తెగిన కాల్వల కాంట్రాక్టర్‌ కందాళ

ABN , First Publish Date - 2020-07-05T07:03:40+05:30 IST

పార్టీ మారినందుకు గిఫ్టుగా నేతలకు టెండర్లు కట్టబెడుతున్నారంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు.

తెగిన కాల్వల కాంట్రాక్టర్‌ కందాళ

  • పార్టీ మారినందుకు గిఫ్టుగా కాంట్రాక్టు..
  • ప్రాజెక్టుల పేరుతో టీఆర్‌ఎస్‌ లూటీ: ఉత్తమ్‌
  • ‘ప్రలోభాలపై’ విచారణ జరగాలి: భట్టి
  • కరోనాపై తప్పుడు లెక్కలు: రేవంత్‌

హైదరాబాద్‌/శంషాబాద్‌, జూలై 4(ఆంధ్రజ్యోతి): పార్టీ మారినందుకు గిఫ్టుగా నేతలకు టెండర్లు కట్టబెడుతున్నారంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. తెగిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టు కాల్వ పనులను పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌కు కాంట్రాక్టు ఇచ్చారని పేర్కొన్నారు. శనివారం తన నివాసంలో ఉత్తమ్‌ మీడియాతో మాట్లాడారు. ప్రాజెక్టుల పేరుతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం లూటీ చేస్తోందని ధ్వజమెత్తారు. దుమ్ముగూడెం ప్రాజెక్టు టెండరు ఎల్‌అండ్‌టీ సంస్థకు వస్తుందని తాను ముందే చెప్పానని అన్నారు. ఆ సంస్థ టెండర్‌ వేయకుంటే.. వారు వేయడానికి వీలుగా టెండర్లను వాయిదా చేశారని ఆరోపించారు. 2014కు ముందు ఇరిగేషన్‌ పనుల్లో అనుభవం లేని ప్రతిమా శ్రీనివాస్‌ సంస్థకు రూ.10 వేల కోట్ల విలువైన కాంట్రాక్టులు అప్పగించారని చెప్పారు.


సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ పార్టీ మారినందుకు ఇరిగేషన్‌ కాంట్రాక్టులు కట్టబెట్టారనడానికి కొండపోచమ్మ సాగరే నిదర్శనమన్నారు. నేతలను ప్రలోభాలకు గురి చేయడంపైన విజిలెన్స్‌ విచారణ జరగాలని డిమాండ్‌ చేశారు.  తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ప్రతి రోజూ ఇచ్చే బులిటెన్‌ కన్నా ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని, కానీ వాటిని ప్రకటించట్లేదని ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ ప్రకటనకు వైద్య, ఆరోగ్య శాఖ డ్యాష్‌ బోర్డు లెక్కలకు చాలా తేడా ఉందన్నారు. ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రజలకు నిజాలు చెప్పాలని రేవంత్‌ ట్వీట్‌ చేశారు. కాగా, పెట్రోల్‌, డీజిల్‌ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ శనివారం రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణులు ధర్నాలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించి మునిసిపల్‌ కమిషనర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లకు వినతిపత్రాలను అందజేశాయి. కరోనా మహమ్మారితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచటం అమానవీయమని ఉత్తమ్‌ అన్నారు. 


వీహెచ్‌ అసంతృప్తి

పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్‌ పదవిని గీతారెడ్డికి ఇవ్వడంపై వి. హన్మంతరావు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. కరోనా బారిన పడి కోలుకున్న వీహెచ్‌ను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా చైర్మన్‌ పదవి  అంశం ప్రస్తావనకు వచ్చింది. దీనిపై గీతారెడ్డి, ఇతర పార్టీ పెద్దలతో మాట్లాడతానని వీహెచ్‌కు ఉత్తమ్‌ హామీ ఇచ్చినట్లు సమాచారం.


ఏపీ అదనంగా నీటిని వాడుకుంటోంది

కేటాయింపుల కన్నా అదనంగా ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాలను తోడుతోందని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌కు ఉత్తమ్‌ ఫిర్యాదు చేశారు. తెలంగాణలోని కృష్ణా ప్రాజెక్టులకు అన్యాయం జరుగుతోందని కేంద్ర మంత్రికి ఆయన లేఖ రాశారు. కృష్ణా నదికి సంబంధించిన వరద జలాలాల్లో తెలంగాణకు కేటాయించిన వాటాను పరిరక్షించాలని కోరారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచుతూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన 203 జీవోను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2020-07-05T07:03:40+05:30 IST