హుజూరావార్‌ రంగంలోకి కేసీఆర్‌!

ABN , First Publish Date - 2021-07-11T08:08:35+05:30 IST

రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారిన హుజురాబాద్‌ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికపై ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌ రావు ప్రత్యేక దృష్టి సారించారు.

హుజూరావార్‌ రంగంలోకి కేసీఆర్‌!

’హుజూరాబాద్‌ ఉప ఎన్నికపై ప్రత్యేక దృష్టి 

మంత్రి హరీశ్‌రావు ద్వారా మంత్రాంగం 

నిరంతరం పర్యవేక్షిస్తున్న ఆర్థిక మంత్రి 

కేసీఆర్‌కు రోజువారీ సర్వే నివేదికలు 

నేరుగా పార్టీ నేతలతో సీఎం మంతనాలు 

ప్రగతి భవన్‌కు పిలిపించి దిశానిర్దేశం 

ప్రతి 50 మంది ఓటర్లకు ఓ ఇన్‌చార్జి 

ఆ దిశగా యోచిస్తున్న పార్టీ అధినేత

ఉద్యోగ ఖాళీలపై అత్యవసర సమీక్ష

నేడు హెచ్‌ఆర్‌డీలో శాఖల వారీ పరిశీలన 

కేడర్‌ స్ట్రెంథ్‌ నిర్ధారణకు కసరత్తు 

జోనల్‌ వ్యవస్థకు ఆమోదంతో ప్రక్రియలో వేగం


హైదరాబాద్‌, జూలై 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారిన హుజురాబాద్‌ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికపై ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌ రావు ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటి వరకు ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ద్వారా మంత్రాంగం నడిపిస్తున్న ఆయన, ఇప్పుడు స్వయంగా రంగంలోకి దిగారు. నేరుగా ఆ నియోజకవర్గం, జిల్లా ముఖ్య నేతలను పిలిపించుకొని మాట్లాడుతున్నారు. భూ కబ్జా ఆరోపణల నేపథ్యంలో కేబినెట్‌ నుంచి బర్తర్‌ఫకు గురైన ఈటల రాజేందర్‌ టీఆర్‌ఎ్‌సకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ పార్టీ ద్వారా సంక్రమించిన హుజురాబాద్‌ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయటంతో, త్వరలో ఆ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. బీజేపీలో చేరిన ఈటల రాజేందర్‌ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అదే సమయంలో టీఆర్‌ఎస్‌ నేతలు పలువురు అక్కడ మోహరించారు.


సీఎం కేసీఆర్‌ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడకపోయినా టీఆర్‌ఎస్‌ తరఫున హుజురాబాద్‌ ఉప ఎన్నిక ఇన్‌చార్జి బాధ్యతలను ఆయన మంత్రి హరీశ్‌రావుకు అప్పగించారు. ఆ నియోజకవర్గానికి సంబంధించి వివిధ మార్గాల ద్వారా తనకు అందుతున్న సమాచారాన్ని సీఎం విశ్లేషిస్తున్నారు. పలు సర్వే సంస్థలు, ఇంటెలిజెన్స్‌ విభాగం నుంచి రోజు వారీగా అందుతున్న నివేదికల ఆధారంగా వ్యూహ ప్రతివ్యూహాలను ఖరారు చేస్తున్నారు. ఈ మేరకు అక్కడ చేపట్టాల్సిన చర్యలపై ఎప్పటికప్పుడు మంత్రి హరీశ్‌రావును ఆయన అప్రమత్తం చేస్తున్నారు. ‘మన ఈ రోజు ఏం చేశాం. మరుసటి రోజు ఏం చేయాలి’ అనేది నిర్దేశిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా మంత్రి హరీశ్‌రావు ‘ట్రబుల్‌ షూటర్‌’గా తనకు ఉన్న అనుభవాన్ని జోడించి, నియోజకవర్గంలో పనిచేస్తున్న పార్టీ నేతలను పరుగులు పెట్టిస్తున్నారు.


చెప్పిన చోటుకు వెళ్లారా ? లేదా ? స్థానికంగా ఎలాంటి స్పందన వచ్చింది ? అనే విషయాలను ఆయన ఆరా తీస్తున్నారు. క్షణ క్షణం పర్యవేక్షణ కారణంగా పార్టీ నేతలు నియోజకవర్గం నుంచి బయటకు రాకుండా అక్కడే మకాం వేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల ప్రకారం మంత్రి హరీశ్‌రావు ఒకవైపు ఇతర పార్టీల నుంచి చేరికలను ప్రోత్సహిస్తూనే, మరోవైపు సొంత పార్టీ నేతల మధ్య సమన్వయం కుదుర్చుతున్నారు. సోషల్‌ మీడియా, కుల సంఘాలు, మహిళా సంఘాలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు.. ఇలా ఒక్కో విభాగం వారీగా పార్టీ ముఖ్యులకు బాధ్యతలు అప్పగించారు. 


ప్రాంతాల వారీగా బాధ్యతలు

ఈటల రాజేందర్‌ కేబినెట్‌ నుం చి బర్తర్‌ఫకి గురైనప్పటి నుంచి నియోజకవర్గంలో పార్టీ తరఫున ఇన్‌చార్జిలుగా పని చేస్తున్న కరీంనగర్‌ మేయర్‌ సునీల్‌రావు, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, శాతవాహన అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ చైర్మన్‌ జీవీ రామకృష్ణారావును కొనసాగించటంతోపా టు, హుజూరాబాద్‌ పట్టణ బాధ్యతలను ప్రత్యేకంగా మంత్రి గంగుల కమలాకర్‌కు అప్పగించారు. నియోజకవర్గంలోని జమ్మికుంట ప్రాంత బాధ్యతను మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డికి వీణవంక, ఆరూరి రమే్‌షకు ఇల్లందకుంట, చల్ల ధర్మారెడ్డికి కమలాపూర్‌ ప్రాంత బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ పార్టీ తరఫున విద్యార్థి, యువజన విభాగాలతోపాటు, సోషల్‌ మీడియా ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. వీరంతా సీఎం కేసీఆర్‌ నుంచి వయా మంత్రి హరీశ్‌రావు ద్వారా అందుతున్న ఆదేశాలకు అనుగుణంగా క్షేత్రంలో పని చేస్తున్నారు.


రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో పర్యటించాల్సిన పార్టీ నేతల సంఖ్యను మరింత పెంచే కసరత్తు జరుగుతోంది. ప్రతి 50 మంది ఓటర్లకు ఒక ఇన్‌చార్జిని పెట్టబోతున్నారు. ఈ ప్రక్రియ ఒకవైపు కొనసాగుతుండగానే, టీఆర్‌ఎస్‌ చీఫ్‌ హుజూరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గం, కరీంనగర్‌ జిల్లా పార్టీ ముఖ్యులను తన వద్దకు పిలిపించుకోవటం మొదలుపెట్టారు. ఈ మేరకు టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్‌, కరీంనగర్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ విజయ భర్త కనుమల్ల గణపతి తదితరులు శుక్రవారం సీఎం కేసీఆర్‌ను ప్రగతి భవన్‌లో కలిశారు. నియోజకవర్గంలోని పరిస్థితులపై కేసీఆర్‌ ఆరా తీశారు. ఇకపై వారు చేయాల్సిన పనులపై దిశానిర్దేశం చేశారు. రెండు రోజుల్లో నియోజకవర్గంలోని ఐదు మండలాల జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌లు, ఇతర ముఖ్య నేతలను పిలిపించుకొని మాట్లాడాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించినట్లు సమాచారం. ప్రజలకు సీఎం కేసీఆర్‌ బోనాల పండుగ శుభాకాంక్షలు.


బోనాల ఉత్సవాలు తెలంగాణ సబ్బండ వర్ణాల గంగా జమునా తెహజీబ్‌కు ప్రతీకగా నిలుస్తాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. బోనాల పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. గోల్కొండలోని జగదాంబిక అమ్మవారికి బోనం సమర్పించడం తెలంగాణలో సబ్బండ వర్ణాల ఐక్యతకు ప్రతీక అని శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. అమ్మవారి దీవెనతో రాష్ట్రం.. దేశానికే భోజనం పెట్టే అన్నపూర్ణగా మారిందన్నారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా జీవించేలా అమ్మవారి ఆశీస్సులు కల కాలం కొనసాగాలని కేసీఆర్‌ ఆకాంక్షించారు. 


ఈటలపై సానుభూతి తగ్గిందని అంచనా 

బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై హుజూరాబాద్‌ నియోజకవర్గ ప్రజల్లో మొదట ఉన్నంత సానుభూతి ఇప్పుడు లేదని, కొంత తగ్గిందని టీఆర్‌ఎస్‌ ముఖ్యులు అంచనా వేస్తున్నారు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలన్నీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ వల్లనే జరిగాయనే అభిప్రాయాన్ని తాము ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నామని వారు అభిప్రాయపడుతున్నారు. ‘పార్టీ, ప్రభుత్వంలో ఎంతో ప్రాధాన్యం కల్పించినా, సీఎం కేసీఆర్‌కు ఈటల ద్రోహం చేశారని వివరిస్తున్నాం. ఈటలను మళ్లీ గెలిపిస్తే, విపక్షంలో ఉండి ఏమీ చేయలేరని.. నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే ప్రభుత్వం వైపు ఉండాలి. టీఆర్‌ఎ్‌సను గెలిపించాలని చెబుతున్నాం. దీంతో ఎవరు ఏమిటో అక్కడి ప్రజలు తెలుసుకుంటున్నారు’ అని హుజూరాబాద్‌ ప్రాంతంలో విస్తృతంగా పర్యటిస్తున్న టీఆర్‌ఎస్‌ ముఖ్య నేత ఒకరు తెలిపారు.

Updated Date - 2021-07-11T08:08:35+05:30 IST