ఈయన నిద్రపోతే.. బాబు వ్యాక్సిన్లు తేవాలా?

ABN , First Publish Date - 2021-05-21T08:55:35+05:30 IST

ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి అసమర్థత కారణంగానే రాష్ట్రంలో వేల సంఖ్యలో ప్రజలు కరోనా బారిన పడి మరణించారని తెలుగుదేశం పార్టీ ధ్వజమెత్తింది. కరోనా మొదటి దశ తర్వాత రెండో దశ రావడానికి ఆరు నెలల వ్యవధి దొరికినా

ఈయన నిద్రపోతే.. బాబు వ్యాక్సిన్లు తేవాలా?

జగన్‌ అసమర్థతతోనే కరోనా మరణాలు

అన్ని రాష్ట్రాలూ వ్యాక్సిన్‌కు ఆర్డరిచ్చాయి

ఈయన పారాసిటమాల్‌, బ్లీచింగ్‌ చాలన్నారు

వ్యాక్సిన్‌కు నిధులివ్వకుండా చంద్రబాబు తేవాలని కబుర్లా?

పడకలు, ఆక్సిజన్‌, వైద్యం కోసం ప్రజలు అడుక్కోవలసిన పరిస్థితి

టీడీపీ సమాంతర అసెంబ్లీ ధ్వజం.. కరోనా మృతులకు సంతాపం

డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించలేదని వాకౌట్‌


అమరావతి, మే 20 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి అసమర్థత కారణంగానే రాష్ట్రంలో వేల సంఖ్యలో ప్రజలు కరోనా బారిన పడి మరణించారని తెలుగుదేశం పార్టీ ధ్వజమెత్తింది. కరోనా మొదటి దశ తర్వాత రెండో దశ రావడానికి ఆరు నెలల వ్యవధి దొరికినా ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్‌ వసతులు, వెంటిలేటర్లు, సిబ్బందిని పెంచకుండా ప్రభుత్వం పరమ నిర్లక్ష్యంతో వ్యవహరించిందని, దాని ఫలితంగానే ప్రజలు వైద్యం అందక దయనీయ పరిస్ధితుల్లో మరణించారని విమర్శించింది. గురువారం జరిగిన ఒకరోజు అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాన్ని బహిష్కరించిన టీడీఎల్పీ..  తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమాంతర అసెంబ్లీ సమావేశం నిర్వహించింది. ప్రకాశం జిల్లా కొండపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామి స్పీకర్‌గా వ్యవహరించారు. రాష్ట్రంలో కరోనా ఉధృతిపై చర్చను టీడీఎల్పీ ఉప నేత నిమ్మల రామానాయుడు ప్రారంభించారు. ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి కరోనా పోవడానికి పారాసిటమల్‌, బ్లీచింగ్‌ పౌడర్‌ చాలన్న ధోరణిలోనే ఉండిపోవడంతో దానికి తగిన సన్నద్ధత కొరవడిందని విమర్శించారు. ‘వ్యాక్సినేషన్‌లో రాష్ట్రం దేశంలోనే 28వ స్థానంలో ఉండడం ఈ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. కేంద్రానికి ఇచ్చే కోటా పోను రాష్ట్రాలకు సరఫరా చేస్తామని సీరం వ్యాక్సిన్‌ కంపెనీ ఏప్రిల్‌ 20న ప్రకటించింది. వెంటనే తమిళనాడు కోటి డోసులకు, కేరళ 30 లక్షల డోసులకు ఆర్డర్లు పెట్టాయి. ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర గత నెలలోనే వ్యాక్సిన్ల సరఫరాకు గ్లోబల్‌ టెండర్లు పిలిచి వాటిని ఖరారు చేసేశాయి. గ్లోబల్‌ టెండర్లు పిలవాలని కొద్ది రోజుల కింద నిర్ణయం తీసుకున్నారు. అయితే డబ్బులు వెంటనే ఇచ్చేది లేదని సవాలక్ష నిబంధనలు పెట్టారు. 


ఇలాగైతే ఎవరు వస్తారు? డబ్బులు కేటాయించకుండా.. ఆర్డర్‌ పెట్టకుండా ఇప్పుడు వ్యాక్సిన్లను చంద్రబాబు ఇప్పించడం లేదని చేతగాని మాటలు మాట్లాడుతున్నారు. మీ సలహాదారుల జీతాలు, సొంత పత్రికలో ప్రకటనలకు వందల కోట్లు వెచ్చించేవారు వ్యాక్సిన్లకు డబ్బు ఇవ్వలేరా’ అని నిలదీశారు. ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ ఇవ్వాలని, రోగులు వస్తున్న స్ధాయిలో ఆక్సిజన్‌, వెంటిలేటర్లు, పడకలు లభ్యత పెంచాలని, కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన పేదలకు ప్యాకేజి ఇవ్వాలని, కరోనా కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు రూ.పది లక్షలు పరిహారం ఇవ్వాలని, ఆక్సిజన్‌ దొరక్క చనిపోయిన వారి కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వాలని, పాత్రికేయులను ఫ్రంట్‌ లైన్‌ వారియర్లుగా గుర్తించాలని డిమాండ్‌ చేశారు.


సీఎం, మంత్రులకు మాస్కులేవీ: అచ్చెన్న 

ఒక్కరోజు మాత్రమే అసెంబ్లీ పెట్టి దులుపుకొని పోవడంలోనే ఈ ప్రభుత్వానికి కరోనాపై ఉన్న శ్రద్ధ ఏమిటో తెలిసిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. అందరూ మాస్కులు పెట్టుకోవాలని కోట్ల రూపాయలు ఖర్చు చేసి రాష్ట్రమంతా హోర్డింగులు పెట్టారని, కానీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాత్రం మాస్క్‌ పెట్టుకోలేదని ఆక్షేపించారు.  


సీఎంకు ఇంత కులగజ్జా: గోరంట్ల

గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ.. కరోనా బారినపడిన వారు బిచ్చగాళ్ళ మాదిరిగా పడకలు, ఆక్సిజన్‌, వెంటిలేటర్ల కోసం అందరినీ అడుక్కోవలసి వస్తోందని, ఆస్పత్రుల ముందు వారు పడిగాపులు పడుతున్న తీరు హృదయ విదారకంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా గురించి అసెంబ్లీలో ఏం చర్చిస్తారో అని ప్రజలు ఎదురు చూస్తుంటే వైసీపీ సభ్యులు పచ్చి బూతులు మాట్లాడారని.. ముఖ్యమంత్రి కూడా కులాల గురించి మాట్లాడారని, ఆయనకు ఇంత  కుల గజ్జి ఎలా అంటిందో అర్ధం కావడం లేదన్నారు. బ్లాక్‌ ఫంగస్‌కు ఆరోగ్యశ్రీ కింద రూ.50 వేలిస్తే చికిత్సలు జరుగుతాయా అని నిలదీశారు. బచ్చుల అర్జునుడు స్పీకర్‌ అనుమతితో సమావేశంలో ప్రభుత్వ వైఫల్యాలపై కొన్ని వీడియోలు ప్రదర్శించారు. కరోనా బారినపడి 22 వేల మంది మరణిస్తే ఒక్కరికి కూడా పైసా సాయం అందలేదని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, ఎమ్మెల్సీ గౌరివాని శ్రీనివాసలు విమర్శించారు.

Updated Date - 2021-05-21T08:55:35+05:30 IST