కరోనా వస్తే కాళ్లకూ ముప్పే!

ABN , First Publish Date - 2020-07-31T07:21:59+05:30 IST

ఊపిరి తీసుకోవడం కాస్త కష్టమనిపిస్తే కరోనా వచ్చిందేమోనని భయపడుతుంటాం. శ్వాస తీసుకోవడంలో కాస్త ఇబ్బంది అనిపించినా.. వణికిపోతుంటాం. ఎందుకంటే.. కొవిడ్‌ ఎక్కువగా ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపించే జబ్బు కనుక. ఒక్కసారి కరోనా సోకితే.. ఊపిరితిత్తులతో పాటు

కరోనా వస్తే కాళ్లకూ ముప్పే!

హైదరాబాద్‌ సిటీ, జూలై 30 (ఆంధ్రజ్యోతి): ఊపిరి తీసుకోవడం కాస్త కష్టమనిపిస్తే కరోనా వచ్చిందేమోనని భయపడుతుంటాం. శ్వాస తీసుకోవడంలో కాస్త ఇబ్బంది అనిపించినా.. వణికిపోతుంటాం. ఎందుకంటే.. కొవిడ్‌ ఎక్కువగా ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపించే జబ్బు కనుక. ఒక్కసారి కరోనా సోకితే.. ఊపిరితిత్తులతో పాటు కిడ్నీలు, గుండె కూడా తీవ్రమైన ప్రభావానికి లోనవుతాయని వైద్యులు చెబుతున్నారు. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. కానీ.. ఇక్కడ చాలామందికి తెలియని మరో ముప్పు కూడా ఉంది. కరోనా వస్తే కాళ్లకు కూడా ముప్పు ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. కరోనాకి, కాళ్లకి సంబంధం ఏమిటని అనుకుంటున్నారా? కరోనా సోకితే.. రక్తం చిక్కబడుతుంది. రక్తం చిక్కబడితే.. దాని ప్రసరణ వేగం మందగిస్తుంది. నెమ్మది నెమ్మదిగా గడ్డ కడుతుంది. రక్తం గడ్డ కట్టిందంటే.. అటు గుండెపై ఇటు కాళ్లపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. ఒక్కసారి కాళ్లకు చేరిన రక్తం అక్కడే గడ్డకట్టిపోయి తిరిగి గుండెకు చేరలేదంటే చాలా ప్రమాదం. కాళ్లలో రక్త సరఫరా నిలిచిపోతే చాలా మంది వెంటనే గుర్తించలేరు. ఈ లోగానే జరగాల్సిన నష్టం జరిగిపోతుందని వైద్యులు అంటున్నారు. ఈ పరిస్థితిని గుర్తించడంలో ఆలస్యమైతే.. కాళ్లను తొలగించాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయని వారు హెచ్చరిస్తున్నారు. 


ఆరుగురి కాళ్ల తొలగింపు

కరోనా పాజిటివ్స్‌లో ఏదో ఒక రకంగా రక్తం గడ్డకడుతోందని వైద్యులు ఇటీవల గుర్తించారు. కిమ్స్‌ ఆస్పత్రిలో నెల రోజుల్లో 25 నుంచి 30 శాతం వరకు ఈ రకం రోగులను గుర్తించినట్లు చీఫ్‌ కన్సల్టెంట్‌ వాస్క్యులర్‌, ఎండో వాస్క్యులర్‌ సర్జన్‌ డాక్టర్‌ నరేంద్రనాథ్‌ మేడా చెప్పారు. నెల వ్యవధిలో 375 నుంచి 450 మంది రోగుల్లో రక్తం గడ్డ కట్టిందని, వెంటనే పలుచబడేందుకు ఇంజెక్షన్లు ఇచ్చినట్లు తెలిపారు. గుర్తించడంలో కొంచెం ఆలస్యం జరిగున్నా.. వారి పరిస్థితి విషమంగా మారేదని వివరించారు. కొంత మంది ఆలస్యంగా ఆస్పత్రికి రావడం వల్ల అప్పటికే రక్తం కట్టేసి పరిస్థితి తీవ్రమవుతోందని, అలాంటి వారిలో ఆరుగురికి తప్పనిసరి పరిస్థితుల్లో కాళ్లు తొలగించాల్సి వచ్చిందని వెల్లడించారు. మరో ముగ్గురికి ఊపిరితిత్తులకు రక్త సరఫరా జరగకపోవడంతో.. సివియర్‌ కాపార్ట్‌మెంట్‌ సిండ్రోమ్‌ వచ్చి ప్రాణాలు కోల్పోయారని డాక్టర్‌ నరేంద్రనాథ్‌ తెలిపారు.  కాళ్ల రక్తనాళాల్లో రక్తం చిక్కబడితే కాళ్ల నొప్పులు తీవ్రంగా ఉంటాయని.. వారికి అత్యవసరంగా చికిత్స చేయాల్సి ఉంటుందని తెలిపారు. 


రక్తాన్ని వేగంగా గడ్డ కట్టిస్తుంది

సాధారణ వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ మాదిరిగా కాకుండా, కరోనా వైరస్‌ ఊపిరితిత్తుల్లో వేగంగా రక్తాన్ని గడ్డ కట్టిస్తుందని వైద్యులు తెలిపారు. ఆ తీవ్రత పెరిగే కొద్దీ రక్త సరఫరా ఆగిపోయి.. శ్వాస ఇబ్బందిగా మారుతుందని, చివరకు ఊపిరి ఆడని పరిస్థితి ఏర్పడుతుందని స్టార్‌ ఆస్పత్రి సీనియర్‌ కార్డియాలజిస్టు డాక్టర్‌ రమేష్‌ గూడపాటి తెలిపారు. ఆస్పత్రులకు వస్తున్న బాధితుల్లో ఎక్కువగా ఈ తరహా కేసులను చూస్తున్నట్లు చెప్పారు. 


ఇలా నివారించాలి..

కాళ్లలో రక్తం గడ్డకట్టకుండా జాగ్రత్త పడాలి. ఎక్కువసేపు పడుకునే ఉండకూడదు. తరచుగా నీళ్లు తాగుతూ.. చురుగ్గా ఉండాలి. పాదాలు తరుచూ కదిలిస్తుండాలి. ఊపిరితిత్తుల వ్యాయమం చేస్తుండాలి. హోం క్వారంటైన్‌లో ఉన్న వారు కాలు వాచినా, నొప్పిగా అనిపించినా, ఊపిరి తీసుకోవడం ఇబ్బందయినా ఆస్పత్రికి వెళ్లాలి. 

- డాక్టర్‌ నరేంద్రనాథ్‌ మేడా, కిమ్స్‌ ఆస్పత్రి


పది మందిలో తీవ్రతను గమనించాం

కరోనా బాధితుల్లో నెల వ్యవధిలో పది మంది గుండె సమస్యలను ఎదుర్కొన్నారు. వీరిలో రక్తం చిక్కబడడం వల్ల ఈ సమస్య ఏర్పడుతున్నట్లు గుర్తించాం. రక్తం సరఫరాలో హెచ్చుతగ్గుల కారణంగా అసాధారణగా రక్తం గడ్డ కడుతుంది. కాళ్లకు చేరిన రక్తం అక్కడే గడ్డ కట్టిపోయి.. గుండె, ఊపిరితిత్తులకు సరఫరా కాకపోవడం వల్ల ఇబ్బందులు వస్తాయి. మెదడు రక్తనాలలో రక్తం గడ్డ కడితే అది పక్షవాతానికి దారి తీస్తుంది. రక్తం చిక్కపడడం వల్ల గుండెకు సరిగా రక్త సరఫరా జరగదు. దీంతో గుండె విఫలమవుతుంది.   

- డాక్టర్‌ రమేష్‌ గూడపాటి,  స్టార్‌ ఆస్పత్రి

Updated Date - 2020-07-31T07:21:59+05:30 IST