న్యాయసమ్మతమైన ముగింపునకు రండి

ABN , First Publish Date - 2021-01-26T08:53:07+05:30 IST

హిందూ దేవాలయాలపై దాడి ఘటనలను విచారణ జరిపి న్యాయసమ్మతమైన ముగింపునకు రావాలని సిట్‌ను హైకోర్టు ఆదేశించింది.

న్యాయసమ్మతమైన ముగింపునకు రండి

ఆలయాలపై దాడుల దర్యాప్తులో సిట్‌కు హైకోర్టు ఆదేశం

అమరావతి, జనవరి 25(ఆంధ్రజ్యోతి): హిందూ దేవాలయాలపై దాడి ఘటనలను విచారణ జరిపి న్యాయసమ్మతమైన ముగింపునకు రావాలని సిట్‌ను హైకోర్టు ఆదేశించింది. ఆలయాలపై దాడుల దర్యాప్తును సీబీఐ, ఎన్‌ఐఏకు అప్పగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఘటనలపై విచారణకు ప్రభుత్వం సిట్‌ను నియమించినందున ఈ దశలో సీబీఐ దర్యాప్తు కోరడం అపరిపక్వత అవుతుందని ధర్మాసనం పేర్కొంది. నిందితులను పట్టుకోవడంలో సిట్‌ విఫలమైతే పిటిషనర్లు కోర్టును ఆశ్రయించవచ్చని పేర్కొంది. ఈమేరకు చీఫ్‌ జస్టిస్‌ అరూప్‌ కుమార్‌ గోస్వామి, జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. హిందూ దేవాలయాలపై వరుస దాడులు జరుగుతున్నా, వాటిని నిరోధించేందుకు హోం, దేవదాయశాఖల ముఖ్యకార్యదర్శులు, దేవదాయ కమిషనర్‌, రాష్ట్ర  డీజీపీ చర్యలు తీసుకోవడం లేదని అధ్యాపకుడు కె.రామకృష్ణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.


దర్యాప్తును సీబీఐ లేదా ఎన్‌ఐఏకు అప్పగించాలని కోరారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది పీఎ్‌సపీ సురేశ్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ అంతర్వేది రథం దగ్ధం ఘటన దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించింద న్నారు. తరువాత రాష్ట్రంలో వరుసగా తీవ్రమైన ఘటనలు జరుగుతున్నాయని తెలిపారు. దాడుల వెనుక ఎవరున్నారో తేల్చేందుకు వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించాలని కోరారు. ప్రభుత్వం తరఫు అడ్వకేట్‌ జనరల్‌ వాదనలు వినిపిస్తూ.. ఆలయాలపై దాడులను ప్రభుత్వం తీవ్రంగా పరిగ ణించిందని తెలిపారు. వాటిని దర్యాప్తు చేసేందుకు సిట్‌ను ఏర్పాటు చేసిందన్నారు.


ఎస్సీ, ఎస్టీ చట్టం కింద నేరానికి పాల్పడినట్లు లేదు

తమ ఇంటికొచ్చి కొందరు బెదిరించారంటూ వైసీపీ ఎంపీ నందిగం సురేశ్‌ సోదరుడు వెంకట్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నమోదు చేసిన కేసును రద్దు చేయాలని కోరుతూ ఉద్దండరాయునిపాలెంకు చెందిన బి.లక్ష్మీనారాయణ, మరో 16 మంది హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాధ్‌ రాయ్‌ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న వివరాల మేరకు ఎస్సీ, ఎస్టీ చట్టం కింద పిటిషనర్లను శిక్షించడానికి ప్రాథమిక ఆధారాలు కనిపించడం లేదన్నారు. పిటిషనర్లపై ఎఫ్‌ఐఆర్‌లో నమోదుచేసిన ఇతర సెక్షన్లు.. ఏడేళ్ల లోపు శిక్షకే అవకాశం ఉన్నవి కాబట్టి సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు పిటిషనర్లకు సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులిచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.

Updated Date - 2021-01-26T08:53:07+05:30 IST