కరోనా విపత్కర పరిస్థితుల్లో..పరిశ్రమలు సామాజిక బాధ్యత చూపాలి

ABN , First Publish Date - 2021-05-10T09:21:51+05:30 IST

కరోనా విపత్కర పరిస్థితుల్లో పరిశ్రమలు మరింత సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని, ప్రజలకు సహాయం అందించాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి కోరారు

కరోనా విపత్కర పరిస్థితుల్లో..పరిశ్రమలు సామాజిక బాధ్యత చూపాలి

పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి


అమరావతి, మే 9 (ఆంధ్రజ్యోతి): కరోనా విపత్కర పరిస్థితుల్లో పరిశ్రమలు మరింత సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని, ప్రజలకు సహాయం అందించాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి కోరారు. కార్పొరేట్‌ కంపెనీలు సామాజిక బాధ్యతగా ముందుకు రావాలని 500 కంపెనీలకు లేఖలు రాశామని, ఇప్పటికే 200 కంపెనీలు ముందుకొచ్చాయని ఆయన తెలిపారు. ఇటీవల నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గానికి డీఆర్‌డీవో చైర్మన్‌ సతీ్‌షరెడ్డి 100కిపైగా ఆక్సిజన్‌ సిలిండర్లు సమకూర్చారని, ఏషియన్‌ పెయింట్స్‌, ఆర్‌వీఆర్‌ ప్రాజెక్ట్స్‌, కాల్గేట్‌ పామోలివ్‌, జిందాల్‌ స్టీల్‌, దాల్మియా సిమెంట్స్‌, రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ తదితర సంస్థలు కొవిడ్‌ తరుణంలో సాయం అందిస్తున్నాయన్నారు. ప్రజలను ఆదుకోవడం కోసం రాష్ట్రంలో ఉన్న కార్పొరేట్‌ కంపెనీలు సీఎ్‌సఐఆర్‌లో భాగంగా వైద్యసేవల్లో పాలుపంచుకోవడానికి ప్రత్యేక ప్రణాళికను ఏపీఈడీబీ సిద్ధ చేసిందన్నారు.


ఆక్సిజన్‌ యూనిట్ల నిర్వహణ, జిల్లాల వారీగా కొవిడ్‌ చికిత్స కోసం అవసరమైన ఆక్సిజన్‌, కాన్సంట్రేటర్లు, వెంటిలేటర్లు, పడకల సంఖ్య వంటి అన్ని వివరాలను ఏపీఈడీబీ సేకరిస్తోందన్నారు. కొన్ని జిల్లాల్లో ఆక్సిజన్‌ యూనిట్లు ఏర్పాటుచేసి వాటి నిర్వహణను కంపెనీలకు అప్పగించే ఆలోచన చేస్తున్నామన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ అనంతపురంలో ఒక ఆక్సిజన్‌ యూనిట్‌ను పెడుతోందన్నారు. ఒడిసాలోని అంగుల్‌లో ఉన్న ఫ్యాక్టరీ నుంచి ఏపీకి ట్యాంకర్‌ ద్వారా రోజూ 24 టన్నుల ఆక్సిజన్‌ సరఫరా చేస్తున్నారన్నారు. విశాఖలోని గురజాడ కళాక్షేత్రంలో 600 పడకల ఆస్పత్రిని కొన్ని పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నాయని, ఇప్పటికే 50 పడకలు సిద్ధం చేశాయన్నారు.

Updated Date - 2021-05-10T09:21:51+05:30 IST