Abn logo
Mar 31 2020 @ 03:54AM

జల్లెడలోంచి జారిపోతున్న వలసజీవులు

కరోనా నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలన్నీ బావున్నాయి. అయితే ప్రభుత్వ చర్యల్లో ఇమడని, అవి అందజేస్తున్న సాయాలు వర్తించని వలసజీవుల వ్యథ ప్రస్తుతం పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. రోడ్లు పట్టి వందల కిలోమీటర్లు నడవటానికి సిద్ధమై, సంచుల్ని భుజాన్నేసుకుని, పిల్లల్ని వెంటబెట్టుకుని ఎండల్లో నడుస్తున్న వలస జీవుల వ్యథార్థ గాధలు హృదయాల్ని కదిలిస్తున్నాయి. వీళ్ళకి అక్కడక్కడా పౌరుల నుంచి అందుతున్న సాయాలు ముదావహమే. అయితే ప్రభుత్వాల నుంచి మాత్రం వీళ్ళకి వర్తించే విధంగా పెద్ద సాయమేమీ అందే పరిస్థితులు లేవు. తెలంగాణ ముఖ్యమంత్రి ఇటీవలి ప్రెస్‌మీట్‌లో ఈ వలస జీవులు కూడా తమ రాష్ట్ర అభివృద్ధి నిర్మాణంలో భాగస్వాములేననీ, వారినీ ఆదుకుంటామని ప్రకటించటం హర్షించదగ్గ విషయం. అయితే క్షేత్రస్థాయిలో వీళ్ళకు ప్రభుత్వం వైపు నుంచి నిషేధాలు, అడ్డంకులు తప్ప సాయాలు అందే వ్యవస్థ ఇంకా ఏర్పడలేదన్నది నిర్వివాదాంశం. వీళ్ళు ఉన్నచోటే ఉండేలా, ఉన్నచోట వీళ్ళకు భద్రతా భావం కలిగేలా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ అందిస్తున్న భద్రత జల్లెడలోంచి వీళ్ళు జారిపోకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇది వీరి క్షేమం కోసమే కాదు, వీరు వ్యాధివాహకాలుగా మారి సమాజానికి ఇబ్బంది కలిగించకుండా కూడా అవసరం.

పి. కేశవ కృష్ణ, హైదరాబాద్

Advertisement
Advertisement
Advertisement