వినాయకచవితిపై కరోనా ప్రభావం

ABN , First Publish Date - 2020-07-12T09:41:56+05:30 IST

ప్రతీఏటా వినాయక చవితి వస్తోందంటే చాలు మూడు, నాలుగు నెలల ముందుగానే విగ్రహాల తయారీ సందడి కనిపిస్తుంటుంది.

వినాయకచవితిపై కరోనా ప్రభావం

ఉపాధి కోల్పోతున్న విగ్రహాల తయారీదారులు

నాడు వేలల్లో.. నేడువందల్లో ధరలు 

‘కోవిడ్‌’ ప్రభావంతో ఈసారి సందడి తగ్గే అవకాశం


ఖమ్మం, జూలై 11(ఆంధ్రజ్యోతిప్రతినిధి): ప్రతీఏటా వినాయక చవితి వస్తోందంటే చాలు మూడు, నాలుగు నెలల ముందుగానే విగ్రహాల తయారీ సందడి కనిపిస్తుంటుంది. మారుమూల పల్లెనుంచి పెద్దపెద్ద పట్టణాలతోపాటు ఊరూరా, వాడవాడల్లోనే కాదు దేశ విదేశాల్లోనూ గణేష్‌ విగ్రహాలను నెలకొల్పి నవరాత్రులు నిర్వహించే సంప్రదాయం అనాదిగా వస్తోంది. కానీ ఈ ఏడాది వినాయక ఉత్సవాలపై కరోనా ప్రభావం తీవ్రంగా కనిపస్తోంది. ప్రతీ ఏటా వేల సంఖ్యలో తయారయ్యే వినాయక విగ్రహాలు.. ఈ సారి ఎక్కడ అమ్ముడు పోకుండా మిగిలిపోతాయోనన్న భయంతో వంద, రెండు వందలకే పరిమితమయ్యాయి. దీంతో రూ.కోట్లలో సాగే వ్యాపారం కాస్తా దిగాలు పడే అవకాశం ఉంది. రాజస్థాన్‌, మహారాష్ట్ర, గుజరాత్‌ ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారు ప్రతీఏటా హోలీ పండుగ నాటి నుంచే వినాయక విగ్రహాలు తయారుచేయడం ప్రారంభిస్తారు.


ఈ క్రమంలో ఉత్సవ నిర్వాహకులు వారికి ముందుగానే తమకు పలానా ఆకారంలో ఉన్న విగ్రహం కావాలంటూ ఆర్డర్లు పెట్టి తయారుచేయించుకుంటారు. ఈ సారి ఆ ఆర్డర్ల సంఖ్య తగ్గిందని తయారీదారులు చెబుతున్నారు. దీంతో తాముకూడా విగ్రహాలను భారీమొత్తంలో కాకుండా పరిమిత సంఖ్యలో తయారు చేస్తున్నామంటున్నారు. వచ్చే నెల 22న వినాయక చవితి ఉండగా.. ఈ సారి ఎక్కడా కూడా తయారైన విగ్రహాలు కనిపించని పరిస్థితి. ఉదాహరణకు ఉమ్మడి ఖమ్మంజిల్లాలో కనీసం 3వేల నుంచి 5వేల వరకు చిన్నాపెద్దా విగ్రహాలు ప్రతిష్టించడం జరుగుతుంది. 20ఏళ్లక్రితం ఖమ్మం వచ్చిన రాజస్థానీ కుటుంబాలు ఈవినాయక విగ్రహాలను తయారుచేసి ఉమ్మడి జిల్లాతోపాటు పొరుగున ఉన్న మహబూబాబాద్‌, సూర్యాపేట, కృష్ణా జిల్లాలకు కూడా తరలించి విక్రయిస్తుంటారు. ఒక్కో కుటుంబం 2వేల నుంచి3వేల విగ్రహాలు తయారుచేస్తారు. కానీ ఈసారి కరోనా నేపథ్యంలో పెట్టుబడి పెట్టి తయారుచేస్తే నష్టపోతామని భావించి వందా, రెండువందల విగ్రహాలకే పరిమితమయ్యారు. 


బాబురాం సారన్‌ ఏమంటున్నారంటే.. 

20ఏళ్ల క్రితం రాజస్థాన్‌లోని పాళీ జిల్లానుంచి ఖమ్మం వచ్చాం. గోపాలపురంలో రోడ్డుపక్కన ఓ ప్రైవేట్‌ స్థలంలో ఏడాదికి రూ.40వేలు కిరాయి చెల్లించి గుడారం వేసుకుని జీవిస్తున్నాం. నాకు భార్య, ఆరుగురు పిల్లలు. కుటుంబం మొత్తం వినాయక విగ్రహాల తయారీ అమ్మకంతోనే జీవిస్తున్నాం. ప్రతీ ఏటా వెయ్యి నుంచి 2వేల విగ్రహాలు తయారుచేసేవాడిని. మాతోపాటు ఖమ్మంలో మరో నాలుగు కుటుంబాలు కూడా ఇలా ఏటా వినాయక విగ్రహాలు తయారు చేస్తుంటాయి. ఒక్కో విగ్రహం చిన్నాపెద్దవి కలుపుకొని రూ.500నుంచి రూ.5వేల వరకు విక్రయిస్తాం. ఈ క్రమంలో రూ.5లక్షల నుంచి రూ.10లక్షల వరకు మా వ్యాపారం ఉంటుంది. పెట్టుబడిపోను ఎంతోకొంతమిగిలేది. కానీ కరోనా వచ్చిన తర్వాత పరిస్థితి చూసి విగ్రహాలు తయారుచేయడం తగ్గించాం. వాస్తవానికి హోలీ పండుగ నాటి నుంచే విగ్రహాలు పగలూరాత్రీ తయారుచేసి వినాయక చవితినాటికి సిద్ధం చేస్తాం. కానీ ఈ సారి 200విగ్రహాల లోపే తయారుచేసినా.. అవి కూడా అమ్ముడుపోతాయో లేదోనని భయంగా ఉంది. పెట్టుబడి పెట్టి వినాయక విగ్రహాలు తయారుచేశాం. ఇక అంతా ఆ దేవుడి దయ. ఏడాదికి రూ.40వేలు భూమికి అద్దె చెల్లించాలి.


అయితే ఈ సారి వినాయక విగ్రహాలు అంతగా అమ్ముడుపోయే పరిస్థితి లేకపోవడంతో మట్టితో తయారు చేసిన షోకేస్‌ బొమ్మలు, దిష్టిబొమ్మలు, జంతువుల బొమ్మలు రోడ్డుపక్కన పెట్టి అమ్ముతున్నాం. రోజూ రూ.500వరకు అమ్మితేనే రోజు గడుస్తుంది. మాకు ఇప్పటి వరకు రేషన్‌కార్డు లేదు. బ్యాంకు అప్పు తెలియదు. అప్పుకావాలంటే ప్రైవేటు వ్యక్తులు వద్ద వడ్డీకి తెచ్చి పెట్టుబడి పెట్టాలి. ఈచిన్న గుడారంలోనే కుటుంబ జీవనంతోపాటు చేసిన విగ్రహాలు ఉంచుకోవాలి. గాలిదుమారం వచ్చినప్పుడు ఇబ్బంది పడుతున్నాం. కరోనా విపత్కర సమయంలో మాలాంటి చేతివృత్తుల వారిపరిస్థితి గ్రహించి ప్రభుత్వం ఆదుకోవాలి. మేం రాజస్థాన్‌నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి 20ఏళ్లవుతున్నా, మా పిల్లలు ఇక్కడే పుట్టినా మమ్మల్ని స్థానికేతరులగా చూస్తున్నారు. రేషనర్‌కార్డు, డబుల్‌బెడ్‌రూం అందుకోలేకపోతున్నాం. 

Updated Date - 2020-07-12T09:41:56+05:30 IST