Abn logo
Mar 28 2020 @ 03:23AM

ఈ ‘ఆర్థిక కార్యాచరణ’ అసమగ్రం

చైనా, ఇటలీ, స్పెయిన్ మాదిరిగా మన దేశం కరోనా వైరస్ బారిన పడదని చాలా మంది భావిస్తున్నారు. ఇది సరికాదు. ఇతర దేశాల వలే మన దేశమూ కరోనా మహమ్మారితో అన్ని విధాల పెద్ద ఎత్తున నష్టపోవడం ఖాయం. ఇప్పటికే దిగజారిపోతున్న ఆర్థిక వ్యవస్థ మరింతగా దెబ్బ తిననున్నది. దీనికి, కరోనా వైరస్ సామాజికంగా, ఆర్థికంగా సృష్టించే వినాశనం తోడవుతుంది. ప్రభుత్వం తన సంకోచాలను విడనాడి ఈ సంక్షోభవేళ ప్రజలకు సాహసోపేతమైన, నిర్ణయాత్మకమైన నాయకత్వాన్ని సమకూర్చాలి.


కరోనా కష్టాలు ఎప్పటికి తీరేను? ఈ నెల 22న (ఆదివారం) దేశ వ్యాప్తంగా జనతా కర్ఫ్యూ అమలుపరిచారు. దేశ ప్రజలు పూర్తిగా సహకరించారు. జనతా కర్ఫ్యూ ను విధించనున్నట్టు అంతకు రెండురోజుల క్రితం అంటే మార్చి 19న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించినప్పుడు కరోనా నియంత్రణకు చేపట్ట బోయే చర్యలకు ప్రజల ప్రతిస్పందన ఎలా వుంటుందో తెలుసుకోవడానికే ఆ నిర్ణయం తీసుకున్నారని భావించాను. జనతా కర్ఫ్యూ ముగిసిన వెంటనే ఏదో ఒక విధమైన దేశవ్యాప్త లాక్‌డౌన్ ను ప్రధానమంత్రి ప్రకటిస్తారని కూడా నేను ఊహించాను. అయితే ఆ ఆదివారంనాడు అలాంటి ప్రకటన ఏదీ వెలువడలేదు. 


ఇటలీ, స్పెయిన్ ,ఇరాన్ మొదలైన దేశాలలో కరోనా వైరస్ మూలంగా సంభవిస్తున్న పెను విషాద ఘటనల ప్రభావంతో కాబోలు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మార్చి 24న మళ్ళీ టెలివిజన్ లో దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ దేశవ్యాప్త లాక్ డౌన్‌ను ప్రకటించారు. ఈ లాక్ డౌన్, మార్చి 25న 00.00 గంటల నుంచి అమలులోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. మీరు ఈ కాలమ్ చదివే సమయానికి దేశవ్యాప్త లాక్‌డౌన్‌ నాలుగో రోజులోకి ప్రవేశిస్తుంది. గమనార్హమైన విషయమేమిటంటే ఈ దేశవ్యాప్త లాక్‌డౌన్‌కు ఆసేతుహిమాచలంలో ఎక్కడా ఎవరూ సంసిద్ధంగా లేరు; ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం కూడా సంసిద్ధంగా లేదు! కేంద్రం సిద్ధంగా ఉన్నట్టయితే మార్చి 19న ప్రధానమంత్రి ప్రకటించిన ‘ఎకనామిక్ టాస్క్ ఫోర్స్’ ను నియమించివుండేది కాదా? ఇంతవరకూ నియమించకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?


విచారకరమైన విషయమేమిటంటే ఆపత్కర పరిస్థితులకు సంసిద్ధంగా  వుండకపోవడమనేది నరేంద్ర మోదీ ప్రభుత్వ వ్యవహారశైలికి ప్రమాణ చిహ్నమైపోయింది. గత జనవరి 30న తొలి కరోనా పాజిటివ్ కేసు వెలుగులోకి వచ్చింది కదా. మరి విరుచుకు పడనున్న వినాశనాన్ని మోదీ సర్కార్ సరిగ్గా ఎందుకు గ్రహించలేకపోయింది? ఈ క్రింది అంశాలను కూడా మీరు తప్పక పరిగణనలోకి తీసుకోవాలి: 


ఎవరికైనా కరోనా వైరస్ నిజంగా సోకిందా లేదా అనే విషయాన్ని నిర్ధారించేందుకు అవసరమైన పరీక్షల నిర్వహణకు సదుపాయాలు తగినంతగా లేవు. మరింత విస్తృతంగా, మరింత పెద్ద సంఖ్యలో పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనావున్నదని అంటువ్యాధుల శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు ముక్త కంఠంతో ఘోషిస్తున్నారు. వైరస్ సోకినట్టు నిర్థారణ అయిన వ్యక్తులను తక్షణమే వేరుపరచి నిర్బంధ ఏకాంతవాసంలో వుంచి చికిత్స చేయాలి. సదరు వ్యక్తులకు ఆ వైరస్ ఎక్కడ, ఎలా సోకిందో కూడా సమగ్రంగా తెలుసుకోవాలి. ఈ విషయాలలో ప్రభు త్వం విఫలమయినట్టు కన్పిస్తోంది. నేనీ వ్యాసం రాస్తున్న సమయానికి రోజుకు 12,000 మందికి మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నారు ఎంతమందికి కరోనా సోకిందో కచ్చితంగా తెలియరావడం లేదు. 


కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయిన వ్యక్తుల సంఖ్య 724 కి పెరిగిన తరువాత, కొత్త ప్రదేశాల నుంచి కొత్త కరోనా కేసులు నమోదయినట్టు వార్తలు వెలువడుతున్నాయి. అయినప్పటికీ భారత్ ఇంకా రెండో దశ లోనే వున్నట్టు ఐ సి ఎమ్ ఆర్, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటిస్తున్నాయి. కరోనా వైరస్ ప్రజాసమూహాల్లో విస్తృతంగా వ్యాప్తి అవుతుందడానికి రుజువులు లేవని ఐసి ఎమ్ఆర్, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు ఘంటాపథంగా చెబుతున్నాయి. అయితే ఈ నిశ్చిత వైఖరిని పలువురు వైద్య నిపుణులు సంశయిస్తున్నారు. 


భారత్‌కు 7,00,000 పిపిఇ సూట్లు, 60,00,000 ఎన్-95 మాస్కులు, 3 ప్లై మాస్క్‌లు 1,00,00,000 అవసరం. మరి ఎన్ని అందుబాటులో ఉన్నాయో తెలియదు. కొరవడిన వాటిని ప్రభుత్వం ఎప్పుడు సమకూరుస్తుందో, ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో అంతకంటే తెలియదు.


వెంటిలేటర్లు, శ్వాసక్రియా సాధనాలు, శానిటైజర్స్ ఎగుమతిని నిషేధించాలన్న డిమాండ్ చాలా కాలంగా వున్నది. అయితే మార్చి 24న మాత్రమే వాటి ఎగుమతులను నిషేధించడం జరిగింది. 


సరఫరాల పరంపరలు విచ్ఛిన్నమైపోయాయి. కూరగాయల దుకాణాలు, కిరాణా షాపులు మూతపడ్డాయి. సరఫరాలు నిలిచిపోవడం వల్లే వాటిని తెరవడం లేదు. పలు ప్రదేశాలలో షాప్ అసిస్టెంట్ లను దుకాణాలకు వెళ్ళడానికి అనుమతించడం లేదు.


అసంఖ్యాక పేద బాలలు ఆహారం లేక పస్తులుంటున్న విషాద దృశ్యాలు హృదయవిదారకంగా వున్నాయి. ఇంటిలో ఆహారం లేకపోవడం వల్లే ఈ దయనీయ పరిస్థితి ఏర్పడింది. నగరాలు, పట్టణాలలో పనులు దొరక్కపోవడంతో వలసకార్మికులు ఇంటి ముఖం పడుతున్నారు. రాజస్థాన్ , ఉత్తరప్రదేశ్ , బిహార్ లలో హైవేల మీద ఇలా స్వస్థలాలకు వెళుతున్న వలసశ్రామికులు పెద్ద సంఖ్యలో కన్పిస్తున్నారు. ఆ అభాగ్యులను ఆదుకోవడానికి ప్రభుత్వం ఏమి చేస్తుంది?


రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో పనిచేసే పోలీసు విభాగాలకు స్పష్టమైన ఆదేశాలు లేవు. పలు ప్రదేశాలలో వారు డెలివరీ ఏజెంట్లను అడ్డుకుంటున్నారు. నిత్యావసర సరుకులు కొనుగోలు చేసుకోకుండా ప్రజలను నిరోధిస్తున్నారు. రోడ్డు మీదకి వచ్చిన నేరానికి గాను అమాయకులను పోలీసులు చితకబాదుతున్న దృశ్యాలను చూపిస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి. నిరపరాధులకు పోలీసులు అసాధారణ శిక్షలు విధించడంపై ప్రజానీకంలో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.


దేశ వ్యాప్త లాక్ డౌన్ ను ప్రకటించిన సమయంలోనే సహాయక చర్యలనూ ప్రకటించకపోవడం ఒక భయంకరమైన వైఫల్యంగా చెప్పక తప్పదు. లాక్ డౌన్ వల్ల ఇంటి పట్టునే వుండిపోక తప్పనిసరి పరిస్థితులలో నిరుపేదలు, ఇతర దుర్బల వర్గాలకు ఆహారమెలా లభ్యమవుతుంది? ఇతర ఆవశ్యక సేవలు ఎలా అందుబాటులోకి వస్తాయి? కౌలు రైతులు, వ్యవసాయకూలీలు, దినసరి వేతన కార్మికులు, స్వయం ఉపాధితో బతుకుతున్నవారు, సూక్ష్మ, చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమల యజమానులు, వీధి బతుకులు బతుకుతున్న నిర్భాగ్యులను ఆదుకోవడానికి ప్రభుత్వం ఏమి చేస్తోంది? ఏమి చేయనున్నది? ఉద్యోగులకు జీతాలు చెల్లించాల్సిన యజమానులు, పన్ను చెల్లింపుదారులు మొదలైన వారికి ప్రభుత్వం ఎలా సహాయపడన్నుది? లాక్ డౌన్ ప్రకటనలో ఇవేవీ స్పష్టంగా లేవు.


ఈ అంశాలపై పలు సూచనలు ప్రభుత్వం ముందున్నాయి. అయితే వాటిపైమార్చి 26 వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోనేలేదు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఆర్థిక కార్యాచరణ పథకం (ఫైనాన్షియల్ యాక్షన్ ప్లాన్ -–ఎఫ్ ఏ పి) అసమగ్రంగా వున్నది. పిరికితనాన్ని ప్రతి బింబిస్తున్న పథకమది. కరోనా లాంటి విపత్కర సమయంలో ప్రజలను ఆదుకునేందుకు ఉద్దేశించిన పథకాలు సమగ్రంగా వుండొద్దూ? అరకొరచర్యలు సంక్షోభ బాధితులకు ఎలా ఊరటనిస్తాయి? పేద ప్రజలకు ఆహారం సమకూర్చడానికి ఎఫ్ఏపి హామీపడింది. అయితే ఆహారాన్ని సమకూర్చుకోవడానికి అవసరమైన నగదును తగినంతగా పేదలకు అందించదు! కరోనా సంక్షోభ బాధితులు ఎంతమంది? ఈ పథకం వల్ల నిజంగా లబ్ధి పొందే వారు ఎంతమంది? ఈ గీటురాయితో ఈ పథకాన్ని పరిశీలిస్తే అసంతృప్తే మిగులుతుంది.


ఎఫ్ఏపి అమలుకు ప్రభుత్వం రూ.1.70 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అయితే నా అంచనా ప్రకారం ఈ మొత్తానికి అదనంగా రూ.60,000 కోట్లు లబ్ధిదారులకు బదిలీ చేయవలసి వుంటుంది. ఇది భారీ వ్యయం, అయితే తప్పనిసరి. అయినా సంక్షోభ బాధితులను ఆదుకోవడానికి ఇది సరిపోదు. ఈ వాస్తవాన్ని మనం గుర్తించాలి. ఎఫ్ఏపి రెండో భాగాన్ని ప్రభుత్వం వెన్వెంటనే ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా వున్నది. 


చైనా, ఇటలీ, స్పెయిన్ దేశాల మాదిరిగా మన దేశం కరోనా వైరస్ బారిన పడదని చాలా మంది భావిస్తున్నారు. ఇది సరికాదు. కరోనా మహమ్మారి పెద్ద ఎత్తున ప్రబలడానికి ఆస్కారంలేని అసాధారణ పరిస్థితులేవీ భారత్‌లో లేవు. ఇతర దేశాల వలే మన దేశమూ అన్ని విధాల పెద్ద ఎత్తున నష్టపోవడం ఖాయం. మనం ప్రస్తుతం ప్రజల ప్రాణాలు, ఆరోగ్యం, జీవనాధారాల పరిరక్షణ గురించే పట్టించుకుంటున్నాము. ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగాలు, ఆదాయాల విషయమేమిటి? ఇప్పటికే దిగజారిపోతున్న ఆర్థిక వ్యవస్థ మరింతగా దెబ్బ తిననున్నది. దీనికి, కరోనా వైరస్ సామాజికంగా, ఆర్థికంగా సృష్టించే వినాశనం తోడవుతుంది. ప్రభుత్వం తన సంకోచాలను విడనాడి ఈ సంక్షోభ వేళ ప్రజలకు సాహసోపేతమైన, నిర్ణయాత్మకమైన నాయకత్వాన్ని సమకూర్చాలి.(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Advertisement
Advertisement
Advertisement