ఒకే కుటుంబంపై కరోనా కాటు

ABN , First Publish Date - 2020-07-30T07:10:25+05:30 IST

కరోనాతో ఓ కుటుంబంలో ఆరు రోజుల వ్యవధిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వారిలో భార్యాభర్తలు, భర్త అన్న కుమారుడు ఉన్నారు. కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ముగ్గురిలో ఒకరి చికిత్సకు ఏకంగా రూ.16 లక్షలు వసూలు

ఒకే కుటుంబంపై కరోనా కాటు

హైదరాబాద్‌ సిటీ, జూలై 29 (ఆంధ్రజ్యోతి): కరోనాతో ఓ కుటుంబంలో ఆరు రోజుల వ్యవధిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వారిలో భార్యాభర్తలు, భర్త అన్న కుమారుడు ఉన్నారు. కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ముగ్గురిలో ఒకరి చికిత్సకు ఏకంగా రూ.16 లక్షలు వసూలు చేశారని.. మరొకరు చనిపోతే రూ.7.5 లక్షలు కడితే గానీ మృతదేహం అప్పగించబోమని పేచీ పెట్టారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.  వారు తెలిపిన వివరాల ప్రకారం.. మహేశ్వరం మండలంలోని ఓ గ్రామానికి చెందిన అడ్వొకేట్‌, 35 ఏళ్ల అవినాశ్‌ (పేరు మార్చాం) చంపాపేటలోని రెడ్డి కాలనీలో నివసిస్తున్నారు. ఆయన బాబాయి (55), చిన్నమ్మ (50) ఆర్టీసీ కాలనీలో  ఉంటున్నారు. ఆవినాశ్‌కి ఈ నెల 4, 5 తేదీల్లో జ్వరం వస్తే స్థానిక వైద్యుడి దగ్గరకు వెళ్లారు. ఎక్స్‌రే తీసి కరోనా వైరస్‌ లోడ్‌ ఉన్నట్లు అనుమానించారు. బంజారాహిల్స్‌లోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రికి అవినాశ్‌ వెళ్లగా రూ.3 లక్షలు కడితేనే బెడ్‌ ఇస్తామని చెప్పారు. రూ.10 లక్షల ఆరోగ్య బీమా ఉందని చెప్పినా ససేమిరా అన్నారు. రూ.3 లక్షలు కట్టగా చేర్చుకున్నారు.  మూడు రోజుల తర్వాత ఓ ఇంజక్షన్‌ చేశారు. పరిస్థితి బాగా లేదని వెంటిలేటర్‌ మీద ఉంచారు. కుటుంబ సభ్యులకు అవినాశ్‌ కోలుకుంటున్నాడని చెప్పిన ఆస్పత్రి వర్గాలు,  24వ తేదీ తెల్లవారుజామున ఫోన్‌ చేసి గుండె పోటుతో చనిపోయినట్లు సమాచారం ఇచ్చారు. రూ.16 లక్షల బిల్లు అయిందని, ఆ మొత్తం వసూలు చేసుకున్నారని అవినాశ్‌ తండ్రి చెప్పారు. ఇక ఆవినాశ్‌ బాబాయి, చిన్నమ్మ అస్వస్థతకు గురై పరీక్షలు చేయించుకోగా కరోనా నిర్ధారణ అయింది. ఇద్దరినీ ఈ నెల 10న సోమాజిగూడలోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు.  రూ.2 లక్షల చొప్పున కట్టించుకున్నారు. 13న డిశ్చార్జి చేశారు. అదే సమయంలో అవినాశ్‌ బాబాయి కుమారుడికి పాజిటివ్‌ వచ్చింది. రెండు రోజుల తర్వాత బాబాయి, చిన్నమ్మలకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో 15న మళ్లీ అదే కార్పొరేట్‌ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ బాబాయికి మాత్రమే బెడ్‌ కేటాయించగా మళ్లీ రూ.2 లక్షలు వసూలు చేశారు. చిన్నమ్మను గచ్చిబౌలిలోని మరో కార్పొరేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఆ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఆమె చెల్లి కొడుకు సిఫారసుతో బీమాపై చికిత్స అందించడానికి ఆస్పత్రి వర్గాలు అంగీకరించాయి. అయినా రూ.25 వేలు కట్టించుకున్నారు. ఆమె మెదడు సంబంధిత జబ్బుతో బాధపడుతుండటంతో పరిస్థితి ఆందోళనకరంగా మారి కోమాలోకి వెళ్లిపోయారు. మంగళవారం మృతి చెందారు. అదే రోజు రాత్రి భర్త కూడా  చనిపోయారు. అప్పటికే మరో రూ.2 లక్షలు కట్టించుకున్న ఆస్పత్రి నిర్వాహకులు.. మరో 7.5 లక్షలు చెల్లించి, మృతదేహాన్ని తీసుకెళ్లాలని కుమారుడికి ఫోన్‌ చేశారు.  కుటుంబ సభ్యులు  బుధవారం ఉదయం వరకు నిరసన వ్యక్తం చేయగా రూ. 2 లక్షలు కట్టాకే అప్పగించారు.


బిల్లు చెల్లించాలని ఒత్తిడి చేయలేదు

ఈనెల 10న చంపాపేటకు చెందిన భార్యాభర్తలు ఆస్పత్రిలో చేరారు. 13న ఇంటికి వెళ్లిపోయారు. మళ్లీ 15న భర్త ఆయాసపడుతూ వచ్చి ఆస్పత్రిలో చేరారు. 26వ తేదీ దాకా ఐసీయూలో ఉంచి చికిత్స అందించాం. పరిస్థితి విషమించి చనిపోయారు. బిల్లు చెల్లింపుపై వారు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదు. మేం ఒత్తిడి చేయలేదు.  

- సోమాజిగూడలోని కార్పొరేట్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌

Updated Date - 2020-07-30T07:10:25+05:30 IST