Abn logo
May 27 2020 @ 13:20PM

అప్పుడు ఢిల్లీ.. ఇప్పుడు పూనె.. ఖమ్మం జిల్లాలో మళ్లీ కరోనా కలవరం

మూడుకు చేరిన రెండోవిడత కేసులు 

భవిష్యత్‌పై భయంభయం

వలస కార్మికులతోనే ఆందోళన


ఖమ్మం (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ‘హమ్మయ్య కరోనా కేసులు సున్నాకు చేరుకున్నాయి. ఇక మనం సేఫ్‌’ అనుకుంటున్న సమయంలో ఖమ్మం జిల్లాలో ఎక్కడో ఒక చోట కరోనా కలకలం రేపుతూనే ఉంది. మొదటివిడతలో వరుసగా ఎనిమిది కేసులు నమోదవడం, వాటికి ఢిల్లీ మర్కజ్‌ ప్రార్థనలకు వెళ్లిరావడం కారణం కాగా.. ఆ విడతలో వైరస్‌ బారిన పడ్డవారు హైదరాబాద్‌లో చికిత్స పొంది.. కోలుకున్నారు. దీంతో అటు అధికారులు, ఇటు ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. కానీ ఇప్పుడు రెండోవిడతగా కేసులు పెరుగుతున్నాయి. జిల్లా నుంచి మహారాష్ట్రలోని పూనే ప్రాంతానికి వెళ్లి.. లాక్‌డౌన్‌ సడలింపులతో విడతల వారీగా వస్తున్న వారిలో కరోనా లక్షణాలు బయటపడుతుండటం.. అధికార యంత్రాంగానికి తలనొప్పిగా మారింది. ఇలా బయటప్రాంతాల నుంచి వచ్చిన వారిలో కరోనా లక్షణాలు బయట పడుతుండటంతో.. లాక్‌డౌన్‌ పూర్తిస్థాయిలో ఎత్తేస్తే.. వైరస్‌ ఎవరి నుంచి ఎవరికి వ్యాప్తి చెందుతుందోనన్న భయం అందరిలోనూ కనిపిస్తోంది. 


జాతకాలు చెప్పేందుకు వెళ్లి వచ్చిన వారిలో..

పలు రాష్ట్రాల్లో తిరుగుతూ జాతకాలు చెబుతూ జీవించే ఖమ్మం జిల్లాకు చెందిన కొందరు ఇటీవల పూనే నుంచి ఖమ్మం జిల్లాకు చేరుకోగా.. వారిని అధికారులు ప్రభుత్వ క్వారంటైన్‌ కేంద్రాల్లో, హోం క్వారంటైన్‌లో ఉంచారు. అలా వచ్చిన వారిలో ముగ్గురికి పాజిటివ్‌ రావడంతో వారిని హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. తొలుత పూనె నుంచి మధిర మండలం మహదేవపురంలో ఒకరికి, ఆ తర్వాత పెనుబల్లి మండలం వీఎం బంజరకు చెందిన ఓ మహిళకు, తాజాగా వీఎం బంజరకు చెందిన మరో వ్యక్తికి కరోనా నిర్ధారణైంది. దీంతో బయట ప్రాంతాలకు వలస వెళ్లి తిరిగి జిల్లాకు వచ్చిన వారి నుంచి కరోనా ముప్పుపై మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. 


తొలుత మర్కజ్‌ ప్రార్థనలు.. 

రాష్ట్రంలో వైరస్‌ ప్రభావం ప్రారంభమైన సమయంలో ఖమ్మం జిల్లాలో కరోనా కేసులు నమోదవలేదు. విదేశాల నుంచి వచ్చిన వారిలో ఎవరికీ లక్షణాలు కనిపించలేదు. ఆ సమయంలో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కానీ ఆ తర్వాత అనూహ్యంగా ఢిల్లీ మర్కజ్‌ ప్రార్థనలకు వెళ్లిన వారితో కలిసి వచ్చిన ఓ వ్యక్తికి, ఆయనను కలిసిన ఓ వ్యక్తికి, ఆ వ్యక్తి ద్వారా అతడి కుటుంబీకులకు, వారి ద్వారా ఆ ఇంటి పనిమనిషికి ఇలా.. నగరంలో మొత్తం ఎనిమిది మంది కరోనా బారిన పడ్డారు. వీరంతా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొంది క్షేమంగా ఇంటికి చేరుకుని.. హోంక్వారంటైన్‌లో ఉంటున్నారు. దీంతో అధికారులు, ప్రజలు అంతా ఊపిరిపీల్చుకున్నారు. కానీ ఇంతలోనే మహారాష్ట్రనుంచి వచ్చిన వారిలో లక్షణాలు బయటపడుతుండటం కలకలం రేపుతోంది. మహారాష్ట్ర తదితర ప్రాంతాలకు వెళ్లి వచ్చిన వారు 2,500మంది ఉండగా.. వారిలో కొందరిని ప్రభుత్వ క్వారంటైన్లలో, మరి కొందరిని హోం క్వారంటైన్‌లో ఉంచారు. బయట ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో లక్షణాలు కనిపిస్తుండటంతో క్వారంటైన్లలో ఉన్న వారిపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 


ఎవరి జాగ్రత్తలో వారుండాల్సిందే.. 

లాక్‌డౌన్‌లో సడలింపులు ఇచ్చిన నేపథ్యంలోనే కరోనా పాజిటివ్‌ కేసులు నమోదువుతుండగా.. లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేసి థియేటర్లు, పాఠశాలలు, ఫంక్షన్‌హాళ్లు, రెస్టారెంట్లను తెరిస్తే పరిస్థితి ఏంటా? అన్న ఆందోళన అందరిలోనూ కనిపిస్తోంది. సమూహ వ్యాప్తి అనేది జరిగితే వందలమంది వైరస్‌ బారిన పడే ప్రమాదం పొంచి ఉంది. ఇక బస్సులు, రైళ్లలో రాకపోకలు సాగితే మరింత ముప్పు వాటిల్లే  అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలో ఎవరికి వారు స్వీయ జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మాస్కులు ధరించడం, శానిటైజర్లు ఉపయోగించడం, భౌతిక దూరం పాటించడం లాంటివి ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Advertisement
Advertisement