కరోనా వేళలో కార్తీక మాసం

ABN , First Publish Date - 2020-11-23T02:21:58+05:30 IST

శివకేశవుల పూజలతో మిన్నంటే మాసం కార్తీకం. సూర్యోదయ వేళల్లో నదీ, సముద్ర స్నానాలు, ఇళ్లు, ఆలయాలలో దీపాలంకరణలు, పురాణ పఠనం, శ్రవణం. ఒక్కో రోజు ఒక్కో విశిష్టతతో మాసమంతా పండగ వాతావరణమే....

కరోనా వేళలో కార్తీక మాసం

శివకేశవుల పూజలతో మిన్నంటే మాసం కార్తీకం. సూర్యోదయ వేళల్లో నదీ, సముద్ర స్నానాలు, ఇళ్లు, ఆలయాలలో దీపాలంకరణలు, పురాణ పఠనం, శ్రవణం. ఒక్కో రోజు ఒక్కో విశిష్టతతో మాసమంతా పండగ వాతావరణమే. కానీ నేడు కరోనా కారణంగా మునుపటిలా కార్తీకమాసాన్ని ఆచరించలేమా అనే సందిగ్ధత నెలకొంది. భక్తిశ్రద్ధలకు తోడు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే కార్తీకమాసాన్ని విజయవంతంగా పూర్తిచేయవచ్చు.


నదీస్నానం

కార్తీకమాసంలో నదీ స్నాన మహత్యాల గురించి కార్తీకపురాణం విపులంగా పేర్కొంది. ఆషాఢం, కార్తీకం, మాఘం, వైశాఖ మాసాలలో సముద్ర స్నానాలు ఆచరించడం ఆనవాయితీ. అందుకే కార్తీక పౌర్ణమినాడు సముద్ర తీరాలు భక్తులతో పోటెత్తుతాయి.. ఈ కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలోకి సంక్రమించడం వల్ల అన్ని నదులూ గంగాదేవి స్వరూపాలుగా మారతాయని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు ఈ నెల రోజులూ ప్రతి ప్రవాహమూ, ఊట నీరు గంగే. కాబట్టి బావి, తటాకం, కాలువ, నది, సముద్రం... ఇలా ఎందులో స్నానం చేసినా కార్తీక మాస ఫలితం లభిస్తుంది. అయితే నేడు కరోనా కారణంగా నదులు, సముద్ర స్నానాలను వీలైనంత వరకూ దూరంగా ఉండడమే ఆరోగ్యకరం. బోర్‌వెల్‌ , సంపు నీటిలోనూ పరమపావణి గంగాతల్లి ఉందనే నమ్మకంతో పుణ్యస్నానాలు ఆచరించి ఆ పరమేశ్వరుడి ప్రీతిపాత్రాన్ని పొందవచ్చు. ‘‘దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువనతారిణి తరళతరంగే! శంకరమౌళి విహారిని విమలే మమ మతిరాస్తాం తవ పదకమలే!!’’ అని గంగా దేవిని స్మరించుకుంటూ ఇంట్లోనే స్నానాలు ఆచరించడం మంచిది.


వనభోజనాలు

కార్తీక మాసంలో వనభోజనాలకు ఎంతో ప్రశస్తి. ఏడాదికి ఒకసారైనా బంధువులందరూ కలిసి వనభోజనాలకు వెళ్లడం సాధారణమే. వనం లేదా తోటల్లోని ఉసిరిక చెట్టుకు, విష్ణుమూర్తి పటానికి పూజలు చేసి ఇంటి నుండి తెచ్చిన నైవేద్యాలను సమర్పించి అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేస్తారు. కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి చెట్టు నీడన సత్యనారాయణ స్వామి వత్రం ఆచరించే వాళ్లూ లేకపోలేదు. ఉసిరి చెట్టు దామోదరునికి ఎంతో ప్రీతి పాత్రమైన వృక్షం. దామోదరుడి ప్రతిరూపంగా కూడా ఉసిరికి పేరు. లక్ష్మీదేవి ఆవాసమై ఉంటుందట. ఎన్నో ఔషద గుణాల గని ఈ వృక్షం.


షడ్రుచుల్లో చేదు తప్ప మిగిలిన అయిదూ ఇందులో ఉంటాయి. అందుకే కార్తీక మాసంలో ఉసిరి చెట్టు నీడలో భోంచేయమన్నారు. అయితే  నేడు కరోనా కారణంగా పూర్తి జాగ్రత్తలు పాటించవలసిందే. వీలైనంత వరకూ వన భోజనాలను మానుకోవడమే మంచిది. ఒకవేళ వెళ్లినా సామూహికంగా కాకుండా ఒక్కో కుటుంబం విడిగా వెళ్లి తక్కువ సమయంలో వనభోజనాన్ని పూర్తి చేసి వచ్చేయాలి. పూర్తిగా ఇంట్లో చేసిన ఆహారాన్ని భుజించడమే శ్రేయస్కరం. ఇంకా చెప్పాలంటే ఓ ఉసిరి చెట్టు కొమ్మని తీసుకువచ్చి ఇంట్లోనే పూజాదికాలు నిర్వహించి కుటుంబమంతా కలిసి భోంచేయడం మరీ మంచిది. కరోనా జాగ్రత్తలు పాటిస్తూనే వనభోజనాలనూ పూర్తిచేసిన పుణ్యం లభిస్తుంది.


కార్తీక దీపాలు

ఈ మాసంలో ప్రతి రోజూ ఉదయమే స్నానం చేసి ఇంట్లో దీపాలు పెట్టి ఆ తరవాత దగ్గరలోని గుడికి వెళ్లి దీపాలను వెలిగించడం తెలుగింటి ఆడపడుచుల దినచర్య. గుడిలోనే ఏరోజుకారోజు కార్తీక పురాణ పారాయణం చేస్తుంటారు. కార్తీక సోమవారాలప్పుడు ప్రత్యేకంగా జరిగే లక్ష బిల్వార్చనలు, మహారుద్రాభిషేకాల్లో ఇంటిల్లిపాదీ పాల్గొంటారు. కార్తీక పౌర్ణమి నాడు సత్యనారాయణ వ్రతాన్నీ గుడిలోనే ఆచరించేవారు ఎందరో.


సాయంత్రాలు కూడా గుడిలో 360 దీపాలను వెలిగిస్తూ పరమేశ్వరుడి సేవలో నిమగ్నమవుతారు. ఇక ఉపవాస దీక్షలూ, ఏక భుక్తం, సోమవార వ్రతాలు మామూలే. అయితే ఈ ఏడాది మాత్రం గుడికి వెళ్లినా కరోనా ఇంకా ఉందన్న విషయాన్ని మరచిపోకూడదు. తొందరగా దీపాలను వెలిగించి ఇంటికి వచ్చేయడం మంచిది. మిగతా భక్తులతో కాస్త ఎడాన్ని పాటించాలి. మాస్కులను ధరించాలి. రద్దీ తక్కువగా ఉండే వేళల్లోనే గుడికి వెళ్లడం మరీ మంచిది.





Updated Date - 2020-11-23T02:21:58+05:30 IST