నవంబరులోగా నియామకాలు..!

ABN , First Publish Date - 2021-10-22T15:30:18+05:30 IST

రాష్ట్రంలో..

నవంబరులోగా నియామకాలు..!

అమరావతి(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొవిడ్‌ కారణంగా చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కారుణ్య నియామకాలను నవంబరు 30 లోగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ వివిధ శాఖల కార్యదర్శులను ఆదేశించారు. గురువారం ఆయన అమరావతి సచివాలయంలో కార్యదర్శుల సమావేశం నిర్వహించారు. ప్రధానంగా మంత్రివర్గసమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల అమలుకు తీసుకున్న చర్యల నివేదిక తదితర అంశాలపై సమీక్షించారు. కారుణ్య నియామకాలపై సర్క్యులర్‌ జారీ చేశామని, శాఖాధిపతులు సత్వర చర్యలు తీసుకునేలా కార్యదర్శులు చూడాలని ఆదేశించారు. ఇకపై ప్రతి నెలా మొదటి బుధవారం కార్యదర్శుల సమావేశాన్ని నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్ర సచివాలయం మొదలు గ్రామస్థాయి వరకు ఈ-ఆఫీస్‌ విధానాన్ని పటిష్ఠ అమలుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.


అదే విధంగా ఒక అంశానికి సంబంధించిన ఫైలు క్షేత్రస్థాయి కార్యాలయం మొదలు రాష్ట్ర సచివాలయం వరకూ ఒకే నంబరుతో నిర్వహించేలా చూడాలని, దీనిపై జిల్లా కలెక్టర్లు కొన్ని యూనిక్‌ నంబర్లను రూపొందించి పంపేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. వివిధ శాఖల్లో డీపీసీ క్యాలెండర్ల ప్రకారం సకాలంలో ఉద్యోగులకు పదోన్నతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కోర్టు కేసులకు సంబంధించి మాట్లాడుతూ సకాలంలో కౌంటర్లు దాఖలు చేయాలని, కోర్టు తీర్పులను జాప్యం లేకుండా సకాలంలో అమలు చేయాలని సూచించారు. 

Updated Date - 2021-10-22T15:30:18+05:30 IST