యువతపై కరోనా పంజా!

ABN , First Publish Date - 2020-07-29T08:48:39+05:30 IST

రాష్ట్రంలో యువతపై కరోనా పంజా విసురుతోంది. రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందనుకుంటున్న

యువతపై కరోనా పంజా!

  • బాధితుల్లో 47 శాతం 21-40 ఏళ్లవారే
  • మొత్తం కేసుల్లో 65 శాతం మగవారే
  • పదేళ్లలోపు చిన్నారులు 3.4 శాతం మంది
  • కొవిడ్‌ వల్లే 46.13 శాతం మంది కన్నుమూత
  • ఇతర లక్షణాలతో మరణాలు 53.87 శాతం
  • వివరాలు వెల్లడించిన వైద్య ఆరోగ్యశాఖ

హైదరాబాద్‌, జూలై 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో యువతపై కరోనా పంజా విసురుతోంది. రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందనుకుంటున్న వారే అధిక సంఖ్యలో వైరస్‌ బారిన పడుతున్నారు. తెలంగాణలో సోమవారం రాత్రి వరకు మొత్తం 57,142 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఇందులో సగం మంది యువతే ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించిన గణాంకాల ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా  21-40 ఏళ్ల వయసు వారు ఎక్కువగా కరోనా బారినపడుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి.


రాష్ట్రంలో తొలి కేసు నమోదైన మార్చి 2 నుంచి ఇదే ధోరణి కనిపిస్తోంది. 21-30 ఏళ్ల వయసు యువతలో 22 శాతం మంది, 31-40 ఏళ్ల వారిలో అత్యధికంగా 25 శాతం మందికి వైరస్‌ సోకింది. ఇక 41-50 ఏళ్ల వయసు వారిలో 18.6 శాతం మంది కరోనా బాధితులున్నారు. అంటే ఇంటినుంచి బయటికి వెళ్లి పని చేస్తున్నవారే ఎక్కువగా వైరస్‌ బారిన పడుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇక మొత్తం కేసుల్లో 65 ఽశాతం మంది మగవారే ఉండగా.. 35 శాతం మంది మహిళలు ఉన్నారు. అయితే 11-20 ఏళ్ల వారిలో అమ్మాయిలు 2.4 శాతం, అబ్బాయిలు 2.8 శాతం మంది వైరస్‌ బారిన పడ్డారు. 


పనిచేసే వారిలోనే ఎక్కువ బాధితులు..

2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 15-59 ఏళ్ల వయసు వారు 62.5 శాతం మంది ఉండగా.. మన రాష్ట్రంలో జాతీయ సగటు కంటే ఎక్కువగానే 66 శాతం మంది ఉన్నారు. వీరంతా పని చేసేవారే కావడంతో కరోనా బాధితుల్లోనూ వీరే ఎక్కువగా ఉంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో పని ప్రదేశాలకు వెళుతుండటమే ఇందుకు కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇతర కారణాలు కూడా లేకపోలేదని అంటున్నారు. అయితే రికవరీ కూడా వీరిలోనే ఎక్కుగా ఉంటోంది. తెలంగాణలో రికవరీ రేటు దేశంలో మూడో స్థానంలో నిలిచింది. యువత ఎక్కువగా ఉన్న ఢిల్లీ (84.83 శాతం) తర్వాత మన రాష్ట్రంలోనే (78.37 శాతం) కొవిడ్‌ నుంచి కోలుకుంటున్న వారు ఎక్కువగా ఉంటున్నారు. 


యువత ఎక్కువగా వైరస్‌ బారిన పడేది ఇందుకే!

  • సమాజంలో యాక్టివ్‌ మూవింగ్‌ ఉండేది వీరిలోనే.
  • పైగా 21-30 ఏళ్ల మధ్య వయసు వారిలో ఎక్కువ మంది నిర్లక్ష్యంగా ఉండటం, తమకేం కాదన్న ధీమా. 
  • కొంతమంది యూత్‌ పార్టీలు చేసుకోవడం. 
  • వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేయడం సాధ్యం కానివారు.
  • పని ప్రదేశాలకు తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తున్న వారు.
  • ప్రజా రవాణాపై ఆధారపడే వారు.


యువత వల్లే రికవరీ రేటు ఎక్కువగా ఉంది

దేశంలో, రాష్ట్రంలో వైరస్‌ బారిన పడుతున్న వారిలో యువతే ఎక్కువగా ఉంటున్నారు. వారిలోని రోగనిరోధక శక్తి కారణంగా మరణాల రేటు చాలా తక్కువగా, రికవరీ రేటు ఎక్కువగా ఉంది. యూరప్‌ దేశాల్లో 10 శాతం మరణాలు సంభవిస్తుంటే మన వద్ద 2 శాతమే ఉంటోంది.  - డాక్టర్‌ మాదల కిరణ్‌, హెచ్‌వోడీ, ప్రభుత్వ వైద్య విద్య కళాశాల, నిజామాబాద్‌.



Updated Date - 2020-07-29T08:48:39+05:30 IST