మహమ్మారిని జయించిన ‘అమ్మ’.. బిడ్డకు జన్మనిచ్చిన కొవిడ్‌ బాధితురాలు

ABN , First Publish Date - 2020-08-03T16:56:29+05:30 IST

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కొవిడ్‌ మహమ్మారి అమ్మతనం ముందు ఓడిపోయింది. పురిటినొప్పులను తృణప్రాంగా భరించిన తల్లి సాహసం ముందు చిన్నబోయింది. ములుగు ఏరియా వైద్యశాలలో

మహమ్మారిని జయించిన ‘అమ్మ’.. బిడ్డకు జన్మనిచ్చిన కొవిడ్‌ బాధితురాలు

ములుగులో అరుదైన ఘటన


ములుగు(వరంగల్): ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కొవిడ్‌ మహమ్మారి అమ్మతనం ముందు ఓడిపోయింది. పురిటినొప్పులను తృణప్రాంగా భరించిన తల్లి సాహసం ముందు చిన్నబోయింది. ములుగు ఏరియా వైద్యశాలలో ఓ కొవిడ్‌ బాధితురాలు వైరస్‌ను జయిస్తూ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ములుగు జిల్లా వెంకటాపూర్‌(రామప్ప) మండలం లక్ష్మీదేవిపేటకు చెందిన ఓ గర్భిణి రెండో కాన్పునకు ములుగు ఏరియా వైద్యశాలకు వచ్చింది. సుఖప్రసవం చేసేందుకు వైద్యులు ఆమెను అబ్జర్వేషన్‌లో పెట్టారు. ఈక్రమంలో ఆమెకు రక్తపరీక్షలతోపాటు కొవిడ్‌ పరీక్షలు చేశారు. అయితే ఆమెకు కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి 7గంటల ప్రాంతంలో ఆమెకు పురిటినొప్పులు మొదలయ్యాయి. 


ఇదే సమయంలో గైనకాలజిస్టు రామతులసి మరో గర్భిణికి కాన్పు చేస్తుండగా.. ఈమె ప్రసవ వేదనతో అల్లాడిపోతోంది. పరిస్థితి విషమిస్తుండటంతో డ్యూటీలో ఉన్న మత్తు వైద్యుడు నారాయణరెడ్డి ఆమెను ఆపరేషన్‌ థియేటర్‌కు తీసుకెళ్లి సుఖప్రసవం చేసి ఆడబిడ్డకు పురుడుపోశారు. విషయం తెలుసుకున్న డీఎంహెచ్‌వో డాక్టర్‌ అల్లెం అప్పయ్య ఆస్పత్రికి వచ్చి తల్లీబిడ్డలను పరీక్షించారు. ఇద్దరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు.  తల్లి నుంచి బిడ్డకు వైరస్‌ సోకే అవకాశాలు లేవని, ప్రస్తుతం శిశువు తల్లి పొత్తిళ్లలోనే ఉంచుతామని చెప్పారు. కరోనా పాజిటివ్‌ అని తెలిసినా సుఖప్రసవం చేసి తల్లీబిడ్డల ప్రాణం నిలిపిన వైద్యులను స్థానికులు అభినందించారు.

Updated Date - 2020-08-03T16:56:29+05:30 IST