ్ ప్రోకో ఫార్ములా ప్రయోగించి డొల్ల కంపెనీలు సృష్టించి మనీలాండరింగ్‌తో జగన్ పాల్పడిన ఆర్థిక నేరాలకు, పైన చెప్పిన ముగ్గురి ఆర్థిక నేరాలకు సామీప్యత ఉంది. ఫెమా నిబంధనల ఉల్లంఘన, మనీలాండరింగ్‌తో పాటు ముడుపులు స్వీకరించడం, అక్రమాస్తులు కూడబెట్టడం వంటి నేరాలకు పాల్పడ్డారని జగన్ పై దాఖలు చేసిన చార్జిషీట్‌లో ఎన్‌పోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పేర్కొన్నది. అంతేకాక హాంకాంగ్, సింగపూర్, మారిషస్, లగ్జెంబర్గ్, బ్రిటీష్ వర్జీనియా, ఐలాండ్ వంటి ఆరు దేశాలకు లెటర్ ఆఫ్ రొగేటర్ పంపారు. సీబీఐ, ఈడీ దాఖలు చేసిన 17 చార్జిషీట్లలో 31 కేసులు జగన్ నేర చరిత్రకు సంబంధించినవే. 108 మంది వ్యక్తులు, 100కు పైగా కంపెనీలు, నలుగురు మంత్రులు, 10 మంది ఐఏఎస్ అధికారులు, ఐదుగురు ఉన్నతాధికారుల గూడుపుఠాణితో జరిగిన అతిపెద్ద ఆర్థిక కుంభకోణం ఇది.
ఏడు రాష్ట్రాలలో ఏకకాలంలో వందలమంది అధికారులను రంగంలోకి దించి సోదాలు నిర్వహించడం దేశ చరిత్రలోనే తొలిసారి. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి దోహదపడాల్సిన వనరులతో హవాలా నడిపి, లెక్కలేనన్ని బినామీ కంపెనీలతో చట్టం కళ్ళు కప్పి నేరపూరిత కుట్రకు పాల్పడిన తీరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయిదున్నరేళ్లు అవిరామంగా తవ్విపోసిన ధనరాసులను ఏ ఆర్థిక మహా గణాంకులు లెక్క తేల్చగలరు? ఆ కాలంలోనే జగన్ అవినీతి సంపద 1100 రెట్లు పెరిగిపోవడం గురించి తెలిసి అంత తక్కువ సమయంలోనే అంత సంపద ఎలా సాధ్యమైందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రశ్నించడం, తన సర్వీసులో ఇన్ని కోణాలు ఉన్న కేసును చూడలేదని సీబీఐ డైరెక్టర్ వ్యాఖ్యానించడం జగన్ నేరాల పరిధిని, తీవ్రతను పట్టిచూపుతున్నాయి. హత్యానేరం కన్నా ఆర్థికనేరం ప్రమాదకరమని వ్యాఖ్యానిస్తూ రాజకీయ నాయకులపై ఉన్న కేసులను ఏడాదిలోనే పూర్తి చేయాలని గతంలోనే సుప్రీంకోర్టు ఆదేశించింది. అయినా జగన్ పై ఉన్న ఆర్థిక నేరాల కేసుల విచారణలో ఏళ్ల తరబడి జాప్యం జరగడం గర్హనీయం. విజయ్ మాల్యా, నీరవ్ మోది, చోక్సీల కేసులలో ఉన్న వేగం కూడా జగన్‌పై ఉన్న కేసులలో లేకపోవడం ఏమిటి? నిజంగా ఆర్థిక నేరస్థుల భరతం పట్టే ఉద్దేశం ఉంటే, వారు దోపిడీ చేసిన సొమ్మును ప్రజలకు చేర్చాలన్న చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జగన్ దోచుకున్న రూ.43 వేల కోట్ల అక్రమ సంపదను జప్తు చేసి ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలి.
ఆ ఆస్తులను అమ్మడం ద్వారా వచ్చే నగదును ప్రజా సంక్షేమానికి, రాష్ట్రాభివృద్ధికి ఉపయోగించాలి. ఇంకా జప్తు కాని ఆయన అవినీతి ఆస్తులను సైతం వెంటనే జప్తు చేసి మనీలాండరింగ్, ఇతర నేరాలపై విచారణను వేగవంతం చేయాలి. ఒక పక్కన ప్రత్యేక కోర్టులు పెట్టి రాజకీయ వ్యవస్థను ప్రక్షాళించాలన్న సత్సంకల్పాలు మోతెక్కుతున్నా ఘరానా నేరస్థులకు ఎక్కడా శిక్షలు పడ్డ దాఖలాలు లేవు. ఆర్థిక నేరస్థుల పట్ల సింహస్వప్నం కావాల్సిన దర్యాప్తుసంస్థలు దమ్ములేని సంస్థలుగా ఎందుకు మిగిలిపోతున్నాయి?
ముఖ్యమంత్రి జగన్ అధికార దుర్వినియోగానికి పాల్పడి ఏకపక్షంగా తనపై ఉన్న కేసులను ఎత్తివేయించుకోవడం కూడ నివ్వెరపరుస్తోంది. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నపుడు అనంతపురం, గుంటూరు జిల్లాలలో నమోదు అయిన 11 కేసులను అధికారంలోకి వచ్చిన తరువాత గుట్టు చప్పుడు కాకుండా ఎత్తివేయించుకున్న ముఖ్యమంత్రిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారు. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఇటువంటి ప్రమాదకర ముఖ్యమంత్రి ఉండటం విచారకరం. ఆయనపై అరాచకం సృష్టించిన కేసులు రాష్ట్రవ్యాప్తంగా నమోదయ్యాయి. దిగువ కోర్టులు కేసు బలాబలాలను పరిశీలించకుండా, సరైన విధివిధానాలను పాటించకుండా ఆయనపై కేసులు ఎత్తి వేసినట్లు ఫిర్యాదు రావడంతో హైకోర్టు విచారణ చేపట్టింది. కేసులు, విచారణలు సామాన్య జనానికే కానీ జగన్‌పై జరగవా? చట్టం ముందు అందరూ సమానమే అన్న సూక్తి సామాన్యులకే కానీ జగన్‌కి వర్తించదా? నీతి, నిజాయితీ, పారదర్శకంగా పరిపాలన చేస్తానని ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తూ హామీ ఇచ్చారు జగన్. తనపై ఉన్న కేసులను గుట్టుచప్పుడు కాకుండా ఎత్తి వేయించుకోవడం నీతి, నిజాయితీనా? ఒక నాయకుడు ముఖ్యమంత్రి కాగానే గతంలో ఉన్న కేసులు ముగిసిపోతాయా? ఒక కేసును ఎత్తివేసినప్పుడు ఫిర్యాదుదారుడి అభిప్రాయం తెలుసుకోవలసిన అవసరం లేదా? కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో అత్యవసరమైన కేసులు మాత్రమే విచారణకు చేపట్టాలని హైకోర్టు కింది కోర్టులను ఆదేశించడంతో నిబంధనలకు తూట్లు పొడిచి కేసులు ఎత్తివేయించుకున్నారు. జగన్ మోసాలకు, అధికారాల దుర్వియోగానికి హద్దులు లేకుండా పోయింది. ఇకనైనా జాప్యం చేయకుండా ముఖ్యమంత్రిపై ఉన్న కేసుల విచారణను శీఘ్రగతిని సాగించి ముగించాలి. ఆయన అక్రమాస్తులను జప్తు చేసి, ప్రభుత్వ ట్రెజరీలో జమచేసి రాష్ట్రాభివృద్ధికి వినియోగించాలి.
యనమల రామకృష్ణుడు
మాజీ ఆర్థికమంత్రి