అక్టోబరు 15 నుంచి కాలేజీలు

ABN , First Publish Date - 2020-08-07T08:34:14+05:30 IST

రాష్ట్రంలోని కళాశాలలను అక్టోబరు 15నుంచి ప్రారంభించాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ఉమ్మడి ప్రవేశ పరీక్షలు(సెట్స్‌) సెప్టెంబరులో నిర్వహించాలన్నారు.

అక్టోబరు 15 నుంచి కాలేజీలు

  • వచ్చే నెలలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణ 
  • వర్సిటీల్లో 1,110 అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల భర్తీకి ఓకే 
  • మూడేళ్ల డిగ్రీ కోర్సుల్లో 10 నెలల అప్రెంటిస్‌షిప్‌ 
  • ఆపై మరో ఏడాది నైపుణ్యాభివృద్ధి, ఉపాధిపై శిక్షణ
  • అవి నేర్చుకుంటే ఆనర్స్‌ డిగ్రీగా పరిగణిస్తాం 
  • నాలుగేళ్ల ప్రొఫెషనల్‌ కోర్సుల్లోనూ అప్రెంటిస్‌షిప్‌
  • విజయనగరం, ప్రకాశం జిల్లాల్లో వర్సిటీలు 
  • ఉన్నత విద్యపై సమీక్షలో సీఎం కీలక నిర్ణయాలు 

అమరావతి, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని కళాశాలలను అక్టోబరు 15నుంచి ప్రారంభించాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ఉమ్మడి ప్రవేశ పరీక్షలు(సెట్స్‌) సెప్టెంబరులో నిర్వహించాలన్నారు. వర్సిటీల్లో ఖాళీగా ఉన్న దాదాపు 1,110 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ఉన్నత విద్యపై గురువారం నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఉన్నత విద్యలో గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో(జీఈఆర్‌)ను ఇప్పుడున్న 32.4శాతం నుంచి 90శాతానికి తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, వసతి దీవెన ద్వారా పెద్ద చదువులకు అండగా నిలుస్తున్నామని, అందువల్ల జీఈఆర్‌ కచ్చితంగా పెరగాలన్నారు. మూడేళ్ల డిగ్రీ కోర్సులో 10 నెలల అప్రెంటి్‌సషిప్‌ చేర్చినట్లు తెలిపారు. దీనికి అదనంగా ఒక ఏడాది నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అంశాలపై శిక్షణ ఉంటుందని, దాన్ని డిగ్రీ ఆనర్స్‌గా పరిగణిస్తామన్నారు. అదనంగా ఏడాది అనేది విద్యార్థి ఇష్టాఇష్టాలపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. బీటెక్‌కు సంబంధించి 4ఏళ్లలో కూడా తప్పనిసరి అప్రెంటి్‌సషిప్‌ ఉంటుందన్నారు. 


అదనంగా 20 అడిషనల్‌ క్రెడిట్స్‌ సాధించేవారికి కూడా ఆనర్స్‌ డిగ్రీ ఇవ్వాలని, అడ్మిషన్ల సమయంలోనే సాధారణ డిగ్రీ, ఆనర్స్‌ డిగ్రీపై ఐచ్ఛికాన్ని తీసుకుంటామని స్పష్టం చేశారు. విద్యా విధానంలో మార్పులు రావాలని, మంచి పాఠ్యప్రణాళికతో డిగ్రీలకు విలువ ఉంటుందన్నారు. అక్రమాలకు పాల్పడే కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. తెలుగు, సంస్కృత అకాడమీల ప్రారంభానికి జగన్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. కురుపాంలో ట్రైబల్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ పనులు మొదలు పెట్టేందుకు, విజయనగరం, ప్రకాశం జిల్లాల్లో యూనివర్సిటీలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పాడేరులో గిరిజన వర్సిటీ ఏర్పాటుకు జగన్‌ అంగీకారం తెలిపారు. ఏటా కచ్చితమైన నిధుల కేటాయింపుతో వచ్చే మూడు, నాలుగేళ్లలో వాటి నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. కర్నూలులో క్లస్టర్‌ వర్సిటీ, కడపలో ఆర్కిటెక్చర్‌ వర్సిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వివరించారు. కాలేజీల్లో కూడా ‘నాడు-నేడు’ కార్యక్రమాలు చేపట్టాలని, ఇందుకు సంబంధించి కార్యాచరణ పూర్తిచేయాలని సీఎం సూచించారు.


పాత మెడికల్‌ కాలేజీలను మరమ్మతు చేసి వాటిల్లో ‘నాడు-నేడు’ కోసం రూ.6వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నామన్నారు. ఈ ప్రభుత్వం విద్యారంగంపై దృష్టి పెట్టింది కాబట్టి వీటి గురించి ఆలోచిస్తోందని చెప్పారు. ఇన్నాళ్లుగా వీటి గురించి ఎవరూ ఆలోచన చేయలేదంటూ.. ‘‘ప్రభుత్వాస్పత్రిలో సెల్‌ఫోన్‌ వెలుగులో ఆపరేషన్లు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఎలుకలు కొరికి శిశువు చనిపోయిన పరిస్థితి ఎందుకు వచ్చింది? జనరేటర్లు పనిచేయని పరిస్థితి ఎందుకు వచ్చింది?’’... అని జగన్‌ ప్రశ్నించారు. ఈ సమావేశానికి విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్‌, ఉన్నత విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ సతీశ్‌చంద్ర, ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ వంగాల ఈశ్వరయ్య, కార్యదర్శి ఎన్‌.రాజశేఖరరెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ కె.హేమచంద్రారెడ్డి, కళాశాల విద్య కమిషనర్‌ ఎం.ఎం.నాయక్‌ హాజరయ్యారు. 

Updated Date - 2020-08-07T08:34:14+05:30 IST