గంజాయిపై యుద్ధం

ABN , First Publish Date - 2021-10-21T08:30:39+05:30 IST

తెలంగాణలో గంజాయి వినియోగం క్రమక్రమంగా పెరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్న నేపథ్యంలో దానిపై తీవ్ర యుద్ధం ప్రకటించాల్సిన అవసరం ఏర్పడిందని సీఎం కేసీఆర్‌ అన్నారు.

గంజాయిపై యుద్ధం

రాష్ట్రంలో గంజాయి వినియోగం పెరుగుతోంది.. పరిస్థితి తీవ్రం కాకముందే అప్రమత్తం కావాలి

నిర్మూలించే కార్యాచరణ రూపొందించాలి.. డీజీ స్థాయి అధికారితో ప్రత్యేక సెల్‌

డ్రగ్స్‌తో అనర్థాలను వివరించాలి.. విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పించాలి

సిలబ్‌సలో పాఠ్యాంశంగా చేర్చాలి.. ఎయిడ్స్‌ వ్యాధి తరహాలో ప్రచారం చేయాలి

గంజాయి వేస్తే రైతుబంధు, బీమా రద్దు.. డ్రగ్స్‌ దుష్ఫలితాలపై తీసే చిత్రాలకు సబ్సిడీ

గంజాయి నిర్మూలనకు కృషి చేసే అధికారులకు ప్రోత్సాహకాలు, పదోన్నతులు

పోలీస్‌, ఎక్సైజ్‌ అధికారులతో ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్‌ 


హైదరాబాద్‌, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో గంజాయి వినియోగం క్రమక్రమంగా పెరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్న నేపథ్యంలో దానిపై తీవ్ర యుద్ధం ప్రకటించాల్సిన అవసరం ఏర్పడిందని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఇందుకోసం పోలీసు, ఎక్సైజ్‌ శాఖలు సమన్వయంతో పటిష్ఠమైన వ్యూహం రూపొందించాలని ఆదేశించారు. పరిస్థితి మరింత తీవ్రం కాకముందే అప్రమత్తం కావాలని, గంజాయి అక్రమ సాగు, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని అన్నారు. గంజాయితోపాటు గుడుంబాను సమూలంగా నిర్మూలించాలని నిర్దేశించారు. గంజాయి నిరోధానికి డీజీ స్థాయి అధికారి నేతృత్వంలో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్‌ కట్టడిపై బుధవారం ప్రగతిభవన్‌లో పోలీస్‌, ఎక్సైజ్‌ శాఖల ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘‘గంజాయి పీడను తొందరగా తొలగించకపోతే మనం సాధిస్తున్న విజయాల ఫలితాలు నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని పోలీస్‌, ఎక్సైజ్‌ శాఖాధికారులు తీవ్రంగా పరిగణించాలి. ఎంతో ఆవేదనతో నేను ఈరోజు ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశాను. పెడదోవ పట్టిన యువత.. వాట్సాస్‌ గ్రూపులుగా ఏర్పడి గంజాయి కొనుగోలు చేసి సేవిస్తున్నట్లు నివేదికలు వస్తున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.


డ్రగ్స్‌ వినియోగం వల్ల యువత మానసిక వ్యవస్థ దెబ్బతిని ఆత్మహత్యకు పాల్పడే ప్రమాదం ఉంటుంది. డీ-అడిక్షన్‌ చాలా క్లిష్టమైన, సుదీర్ఘమైన ప్రక్రియ. గంజాయిని నిరోధించడానికి ఏం కావాలన్నా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గంజాయి మాఫియాను అణిచివేయాలి. నేరస్థులు ఎంతటివారైనా ఉపేక్షించొద్దు. రాష్ట్రంలో తీవ్రవాదాన్ని అరికట్టగలిగాం. ఈ విజయం వెనుక పోలీస్‌ శాఖ త్యాగాలున్నాయి. రాష్ట్రం గొప్ప అభివృద్ధిని సాధిస్తున్న సందర్భంలో గంజాయి వంటి మాదక ద్రవ్యాల లభ్యత పెరగడం శోచనీయం. డ్రగ్స్‌ కట్టడికి ఇంటెలిజెన్స్‌ విభాగంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను, ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌ను బలోపేతం చేయాలి. విద్యాసంస్థల వద్ద ప్రత్యేక నిఘా పెట్టాలి. సరిహద్దుల్లో చెక్‌ పోస్టుల సంఖ్యను పెంచాలి. సమాచార వ్యవస్థను పటిష్టం చేయడంతోపాటు తగినన్ని వాహనాలను ఏర్పాటు చేయాలి. గంజాయి రవాణాను పూర్తిగా స్తంభింపజేయాలి. గంజాయి నిర్మూలనలో ఫలితాలు సాధించిన అధికారులకు నగదు ప్రోత్సాహకాలు, ప్రత్యేక పదోన్నతులు కల్పిస్తాం.


గంజాయి, గుడుంబా నిర్మూలనను ఒక పవిత్ర కర్తవ్యంగా భావించాలి. గుడుంబా స్థానికంగానే తయారవుతోంది. దానిని అరికట్టడం ఎక్సైజ్‌శాఖకు సాధ్యమే. ఇంకా గుడుంబా అమ్మకంపై ఆధారపడి జీవిస్తున్న వారికి ప్రత్యామ్నాయ ఉపాధి, పునరావాసం కల్పించాలి. అందుకు అవసరమైన నిధులను కలెక్టర్లకు విడుదల చేస్తాం. గుడుంబా కారణంగా భర్తలను కోల్పోయి ముక్కుపచ్చలారని గిరిజన యువతులు వితంతువులుగా మారుతుండటం నా హృదయాన్ని కలచివేసింది. గుడుంబా తయారీ మళ్లీ మొదలవుతున్నట్లు సమాచారం వస్తోంది. ఎక్సైజ్‌ అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. గుడుంబా నిషేధం అమలులో లోపాలు జరుగుతుంటే వెంటనే సరిదిద్దుకోవాలి. ఈ విషయంపై మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, ఎక్సైజ్‌ కమిషనర్‌ సర్పరాజ్‌ అహ్మద్‌ నిరంతరం సమీక్షలు నిర్వహించాలి. 


స్మగ్లర్లపై కఠినచర్యలు తీసుకోండి

తెలంగాణలో గంజాయి వ్యాపారం చేయలేమని స్మగ్లర్లు భయపడేలా కఠిన చర్యలు చేపట్టాలి. చెక్‌ పోస్టులను, నిఘా కేంద్రాలను హైవేల మీదనే కాకుండా అవసరమైన అన్నిచోట్లా ఏర్పాటు చేయాలి. గంజాయి సాగు, రవాణా, వినియోగాన్ని అరికట్టే విషయంలో ఇంటెలిజెన్స్‌ వ్యవస్థ కీలకంగా వ్యవహరించాలి. చీమ చిటుక్కుమన్నా తెలిసేలా ప్రత్యేకంగా ఆధునిక సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. డీజీ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ.. హైదరాబాద్‌కు గంజాయి రాకుండా ఆపేవిధంగా పటిష్ఠమైన వ్యూహం అవలంభించాలి. తమ గ్రామాల్లో గంజాయి సాగవుతుంటే.. ఆయా గ్రామాల సర్పంచ్‌లు సమాచారాన్ని ఎక్సైజ్‌, పోలీసు శాఖలకు అందించాలి. నేరస్థులకు త్వరితగతిన శిక్షలు పడే విధంగా ప్రత్యేక న్యాయవాదులను సీఎస్‌ నియమించుకోవాలి. డ్రగ్స్‌ వినియోగంతో వచ్చే అనర్థాలను యువతకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాల ద్వారా వివరించాలి. గతంలో ఎయిడ్స్‌ మహమ్మారిపై ఉధృత ప్రచారంతోనే ప్రజలకు అవగాహన కల్పించాం. అదే తరహాలో డ్రగ్స్‌ అనర్థాలపై షార్ట్‌ ఫిల్మ్‌లు, డాక్యుమెంటరీలు, సందేశాత్మక ఆడియో, వీడియో అడ్వర్టయిజ్‌మెంట్లు రూపొందించే బాధ్యతను సీఎస్‌ సోమేశ్‌కుమార్‌కు అప్పగిస్తున్నా. ‘డ్రగ్స్‌ వినియోగం ఎంత ప్రమాదరకమైనదో విద్యార్థి దశ నుంచే తెలిసే విధంగా ప్రత్యేక పాఠాలను రూపొందించి సిలబ్‌సలో చేర్చాలి. డ్రగ్స్‌ దుష్ఫలితాలపై ప్రతిభావంతంగా నిర్మించే సినిమాలకు సబ్సిడీ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తాం. 


ఏవోబీ నుంచి అక్రమ రవాణా

ఉన్నతస్థాయి సమావేశంలో పోలీసు, ఎక్సైజ్‌ అధికారులు ఆయా జిల్లాల్లో గంజాయి నియంత్రణ కోసం అనుసరిస్తున్న వ్యూహాలను సీఎం కేసీఆర్‌కు వివరించారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో గంజాయి ఉత్పత్తి జరుగుతోందని, అక్కడి నుంచి చింతూరు-భద్రాచలం మీదుగా తెలంగాణలో వస్తోందని, ఇక్కడి నుంచి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు రవాణా అవుతోందని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వలస కూలీలు, ఆటోడ్రైవర్లు, హమాలీలతోపాటు యువకులు గంజాయిని ఎక్కువగా వినియోగిస్తున్నారని వివరించారు. గంజాయి నిర్మూలనపై బలంగా దృష్టి కేంద్రీకరిస్తే.. అతి తక్కువ కాలంలోనే తెలంగాణలో దీని పీడ విరగడ చేయవచ్చన్నారు. గంజాయి వినియోగ హాట్‌ స్పాట్లను గుర్తించి.. నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు డీజీపీ మహేందర్‌రెడ్డి సూచించారు. వైజాగ్‌, మల్కన్‌గిరి పోలీసులతో సమన్వయం చేసుకుని.. గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తామని చెప్పారు. పోలీస్‌, ఎక్సైజ్‌ శాఖలు సంయుక్తంగా సమావేశం నిర్వహించడంతో.. గంజాయి నియంత్రణలో ముందడుగు వేసినట్లయిందని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో మంత్రులు మహమూద్‌అలీ, శ్రీనివా్‌సగౌడ్‌, మాజీ మంత్రి కడియం శ్రీహరి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, హోంశాఖ సలహాదారు అనురాగ్‌ శర్మ, డీజీపీ మహేందర్‌ రెడ్డి, సీఎం ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌ రావు, కార్యదర్శులు స్మితా సభర్వాల్‌, శేషాద్రి, రాహుల్‌ బొజ్జా, భూపాల్‌ రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 


గంజాయి సాగు చేస్తే రైతుబంధు రద్దు!

ఒక్క గంజాయి మొక్క కూడా రాష్ట్రంలో కనిపించకూడదు. గంజాయి సాగు చేస్తున్నవారికి రైతుబంధు, రైతుబీమా రద్దుతోపాటు ఆర్‌వోఎ్‌ఫఆర్‌లో సాగు చేస్తే వారి పట్టాలను కూడా రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తాం. తెలంగాణ పోలీ్‌సశాఖకు బెస్ట్‌ పోలీ్‌సగా ఉన్న పేరును నిలబెట్టుకోవాలి. దేశంలోని ఏదైనా రాష్ట్రంలో సమర్థవంతంగా గంజాయి నియంత్రణ జరిగిన అనుభవాలను పరిశీలించండి. రాష్ట్ర ప్రతిష్టను కాపాడే విధంగా పోలీస్‌, ఎక్సైజ్‌  శాఖలు ఉమ్మడిగా పనిచేయాలి. గంజాయి విత్తనాలు కూడా కనిపించనంత కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవాలి. డ్రగ్స్‌రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలి. గంజాయి, గుడుంబా నివారణపై నేటి భేటీలో వచ్చిన వివరాల ఆధారంగా త్వరలోనే మరో సమావేశం నిర్వహిస్తాం. అందులో వ్యూహాన్ని ఖరారు చేస్తాం’’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు. 


పోలీస్‌ అమరవీరులకు సీఎం ఘననివాళి

విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీస్‌ అమరవీరులకు సీఎం కేసీఆర్‌ ఘన నివాళులర్పించారు. గురువారం పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వారి సేవలను ఆయన స్మరించుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రాణాలొడ్డి పోరాడిన పోలీస్‌ అమరుల సేవలను జాతి ఎన్నటికి మరవదని ముఖ్యమంత్రి అన్నారు. అమరుల స్ఫూర్తితో పోలీసులు తమ విధి నిర్వహణకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. అమరులైన పోలీస్‌ కుటుంబాలను ఆదుకుంటామని, వారి సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని తెలిపారు.

Updated Date - 2021-10-21T08:30:39+05:30 IST