‘ముక్కు’ టీకాపై మొదటి దశ పరీక్షలు పూర్తి !

ABN , First Publish Date - 2021-06-22T09:25:35+05:30 IST

ముక్కు ద్వారా తీసుకునే(ఇంట్రానేజల్‌) కొవిడ్‌వ్యాక్సిన్‌పై భారత్‌ బయో టెక్‌ మొదటి దశ ప్రయోగ పరీక్షలను పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

‘ముక్కు’ టీకాపై మొదటి దశ పరీక్షలు పూర్తి !

  • వచ్చే నెలలో సీడీఎస్‌సీఓకు భారత్‌ బయోటెక్‌ నివేదిక
  • కొవాగ్జిన్‌ ‘మూడోదశ’ సమాచారం డీసీజీఐకి !


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ముక్కు ద్వారా తీసుకునే(ఇంట్రానేజల్‌) కొవిడ్‌వ్యాక్సిన్‌పై భారత్‌ బయో టెక్‌ మొదటి దశ ప్రయోగ పరీక్షలను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అయితే వాటికి సంబంధించిన సమాచారం ఇంకా సిద్ధం కాలేదని, దీన్ని సిద్ధం చేసిన తర్వాత వచ్చే నెలలో కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎ్‌ససీఓ)కు సమర్పించే అవకాశాలున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ‘‘మొదటి దశ ట్రయల్స్‌లో చా లా తక్కువ మంది వలంటీర్లపైనే టీకాను పరీక్షిస్తారు. వాక్సిన్‌ భద్రతపై స్పష్టమైన అంచనాకు వచ్చేందుకు ఈ ఫలితాలను వినియోగిస్తారు. ఇక రెండో దశ పరీక్షల్లో భద్రతతో పాటు రోగ నిరోధక ప్రతిస్పందన (ఇమ్యూనిటీ)ను పరీక్షిస్తాం. ఇందులో ఎక్కువ మందిపై టీకాను ప్రయోగిస్తారు. చిట్టచివరివైన మూడోదశ పరీక్షల్లో భారీ సంఖ్యలో వలంటీర్లపై వ్యాక్సిన్‌ను పరీక్షిస్తారు’’ అని వెల్లడించారు. జంతువులపై జరిపిన ప్రయోగ పరీక్షల్లో సా నుకూల ఫలితాలు వచ్చాయని గతంలో భారత్‌ బయోటెక్‌ బిజినెస్‌ డెవల్‌పమెంట్‌ అండ్‌ అడ్వకసీ అధిపతి రేచస్‌ ఎల్లా తెలిపారు. కాగా, కొవాగ్జిన్‌ టీకా మూడోదశ ప్రయోగ పరీక్షల సమాచారాన్ని గత వారాంతంలోనే డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ)కు భారత్‌ బయోటెక్‌ సమర్పించిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

Updated Date - 2021-06-22T09:25:35+05:30 IST