హెచ్‌సీయూకు పీవీ పేరు పెట్టాలి
ABN , First Publish Date - 2020-06-29T08:23:48+05:30 IST
ప్రతిష్ఠాత్మక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)కి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరుపెట్టాలని సీఎం కేసీఆర్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. బహు భాషా కోవిదుడయిన పీవీ, దేశంలో ఆర్థిక సంస్కరణలకు...

అదే ఆయనకు ఘన నివాళి.. ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ
సంస్కరణలకు నిలువెత్తు రూపం.. ఆధునిక భారత దిశానిర్దేశకుడు పీవీ
శత జయంతి ఉత్సవాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్
జ్ఞాన భూమిలో పీవీకి ఘన నివాళి.. దేశం రుణ పడి ఉంది: తమిళిసై
శతజయంతి ఉత్సవాల కోసం పీసీసీ కమిటీ ఏర్పాటు
హైదరాబాద్, జూన్ 28(ఆంధ్రజ్యోతి): ప్రతిష్ఠాత్మక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)కి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరుపెట్టాలని సీఎం కేసీఆర్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. బహు భాషా కోవిదుడయిన పీవీ, దేశంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. విద్యారంగంలో సంస్కరణలు, గురుకులాల ఏర్పాటుకు పీవీ తీసుకున్న నిర్ణయాలు విప్లవాత్మకమైనవని తెలిపారు. పీవీ శతజయంతి ఉత్సవాలు నిర్వహించుకుంటున్న నేపథ్యంలో హెచ్‌సీయూకి ఆయన పేరు పెట్టడం వల్ల ఘన నివాళులర్పించినట్లు అవుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 99వ జయంతి సందర్భంగా ఆదివారం నెక్లె్‌సరోడ్‌లోని పీవీ ఘాట్ జ్ఞానభూమిలో సీఎం కేసీఆర్ ఘనంగా నివాళులర్పించి, పీవీ శత జయంతి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు భారతదేశంలో ఆర్థిక సంస్కరణలకు నిలువెత్తు రూపమని, ఆయన ఆధునిక భారత దేశ దిశా నిర్దేశకుడని ప్రశంసించారు.
‘‘పీవీ బహుముఖ ప్రజ్ఞాశాలి. 360 డిగ్రీల మూర్తిమత్వం కలిగిన అధ్యయన శీలి. దేశ ప్రధానిగా గొప్ప సంస్కరణలతో ఆర్థిక పరిస్థితిని గట్టెక్కించారు. సీఎంగా ఆయన రాష్ట్రంలో భూ సంస్కరణలు అమలు చేసి పేదలకు భూములు పంచారు. సొంత భూమి 800 ఎకరాలను ప్రభుత్వం ద్వారా పేదలకు పంపిణీ చేసి భూసంస్కరణలకు ఆద్యుడుగా నిలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆయన విద్యాశాఖ మంత్రిగా గురుకులాలకు శ్రీకారం చుట్టారు. సర్వేల్ రెసిడెన్షియల్ స్కూళ్లు, నవోదయ బడుల స్థాపనకు నాంది పలికారు. గడ్డు కాలంలో ప్రధాని పీఠం అధిష్ఠించి చక్రం తిప్పిన అపర చాణక్యుడు. ఆయనకు భారతరత్న ఇవ్వాలి. దీనికి సంబంధించి అసెంబ్లీలో కేబినెట్‌లో తీర్మానం చేసి పీవీ కుటుంబసభ్యులు, రాష్ట్ర మంత్రి వర్గంతో కలిసి ప్రధాని మోదీని కలిసి అభ్యర్థిస్తాం. ఏడాది పొడవునా నిర్వహించే పీవీ శత జయంతి ఉత్సవాల్లో ప్రధాని మోదీ, రాష్ట్రపతితో పాటు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ పాల్గొనే విధంగా కార్యక్రమాలు రూపొందించాం. జాతీయ, అంతర్జాతీయస్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తాం. వంగర, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్‌తో పాటు ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో పీవీ కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేస్తాం. అసెంబ్లీలో పీవీ నిలువెత్తు చిత్రపటాన్ని ఏర్పాటు చేయిస్తాం. పార్లమెంట్‌లో సైతం ఏర్పాటు చేయించేందుకు కృషి చేస్తాం. తెలుగు అకాడమీకి ఆయన పేరుపెడతాం. పీవీ మెమోరియల్ కేంద్రాన్ని ఏడాదిలోగా ఏర్పాటు చేస్తాం. కాకతీయ యూనివర్సిటీలో పీవీ పేరిట కేంద్రాన్ని ఏర్పాటు చేయిస్తాం. పీవీ రచనలను ముద్రించి దేశ వ్యాప్తంగా అన్ని వర్సిటీలకు పంపిస్తాం. ఆయన పేరిట పోస్టల్ స్టాంప్ విడుదల చేయాలని కోరతాం. పీవీ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల ఫలితాలపై ఢిల్లీలో సదస్సు ఏర్పాటు చేస్తాం’’ అని కేసీఆర్ అన్నారు. ఈ కార్యక్రమానికి శతజయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ కె.కేశవరావు అధ్యక్షత వహించారు. సభలో స్పీకర్ పోచారం శ్రీనివా్‌సరెడ్డి, పీవీ కూతురు వాణీ, కుమారుడు ప్రభాకర్‌రావు ప్రసంగించారు. మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, సీపీఐ రాష్ట్రకార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
భూ సంస్కరణల అమలే పీవీకి ఘన నివాళి: మందకృష్ణ
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ప్రవేశపెట్టిన భూ సంస్కరణలు పకడ్బందీగా అమలు చేయడమే ఆయనకు ఘన నివాళి అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు.
గాంధీ భవన్‌లో పీవీ జయంతి వేడుకలు.. కమిటీ ఏర్పాటు
గాంధీ భవన్‌లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా టీపీసీసీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. పీవీ చిత్ర పటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, చిన్నారెడ్డి, దాసోజు శ్రవణ్, అంజన్‌కుమార్ యాదవ్, మల్లురవి తదితరులు పాల్గొన్నారు. అనేక సంస్కరణలు చేపట్టి దేశ అభివృద్ధికి కృషి చేసిన మహనీయుడు మాజీ ప్రధాని పీవీ అని కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జ్ ఆర్‌సీ ఖుంటియా అన్నారు. పీవీ శత జయంతి ఉత్సవాల కోసం టీపీసీసీ ఒక కమిటీని నియమించింది. మాజీ మంత్రి గీతారెడ్డి చైర్ పర్సన్‌గా 15 మంది సభ్యులతో కమిటీని ఆదివారం ప్రకటించారు.
హరీశ్, కవిత నివాళులు
‘‘మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గొప్ప దార్శనికుడు. ఆయన నాయకత్వం వల్లే ఐసీయూలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి జీవం పోసుకుంది. ఆయనకు దేశం రుణపడి ఉంది’’ అని గవర్నర్ డాక్టర్ తమిళిసై పేర్కొన్నారు. పీవీ కుమార్తె వాణీదేవి హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో నెలకొల్పిన ‘స్థిత ప్రజ్ఞ’ పీవీ నరసింహారావు మెమోరియల్ మ్యూజియాన్ని ఆదివారం రాజ్‌భవన్ నుంచి గవర్నర్ ఆన్‌లైన్‌లో ఆవిష్కరించారు. పీవీ తెలంగాణ ముద్దు బిడ్డ, ఆయన శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ రాష్ట్రానికి గవర్నర్‌గా ఉన్నందుకు గర్వపడుతున్నానని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాజ్‌భవన్‌లో నరసింహారావు చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. మంత్రి హరీశ్‌రావు, మాజీ ఎంపీ కవిత పీవీకి నివాళులర్పించారు. తెలంగాణ నేల సృష్టించిన అద్భుత మేధస్సు పీవీ నరసింహారావు అని, ఆలోచనాపరుడిగా, పరిపాలనాదక్షుడిగా, రాజనీతిజ్ఞుడిగా ఆయన ప్రజ్ఞ అమోఘమని మంత్రి హరీశ్ ప్రశంసించారు.

