ఓసారి వచ్చిపోండి సారూ!

ABN , First Publish Date - 2022-02-23T04:39:22+05:30 IST

సీఎం కేసీఆర్‌ జిల్లా పర్యటనకు వస్తే వరాలు కురిపిస్తారు. ప్రాంత అభివృద్ధికి దోహదపడే పలు అభివృద్ధి పనుల మంజూరుపై ప్రకటనలు చేస్తారు.. ఫలితంగా తమ ప్రాంతం అభివృద్ధి చెందడానికి ఎంతో అవకాశం ఉంటుంది.. ఇదీ జిల్లా ప్రజల ఆశ. అయితే ఏడేళ్లుగా సీఎం రాకకోసం వికారాబాద్‌ జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు.

ఓసారి వచ్చిపోండి సారూ!

  • ముఖ్యమంత్రి రాక కోసం వికారాబాద్‌ జిల్లా ప్రజల ఎదురుచూపులు
  • రాష్ట్రం సిద్ధించిన తర్వాత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలప్పుడు తప్ప మళ్లీ జిల్లాకు రాని సీఎం కేసీఆర్‌
  • కలెక్టరేట్‌, పార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవానికి వ స్తే..అభివృద్ధికి నిధులు వస్తాయన్న ఆశతో ప్రజలు

సీఎం కేసీఆర్‌ జిల్లా పర్యటనకు వస్తే వరాలు కురిపిస్తారు. ప్రాంత అభివృద్ధికి  దోహదపడే పలు అభివృద్ధి పనుల మంజూరుపై ప్రకటనలు చేస్తారు.. ఫలితంగా తమ ప్రాంతం అభివృద్ధి చెందడానికి ఎంతో అవకాశం ఉంటుంది.. ఇదీ జిల్లా ప్రజల ఆశ.  అయితే ఏడేళ్లుగా సీఎం రాకకోసం వికారాబాద్‌ జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఒక్కో జిల్లాలో మూడు, నాలుగు పర్యాయాలు పర్యటించిన సీఎం తమ జిల్లాలో మాత్రం ఇంత వరకూ అడుగు పెట్టక పోవడం పట్ల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వికారాబాద్‌, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): వికారాబాద్‌ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన కోసం జిల్లా ప్రజలు, పార్టీ నాయకులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇతర జిల్లాల్లో ఆయన పర్యటిస్తున్నప్పటికీ.. వికారాబాద్‌ విషయానికొచ్చేసరికి ఏదొక అవాంతరం ఎదురవుతోంది. ఇక్కడ ఇంటిగ్రేటెడ్‌ జిల్లా కార్యాలయాల భవన సముదాయంతో పాటు పార్టీ జిల్లా కార్యాలయం కూడా ప్రారంభోత్సవానికి సిద్ధమైంది.   డిసెంబరు 14న ముఖ్యమంత్రి పర్యటన ప్రాథమికంగా ఖరారైనా.. తమిళనాడు రాష్ట్ర పర్యటనతో వాయిదా పడింది. అదేనెల 19వ తేదీన సీఎం వస్తున్నట్లు ప్రచారం జరిగినా పర్యటన ఖరారు కాలేదు. డిసెంబరులోనే జిల్లాల్లో పర్యటిస్తానని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించడంతో తప్పకుండా వస్తారని ప్రజలు ఆశపడ్డారు. కొత్త భవనాలు, పార్టీ కొత్త కార్యాలయాలను ప్రారంభించడంతో పాటు అభివృద్ధిపై సమీక్షించి, వివిధ కార్యక్రమాలకు నిధులు జారీ చేస్తారని పార్టీ శ్రేణులూ భావించారు. కానీ అందరికీ నిరాశే ఎదురైంది. రాష్ట్రసాధనకు ముందు పలుమార్లు జిల్లాకు వచ్చిన కేసీఆర్‌, ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కేవలం ఎన్నికల ప్రచారానికి మాత్రమే వికారాబాద్‌లో పర్యటించారు. వెరసి.. ఏడేళ్లుగా సీఎం రాకకోసం జిల్లా ఎదురుచూస్తోంది. ఇప్పటికే ఒక్కో జిల్లాలో మూడు, నాలుగు పర్యాయాలు పర్యటించిన సీఎం తమ జిల్లాలో మాత్రం ఇంత వరకూ అడుగు పెట్టకపోవడం పట్ల ప్రజలు ఆవేదన వ్యక్తం        చేస్తున్నారు.

పెండింగ్‌లో ఉన్న ప్రధాన  అభివృద్ధి పనులు

సాగునీరు, తాగునీటి అవసరాల కోసం ప్రతిపాదించిన పాలమూరు రంగారెడ్డి పనులు ఎక్కడివక్కడే ఉన్నాయి. జిల్లాలో ఉన్న కోట్‌పల్లి, లక్నాపూర్‌, నందివాగు, కొంశెట్‌పల్లి, జుంటుపల్లి, సర్పన్‌పల్లి సాగునీటి ప్రాజెక్టులు సరైన మరమ్మతులకు నోచుకోవడం లేదు. తాండూరు కందిపప్పుకు దేశవ్యాప్తంగా మంచిపేరుంది. ఇక్కడ కంది బోర్డు ఏర్పాటుచేసేలా కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తే కందిలో పరిశోధనలు పెరిగి సాగు విస్తీర్ణం పెరిగేందుకు అవకాశం ఏర్పడుతుంది.  ఈ ప్రాంతం నుంచి రోజూ పది వేల మంది వరకు హైదరాబాద్‌కు రాకపోకలు కొనసాగిస్తుంటారు. ఎంఎంటీఎస్‌ సదుపాయాన్ని వికారాబాద్‌ వరకైనా పొడిగించాలన్న డిమాండ్‌ కార్యరూపం దాలిస్తే ప్రజారవాణా సదుపాయం కలుగుతుంది. చారిత్రక నేపథ్యం కలిగిన అనంతగిరి శ్రీలక్ష్మీ అనంత పద్మనాభస్వామి, బుగ్గ, పాంబండ శ్రీరామలింగేశ్వర దేవాలయాలు, జుంటిపల్లి సీతారామ, వెల్చాల్‌ లక్ష్మీ నరసింహస్వామి, రాకంచర్ల దేవాలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలన్న డిమాండ్లూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. ముఖ్యమంత్రి జిల్లాలో ఎప్పుడు పర్యటిస్తారో, ఇవన్నీ ఎప్పుడు నెరవేరతాయో అన్నది ఆసక్తికరంగా మారింది.

సీఎం వస్తే నిధులూ వస్తాయి

సీఎం కేసీఆర్‌ జిల్లా పర్యటనకు వస్తే  ప్రాంత అభివృద్ధికి దోహదపడే పలు అభివృద్ధి పనుల మంజూరుపై ప్రకటనలు చేస్తారు.. ఫలితంగా తమ ప్రాంతం అభివృద్ధి చెందడానికి ఎంతో అవకాశం ఉంటుంది. ఇదీ జిల్లా ప్రజల ఆశ. జిల్లా కేంద్రంలో అత్యాధునిక ఆస్పత్రి, గ్రామీణ విశ్వవిద్యాలయం, విద్యార్థులు, నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షల్లో శిక్షణను ఇప్పించేందుకు ప్రభుత్వ స్టడీ సర్కిల్‌ ఏర్పాటు, ప్రతిపాదిత ఆహారశుద్ధి పరిశ్రమలతో పాటు కాలుష్యరహిత పరిశ్రమలకు ప్రభుత్వ ప్రోత్సాహం, ఉన్నత విద్యాసంస్థలు ఏర్పాటు వంటి డిమాండ్లు చాలాకాలంగా జిల్లా ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. జిల్లాకు ఆనుకుని రీజనల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణం జరగనున్న నేపథ్యంలో తమ జిల్లాకు మున్ముందు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందనే అభిప్రాయం వారిలో వ్యక్తమవుతోంది. తెలంగాణ ఊటీగా పేరొందిన అనంతగిరి కొండలను ఆధ్యాత్మిక, పర్యాటకపరంగా పూర్తిస్థాయిలో అభివృద్ధి పరిచి ఆహ్లాదాన్ని పంచేలా చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్‌ ప్రకటించినా.. ఆ అంశం ప్రతిపాదనలకే పరిమితం కావడం గమనార్హం. 

Updated Date - 2022-02-23T04:39:22+05:30 IST