ఫోన్‌ కాల్‌తో పరిష్కారం

ABN , First Publish Date - 2020-04-09T09:16:34+05:30 IST

ఫోన్‌ కాల్‌తో పరిష్కారం

ఫోన్‌ కాల్‌తో పరిష్కారం

104, 1902 కాల్‌ సెంటర్లకు ప్రజల నుంచి మంచి స్పందన


అమరావతి, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): కరోనా నేపథ్యంలో అమలవుతున్న లాక్‌డౌన్‌ కారణంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం ఏర్పడినా వెంటనే పరిష్కరించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాల్‌ సెంటర్లకు మంచి స్పందన వస్తోంది. మొత్తం 11 ముఖ్య ప్రభుత్వ శాఖలను సమన్వయం చేస్తూ ఏర్పాటు చేసిన 104, 1902 కాల్‌ సెంటర్లకు గత వారం రోజుల్లో 12 వేలకు పైగా ఫోన్‌ కాల్స్‌ వచినట్టు సమాచార శాఖ కమిషనర్‌ విజయకుమార్‌ రెడ్డి తెలిపారు. ఆరోగ్యపరమైన సాధారణ సమస్యల పరిష్కారానికి 104, నిత్యావసరాల లభ్యత, రవాణ, అత్యవసర సమస్యలకు 1902 కాల్‌ సెంటర్‌కు ఫోన్లు వస్తున్నట్టు చెప్పారు. 


104 సేవలు: ఆరోగ్యశ్రీ ఆధ్వర్యంలో 24 గంటలూ 104 సేవా కేంద్రం పనిచేస్తోంది. టెలీమెడిసిన్‌  పద్ధతిలో సాధారణమైన అన్ని రోగాలకు వైద్య సేవలు అందిస్తున్నారు. కరోనా లక్షణాలను, ముందు జాగ్రత్తలను కూడా వివరిస్తున్నారు. 


1902 సేవలు: వైద్య, ఆరోగ్యం మినహా అన్ని రకాల సేవలకు ఈ కాల్‌ సెంటర్‌ పనిచేస్తోంది. నిత్యావసర వస్తువుల రవాణా, రైతులకు కనీసం మద్ధతు ధర, సరుకుల లభ్యతలపై నిరంతరం పర్యవేక్షణ, రైతులకు గిట్టుబాటు ధర లేకున్నా, మార్కెట్‌లో నిత్యావసర వస్తువుల ధరలు పెంచినా, నిత్యావసర వస్తువుల లభ్యత లేకున్నా తూకంలో మోసాల పరిష్కారానికి 1902కు ఫిర్యాదు చేయొచ్చు. 

Updated Date - 2020-04-09T09:16:34+05:30 IST