తెనాలిలో కాంగ్రెస్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం

ABN , First Publish Date - 2021-01-20T19:17:42+05:30 IST

రాష్ట్రంలో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని ఏపీ పీసీసీ చీఫ్ శైలజానాథ్ పిలుపునిచ్చారు.

తెనాలిలో కాంగ్రెస్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం

 గుంటూరు: రాష్ట్రంలో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని ఏపీ పీసీసీ చీఫ్ శైలజానాథ్  పిలుపునిచ్చారు. బుధవారం తెనాలిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహిచారు.  ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశంలో మోడీ నిరంకుశ పాలన చేస్తున్నారని ఆయన విమర్శించారు. నూతన వ్యవసాయ చట్టాలతో రైతులకు మేలు జరుగదన్నారు. ఈ చట్టాల కారణంగా కార్పొరేట్ కంపెనీలకు రైతులు కూలీలుగా మారుతారని ఆయన విమర్శించారు. ఒప్పంద వ్యవసాయంతో రైతులు దివాళా తీయడం ఖాయమన్నారు. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర లభించదన్నారు. అదానీ, అంబానీల చేతుల్లోకి వ్యవసాయం వెళుతుందన్నారు. 


రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించి రాహుల్ ను ప్రధానిగా చేయడానికి కృషి చేయాలని ఆయన కోరారు. రాష్ట్రంలో సీఎం జగన్ పాలన అవినీతికి పరాకాష్టగా మారిందన్నారు. మంత్రులు తమ స్థాయికి తగ్గట్టుగా ఉండక వీధి రౌడిల్లా మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

  



అనంతరం వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ మాట్లాడుతూ రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నా సీఎం జగన్ స్పందించడం లేదన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆయన పేర్కొన్నారు. ప్రజలపై వైసీపీ నాయకుల దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయన్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను వెంటనే నిర్వహించాలన్నారు. అధికారం లేదని కార్యకర్తలు అధైర్య పడవద్దని ఆయన సూచించారు. కార్యకర్తలకు పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. ఈ సమావేశంలో జిల్లాలోని నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-20T19:17:42+05:30 IST