సీఎంఆర్‌ఎఫ్‌ బంద్‌

ABN , First Publish Date - 2020-11-22T07:52:49+05:30 IST

ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని జబ్బులను మాత్రమే ఇకపై సీఎంఆర్‌ఎఫ్‌ సాయానికి పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డిసెంబరు 1 నుంచి కొత్త నిబంధనలు

సీఎంఆర్‌ఎఫ్‌ బంద్‌

నిరుపేదల ‘నిధి’కిసర్కారు గ్రహణం!

ఇకపై సిఫారసులు పంపొద్దని ఎమ్మెల్యేలకు సర్క్యులర్‌

ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌లోనే అన్ని చికిత్సలు

డిసెంబరు 1నుంచే కొత్త విధానం

మొత్తం ఆస్పత్రుల్లో నెట్‌వర్క్‌ 35 శాతమే

అందరూ అక్కడే చికిత్స పొందాలట!

ఎక్కడైనా వైద్యం పొంది బిల్లు పెడితే

ఆదుకొనేలా సీఎంఆర్‌ఎ్‌ఫకు రూపకల్పన

ఇకపై ఆ ఊరటకు పేదలు దూరం

2434 చికిత్సలకు వర్తించని సాయం


పేదల సంజీవని ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌) వారి చేజారిపోతున్నదా? ఆరోగ్యానికి ఏ సమస్య వచ్చినా ఆదుకొంటుందనే చివరి దిలాసా కూడా దూరమవుతున్నదా? పెద్దకష్టంలో పెన్నిధిగా ఉండే ‘నిధి’ ఇక పేదలకు అందదా? రాష్ట్రంలోని ఎమ్మెల్యేలకు సీఎంఆర్‌ఎఫ్‌ అధికారులు తాజాగా పంపిన సర్క్యులర్‌ను పరిశీలిస్తే.. ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. ఒకటి రెండు శస్త్ర చికిత్సలకు మినహా మిగిలిన వాటికి సీఎంఆర్‌ఎ్‌ఫను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయనుంది. చివరకు అత్యవసర పరిస్థితిలో కూడా ఆరోగ్యశ్రీలో మాత్రమే శస్త్ర చికిత్సలు చేయాలని తేల్చి చెబుతోంది.


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని జబ్బులను మాత్రమే ఇకపై సీఎంఆర్‌ఎఫ్‌ సాయానికి పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డిసెంబరు 1 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రానునున్నాయి. ఈ మేరకు ఇప్పటికే 175 మంది ఎమ్మెల్యేల కార్యాలయాలకూ సీఎంఆర్‌ఎఫ్‌  నుంచి సర్క్యులర్‌ వెళ్లింది. డిసెంబరు 1 నుంచి ఎమ్మెల్యేలు పంపించిన దరఖాస్తులను సీఎంఆర్‌ఎఫ్‌ కార్యాలయంలో తీసుకోబోమని, కేవలం ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని శస్త్ర చికిత్సలకు సంబంధించిన దరఖాస్తులు మాత్రమే పంపించాలని ఆ సర్క్యులర్‌లో పొందుపరిచారు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా ప్రభుత్వం ఇలాంటి నిబంధన పెట్టింది. వాస్తవానికి ప్రస్తుతం రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పరిధిలో 450 ఆస్పత్రులే ఉన్నాయి. అంటే, మొత్తం ఆస్పత్రుల్లో 35 నుంచి 40% అన్నమాట.


అవి ఉన్నచోట కూడా అన్ని స్పెషాలిటీలు అందుబాటులో ఉండవు. దీంతో చాలా మంది రోగులు మంచి వైద్య పరికరాలున్న ఆస్పత్రులతో పాటు పేరు పొందిన వైద్యుల వద్ద శస్త్ర చికిత్సలు చేయించుకోవాలని భావిస్తారు. అలాంటి సమయంలో రోగులు తమకు నచ్చిన చోట శస్త్ర చికిత్స చేయించుకుని ఆ బిల్లులు సీఎంఆర్‌ఎ్‌ఫకు పంపించుకునే వారు. వారు పెట్టిన ఖర్చులో కొంత మొత్తాన్ని సీఎంఆర్‌ఎఫ్‌ రిఫండ్‌ చేసేవారు. 


ఇకముందు డీలా

వైద్యం ఖర్చు వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించిన విష యం తెలిసిందే. ఆరోగ్యశ్రీ పరిధిలోని 2434 శస్త్ర చికిత్సలను ప్రభుత్వం తెచ్చింది. గతంతో పోల్చితే 1375 శస్త్ర చికిత్సలను పెంచింది. ఆరోగ్యశ్రీలో శస్త్ర చికిత్సలను పెంచడం వెనుక సీఎంఆర్‌ఎ్‌ఫను తుం చే ఆలోచన ప్రభుత్వానికి తొలినుంచీ ఉన్నదని చె బుతున్నారు. మరోవైపు సీఎంఆర్‌ఎ్‌ఫతో పాటు ఎల్‌వోసీలను ప్రభుత్వం రద్దు చేస్తోంది. ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్న 2434 శస్త్ర చికిత్సలకు ఎల్‌వోసీలకూ ఇచ్చేది లేదని అధికారులు తేల్చి చెబుతున్నారు. ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్న శస్త్ర చికిత్సలకు సంబంధించిన ఎల్‌వోసీలు వచ్చినా సీఎంఆర్‌ఎఫ్‌ అధికారులు ఇకపై నిరాకరిస్తారు. వెంటనే రోగులను వారి గ్రామాల్లోని సచివాలయానికి పంపించి, అక్కడ నుంచి ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు పంపించే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. ఏదిఏమైనా మొత్తంగా ఆరోగ్యశ్రీ పేరుతో ప్రభుత్వం సీఎంఆర్‌ఎ్‌ఫను పూర్తిగా కనుమరుగు చేయనుంది. 

Updated Date - 2020-11-22T07:52:49+05:30 IST