నేర రాజకీయాలపై సమష్టి సమరం
ABN , First Publish Date - 2021-09-01T06:17:40+05:30 IST
ప్రజాప్రతినిధులపై నమోదయిన కేసుల దర్యాప్తు దశాబ్దాల తరబడి జరుగుతుండటంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎంపీలు, ఎమ్మేల్యేలు, ఎమ్మెల్సీలపై ఎన్‌ఫోర్్స్‌మెంట్ డైరెక్టరేట్, సీబీఐ కేసుల సత్వర దర్యాప్తు...
ప్రజాప్రతినిధులపై నమోదయిన కేసుల దర్యాప్తు దశాబ్దాల తరబడి జరుగుతుండటంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎంపీలు, ఎమ్మేల్యేలు, ఎమ్మెల్సీలపై ఎన్‌ఫోర్్స్‌మెంట్ డైరెక్టరేట్, సీబీఐ కేసుల సత్వర దర్యాప్తు, విచారణకు మానవ వనరులు, ఇతర సదుపాయాలు కల్పించాలని కేంద్రప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించడం శుభపరిణామం. విచారణ మొదలై 10, 15 ఏళ్ళు దాటినా అభియోగపత్రాలు నమోదు చేయకపోవడంపై ఎలాంటి కారణాలు చెప్పడం లేదని, సంబందిత వ్యక్తుల ఆస్తులు స్వాధీనం చేసుకున్నంత మాత్రాన సరిపోదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. వివిధ కేసుల్లో శిక్షలుపడిన ప్రజాప్రతినిధులు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించడంపై పార్లమెంటే నిర్ణయం తీసుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ సూచించారు. నేరమయ రాజకీయాల విషకౌగిలి నుంచి దేశాన్ని, చట్టసభలను రక్షించడానికి న్యాయ వ్యవస్థ దృఢ సంకల్పం చూపడం అభినందనీయం.
కొంతమంది నేతలపై నమోదయిన కేసుల పరిష్కారానికిరెండు దశాబ్దాలు నిరీక్షించాల్సి వస్తోందని, ఈ లోగా ఆ ‘పెద్ద మనుషులు’ నాలుగుసార్లు ప్రజా ప్రతినిధులుగా వెలిగిపోతున్నారని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయి గతంలోనే ఎత్తిచూపి ఆవేదన చెందారు. నానా విధ నేరగాళ్ళు శాసననిర్మాతలై దేశాన్ని ఏలుతుంటే ఈ దేశమేగతిన బాగుపడుతుంది? బయటమనం తలెత్తి చూడటానికి కూడా సిగ్గుపడే వాళ్ళతో చట్టసభల్లో భుజాలు రాసుకుంటూ తిరగాల్సి వస్తోందని దివంగత ఉప రాష్ట్రపతి కృష్ణకాంత్ ఒకసారి వాపోయారు. ఊడలు దిగిన నేరస్వామ్యానికి తెరపడాలి అంటే న్యాయవ్యవస్థతో పాటు పార్లమెంటు, ప్రజలు, ప్రజాస్వామ్య వాదులు కూడా సంకల్పం వహించాలి. వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేసినా ఇప్పటివరకు అడిగేవారు, స్పందించే వారులేకుండాపోయారు. జేబుదొంగలను జైల్లోపెట్టే చట్టాలున్నాయి. కానీ, దేశాన్ని, రాష్ట్రాన్ని దోచుకొన్నవారికి శిక్షలు మాత్రం లేవు! ఈ అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. ఇప్పటికైనా రాజకీయాల్లో విలువలు పెంచే ప్రయత్నం అన్ని వైపుల నుంచి జరగాలి. నేరగాళ్ల వెన్ను విరిచేలా చర్యలు ఉండాలి. నేరస్థులుగా మచ్చపడ్డవారిని అసలు ఎన్నికల్లో పోటీ చేయనీయకుండా, చట్టసభల్లో ప్రవేశించనివ్వకుండా అడ్డుకుని నిష్కళంక పాలనకు శ్రీకారం చుట్టాలన్న న్యాయవ్యవస్థ ప్రయత్నాలు అభినందనీయం.అయితే కొందరు ఈ ప్రమాదం నుంచి బయటపడకపోతే బతుకులేదన్న విధంగా న్యాయవ్యవస్థపై నిందారోపణలు ఎక్కుపెట్టిన ఉదంతాన్ని దేశ వ్యాప్తంగా చూశారు. సచ్ఛీల రాజకీయాలు అనేసరికి కొందరు కంగారుపడుతున్నారు. పచ్చిదోపిడితో ఆంధ్రప్రదేశ్‌లో అధికారపార్టీ, నేర చరిత్ర గల నాయకులతో లుకలుక లాడిపోతోంది. ఆంధ్రప్రదేశ్ లోనే 138 సిబిఐ, ఈడీ కేసులు దశాబ్దకాలానికి పైగా వివిధ దశల్లో పెండిగుల్లో ఉన్నాయి. ఈ విషయాన్ని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఇచ్చిన నివేదిక మేరకు అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా సుప్రీంకోర్టుకు తెలిపారు. మన రాష్ట్రంలో పెండింగులో కొన్ని కేసుల విచారణలో తీవ్రమైన జాప్యం జరుగుతోందని కూడా వెల్లడించారు. ఈ పరిణామాలు ప్రజాస్వామ్యానికి రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతంగా మారలేదా? రాజకీయాల్లో నేరస్థులను నిలువరించే విషయంలో సుప్రీంకోర్టు చొరవ దేశ ప్రజాస్వామ్యాన్ని మరింత పటిష్ఠపరుస్తుందనడంలో సందేహం లేదు. సామాన్యపౌరులపైనమోదయ్యే చిన్న చిన్న కేసుల్లో దర్యాప్తు వేగంగా పూర్తిచేసి శిక్షలు విధిస్తూ ప్రజాప్రతినిధులపై ఉన్న పెద్దపెద్ద కేసుల విషయంలో ఉదాసీనత చూపెట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం తగదు గాక తగదు. శిక్షలు పడిన వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాలం నిషేధం విధించేలా పార్లమెంటు చొరవ తీసుకోవాలి. అమికస్ క్యూరీ సూచన మేరకు క్రిమినల్, సీబీఐ, ఈడీ, కేసుల్లో విచారణను పర్యవేక్షించేందుకు త్వరగా కమిటీ ఏర్పాటు చేయాలి.
నేరగ్రస్త రాజకీయాలకు ముగింపు పలకడానికి దేశ అత్యున్నత న్యాయస్థానం చూపుతున్న చొరవ అరణ్య రోదనగా మిగిలిపోకూడదు. ఎన్నికల ప్రక్రియ లోనే నేరస్థులను చట్టసభల్లో అడుగు పెట్టకుండా అడ్డుకోవాలి. నేరారోపణలు ఉన్న నేతలు ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకట్ట వేసే శాసనంతోనే స్వచ్ఛ రాజకీయాలకు పునాది పడుతుందని, అటువంటి చట్టాన్ని తీసుకురావాలని సుప్రీంకోర్టు కొన్నేళ్ళక్రితమే పార్లమెంటును కోరింది. అయినా ఆచరించిన దాఖలాలు లేవు.దీనిని బట్టి ప్రజాస్వామ్య పరిరక్షణ క్రతువులో పాలకుల చిత్తశుద్ధి ఏ పాటిదో అర్థమవుతోంది. తాము అధికారంలోకి రాగానే రాజకీయ నాయకులపై ఉన్న కేసులు లెక్క తేలుస్తామని, విచారణ వేగవంతం చేసి రాజకీయాలను ప్రక్షాళిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చి ఏడేళ్లు దాటింది. పార్లమెంట్‌లో నేరచరిత్ర గల, నేరారోపణలు ఎదుర్కొంటున్న వారి శాతం 25 నుంచి 43 శాతానికి పెరిగింది. నీతిబద్ధమైన పాలనకు బాటలు వేయాల్సిన ఎన్నికల వ్యవస్థ కూడా మన దేశంలో భ్రష్టు పట్టిపోయింది. మిణుకు, మిణుకు మంటున్న ప్రజాస్వామ్య దీపం మళ్ళీవెలుగొందాలి అంటే ఎన్నికల వ్యవస్థను సమూలంగా ప్రక్షాళించాలి. 1990లో గోస్వామి కమిటీ నుంచి జస్టిస్ జె.ఎస్ వర్మ సారథ్యంలో ఏర్పాటయిన కమిషన్ వరకు ఎన్నో కమిటీలు, కమిషన్‌లు ఎన్నికల సంస్కరణలు అత్యావశ్యకమని తేల్చి చెప్పాయి. అందుకే ఇప్పటికైనా రాజకీయాల్లో విలువలు పెంచే విధంగా అన్ని వైపుల నుంచికఠినాతికఠినమైన ఎన్నికల సంస్కరణల అమలుకు పూనుకోవాలి. ప్రజాతంత్ర వ్యవస్థ ధ్వంసం అవుతోందని, అందుకు ఎన్నికల సంస్కరణలు తప్పనిసరి అని మాజీ ఎన్నికల కమిషనర్ శేషన్ ఎప్పుడో నొక్కి చెప్పారు. ఏటేటా నేరచరితుల సంఖ్య పెరిగిపోతోంది. అక్రమ సంపాదన కోసం రాజకీయాల్లోకి ప్రవేశించి ప్రజాస్వామ్యం, రాజ్యాంగం పైనే కాకుండా చివరికి న్యాయవ్యవస్థ పైనా యుద్ధం చేస్తున్నారు. అవినీతి పరులను ఎన్నికల్లో దూరంగా ఉంచాల్సిన ప్రజలుకూడా అవినీతిపరులనే అందలాలు ఎక్కించడంతో నేర రాజకీయ సంస్కృతి బహుముఖంగా విస్తరించింది, పార్లమెంట్ మొదలు అసెంబ్లీల వరకు నేర చరితులతో లుకలుక లాడుతున్న శాసననిర్మాణ వ్యవస్థ దేశ ప్రతిష్ఠను పాతాళపు లోతుకు దిగజారుస్తుంది. దశాబ్దాలుగా సాగుతున్న అవినీతి కేసుల విచారణ ఎప్పుడు ముగుస్తుందో, ఎప్పుడు నేరమయ రాజకీయాల పీడ విరగడ అవుతుందో అర్థం కావడం లేదు.వేల కోట్లు ప్రజాధనం దోపిడీ చేసిన వారి పట్ల దర్యాప్తుసంస్థలు కూడా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయి. అక్రమార్కుల పట్ల వేటకుక్కలు కావాల్సిన దర్యాప్తు సంస్థలు ఆర్థిక నేరగాళ్లకు వీరగంధాలు పూస్తున్నాయి! న్యాయవ్యవస్థ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం, ప్రజాస్వామ్య ఫలం అవినీతిపరుల పరం కాకుండా పరిరక్షించడం కోసం చర్యలు చేపట్టడం సంతోషకరం. నేరగ్రస్త రాజకీయాలపై న్యాయపాలిక చేస్తున్నది ఒంటరి పోరు కాకూడదు. స్వచ్ఛమైనశాసన నిర్మాణానికి కేంద్రప్రభుత్వం కూడా గట్టిగా ప్రయత్నించి నేరగ్రస్త రాజకీయంపై అంకుశం మోపిజాతి ప్రయోజనాలు పరిరక్షించాలి. రాజకీయ చరిత్రలో కళంకితులైన రాజకీయ నాయకులను తిరస్కరించడం దేశప్రజల కర్తవ్యంకూడా కావాలి. కళంకితులు తిరిగి చట్టసభల్లోకి ప్రవేశించకుండా చూడటమే ఇప్పుడు కావాల్సింది. అలాగే నేరగ్రస్త రాజకీయాలనుంచి చట్టసభల్ని విముక్తి చేయాలన్న లక్ష్యంతో ప్రజాప్రయోజన వ్యాజ్యాల రూపేణాన్యాయస్థానాల్లో సాగుతున్న పోరాటాలకు చరిత్ర ఉంది. ఈ పోరాటాలకు ఈ సారైనా న్యాయం జరుగుతుందని, చట్టసభలు సచ్ఛీలురతో కొత్తశోభను సంతరించుకుంటాయని ఆశిద్దాం.
యనమల రామకృష్ణుడు
తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరోసభ్యులు