బోధనాస్పత్రులన్నీ కరోనా సేవకే?

ABN , First Publish Date - 2020-04-07T10:51:16+05:30 IST

రాష్ట్రంలోని అన్ని బోధనాస్పత్రులను కరోనా ఆస్పత్రులుగా మార్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

బోధనాస్పత్రులన్నీ కరోనా సేవకే?

ఆరోగ్యశాఖ అధికారుల సన్నాహాలు

ఇప్పటికే రాష్ట్రంలో 4 కరోనా ఆస్పత్రులు

అదే బాటలో 8 బోధనాస్పత్రులు కూడా!

చిన్నారులు, గర్భిణుల వైద్యానికి ప్రత్యేక ఏర్పాట్లు


అమరావతి, ఏప్రిల్‌ 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అన్ని బోధనాస్పత్రులను కరోనా ఆస్పత్రులుగా మార్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే విశాఖ విమ్స్‌, విజయవాడ జీజీహెచ్‌, తిరుపతి రుయా, నెల్లూరు ప్రభుత్వాస్పత్రిలను కరోనా ఆస్పత్రులుగా మార్చింది. కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో పడకల సంఖ్య పెంచాలని ఆరోగ్యశాఖ ఆలోచన చేస్తోంది. రాష్ట్రంలోని 8 బోధనాస్పత్రులను కూడా కరోనా రోగులకు వైద్యం అందించేందుకు ఉపయోగించాలని అధికారులు నిర్ణయించారు. మొత్తంగా ప్రభుత్వంలోనే 15 వేల పడకలను కరోనా కోసం సిద్ధం చేయనున్నారు.


ఇప్పటి వరకూ 2,500 పడకలు మాత్రమే అందుబాటులో ఉంచారు. కేసులు ఇంకా పెరుగుతాయని ఆరోగ్యశాఖ భావిస్తోంది. ఈ నేపథ్యంలో పడకల సంఖ్య పెంచుకోవడం మంచిదన్న ఆలోచనలో అధికారులు ఉన్నారు. ఇదే సమయంలో సాధారణ రోగుల పరిస్థితి ఏమిటన్న ప్రశ్న తలెత్తుత్తోంది. ఆస్పత్రులన్నీ కరోనా రోగుల కోసం ఉపయోగిస్తే సాధారణ రోగులు తీవ్రంగా ఇబ్బంది పడతారు. కాబట్టి పిల్లలు, గర్భిణులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖ, విజయవాడ, తిరుపతిలో తల్లీపిల్లల ఆస్పత్రులు వేరుగా ఉన్నాయి. మిగిలిన చోట్ల ఒకే క్యాంప్‌సలో జనరల్‌ ఆస్పత్రితో పాటు తల్లీపిల్లల ఆస్పత్రులు ఉన్నాయి. గుంటూరు, కర్నూలు, కాకినాడ వంటి చోట్ల ఒకే క్యాంప్‌సలో ఉన్నా వేరు వేరు బిల్డింగ్‌లలో తల్లీపిల్లల ఆస్పత్రులు ఉన్నాయి. 


బోధనాస్పత్రులన్నింటినీ కరోనా ఆస్పత్రులుగా మారిస్తే తల్లీపిల్లల శస్త్ర చికిత్సలకు ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది. రాష్ట్రంలో విశాఖ, విజయవాడ, తిరుపతి మినహా మిగిలిన చోట్ల ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దీనిపై ఆరోగ్యశాఖ అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూడాలి. సాధారణ రోగులకు చికిత్స చేసే ఆస్పత్రి, తల్లీపిల్లల ఆస్పత్రి రెండింటినీ ఒకే భవనంలో ఏర్పాటు చేస్తే మాత్రం పరిస్థితి దారుణంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో జిల్లాల్లోని ప్రధాన నగరంలో ఉన్న జిల్లా లేదా, ఏరియా ఆసత్రులను తాతాల్కిక తల్లీపిల్లల ఆస్పత్రులుగా మార్చుకుంటే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 


గుండె రోగుల పరిస్థితి ఏమిటి?

అన్ని బోధనాస్పత్రులను కరోనా ఆస్పత్రులుగా మారిస్తే గుండె, ఇతర అత్యవసర రోగుల పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అత్యవసరం అయితే వాళ్లు ఎక్కడికి వెళ్లాలన్న దానిపై ప్రభుత్వానికి స్పష్టత లేదు. గుండె రోగులకు మొదటి గంట సమయంలో అత్యవసర వైద్యం అందకపోతే ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉంటుంది. ఈ నేపథ్యంలో గర్భిణులు, పిల్లల మాదిరిగానే గుండె, ఇతర అత్యవసర రోగులకు వైద్యం అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్న డిమాండ్లు వస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Updated Date - 2020-04-07T10:51:16+05:30 IST