హైదరాబాద్ నుంచి సొంతూరికెళ్లిన భార్యాభర్తలకు జలుబు, దగ్గు, జ్వరం ఉన్నాయని తెలిసి..

ABN , First Publish Date - 2020-07-13T16:51:34+05:30 IST

గూడూరు పోలీస్‌స్టేషన్‌కు ఇటీవల వచ్చిన స్పెషల్‌ బెటాలియన్‌కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లకు ఆదివారం కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది.

హైదరాబాద్ నుంచి సొంతూరికెళ్లిన భార్యాభర్తలకు జలుబు, దగ్గు, జ్వరం ఉన్నాయని తెలిసి..

ఇద్దరు కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్‌

హైదరాబాద్ నుంచి తిరిగొచ్చిన ముగ్గురికి కూడా..


గూడూరు (వరంగల్): గూడూరు పోలీస్‌స్టేషన్‌కు ఇటీవల వచ్చిన స్పెషల్‌ బెటాలియన్‌కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లకు ఆదివారం కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. గత రెండు రోజులుగా అస్వస్థతతో ఉన్న వారికి పోలీసు అధికారులు కొవిడ్‌-19 పరీక్షలు నిర్వహించినట్లు పోలీసు వర్గాలు స్పష్టం చేశాయి. దీంతో ఇద్దరు కానిస్టేబుళ్లను వైద్య పరీక్షల కోసం హైదరాబాద్‌కు తరలించారు.


తాళ్లపూసపల్లిలో ముగ్గురికి..

కేసముద్రం మండలంలోని తాళ్లపూసపల్లిలో ఇటీవల హైదరాబాద్‌ నుంచి వచ్చిన ముగ్గురికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు తహసీల్దార్‌ వెంకట్‌రెడ్డి ఆదివారం తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి శాంపిల్స్‌ను మూడు రోజుల క్రితం సేకరించగా మూడు పాజిటివ్‌లు నమోదైనట్లు చెప్పారు. వారిని హోం ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తహసీల్దార్‌ తెలిపారు.


రెడ్యాలలో ఒకరికి..

మహబూబాబాద్‌ మండలం పాత రెడ్యాల గ్రామంలోని ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నట్లు జిల్లా కొవిడ్‌ ఇంచార్జి డాక్టర్‌ మల్లం రాజేష్‌ ఆదివారం తెలిపారు. ఈ నెల 7న కరోనా పాజిటివ్‌ లక్షణాలు కలిగిన వ్యక్తి ప్రైమరీ కాంటాక్ట్‌లో ఉన్న వారి రక్త నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపించగా అందులో మరో వ్యక్తికి వచ్చిన రిపోర్టులో పాజిటివ్‌ వచ్చినట్లు చెప్పారు. 


రాజుతండాలో ఒకరికి..

డోర్నకల్‌ మునిసిపల్‌ పరిధిలోని రాజుతండాకు చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు జిల్లా కొవిడ్‌-19 ప్రోగ్రాం అధికారి రాజేష్‌ తెలిపారు. తండాకు చెందిన దంపతులు హైదరాబాద్‌లోని బేగంపేట నుంచి రాజుతండాకు ఈనెల 8న వచ్చారు. జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్న దంపతులను ఏఎన్‌ఎం గుర్తించగా మహబూబాబాద్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆదివారం వచ్చిన రిపోర్టుల్లో భార్యకు నెగెటివ్‌ రాగా, భర్తకు కరోనా నిర్ధారణ అయింది. దీంతో ఆ ప్రాంతాన్ని అధికారులు కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటించారు.

Updated Date - 2020-07-13T16:51:34+05:30 IST