చేయి చూసి జాతకాలు చెప్పే వ్యక్తికి కరోనా పాజిటివ్‌ రావడంతో..

ABN , First Publish Date - 2020-05-19T18:03:06+05:30 IST

ఆయన చేయి చూసి జాతకాలు చెబుతుంటాడు. ఇందుకోసం పలు రాష్ట్రాలు తిరుగుతుంటాడు. ఈ క్రమంలోనే మహారాష్ట్రలోని పుణె నగరానికి వెళ్లిన ఆయన కరోనా బారిన పడ్డాడు. లాక్‌డౌన్‌ సడలింపులతో ఇటీవల తన స్వగ్రామమైన మధిర మండలంలోని మహదేవపురానికి వచ్చిన అతడికి కరోనా పాజిటివ్‌ రావడంతో హైదరాబాద్‌కు తరలించారు

చేయి చూసి జాతకాలు చెప్పే వ్యక్తికి కరోనా పాజిటివ్‌ రావడంతో..

వృత్తిలో భాగంగా పుణె వెళ్లి.. ఇటీవల స్వగ్రామానికి రాక

హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రికి తరలింపు

కుటుంబసభ్యులు, కాంటాక్టు ఉన్న వారు క్వారంటైన్‌కు 

మధిర మండలం మహదేవపురంలో కలకలం

అధికార యంత్రాంగం ‘కట్టడి’లో గ్రామం


మధిర/మధిర రూరల్(ఆంధ్రజ్యోతి): ఆయన చేయి చూసి జాతకాలు చెబుతుంటాడు. ఇందుకోసం పలు రాష్ట్రాలు తిరుగుతుంటాడు. ఈ క్రమంలోనే మహారాష్ట్రలోని పుణె నగరానికి వెళ్లిన ఆయన కరోనా బారిన పడ్డాడు. లాక్‌డౌన్‌ సడలింపులతో ఇటీవల తన స్వగ్రామమైన మధిర మండలంలోని మహదేవపురానికి వచ్చిన అతడికి కరోనా పాజిటివ్‌ రావడంతో హైదరాబాద్‌కు తరలించారు. వివరాలిలా ఉన్నాయి. మహదేవపురానికి చెందిన పలు కుటుంబాలు జాతకాలు చెబుతూ జీవిస్తుంటాయి. ఈ క్రమంలోనే మహదేవపురం నుంని పుణె, ముంబై, నాసిక్‌ ప్రాంతాలకు వెళ్లిన వారిలో ఈనెల 13వతేదీన 17మంది, 14న 19మంది, 15న ముగ్గురు తిరిగివచ్చారు. వీరిలో పుణె నుంచి వచ్చిన 19 మందిలో ఏడుగురి నుంచి శాంపిళ్లు సేకరించి కరోనా ర్యాండమ్‌ టెస్టుకు పంపగా ఆరుగురికి నెగిటివ్‌ వచ్చింది. ఒక్కరికి మాత్రం పాజిటివ్‌ రావడంతో అతడిని హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి కుటుంబంలోని 14మందితోపాటు పుణె నుంచి వచ్చిన మిగిలిన వారిని, వారితో కాంటాక్టు ఉన్న మరో 25మందిని ఖమ్మంలోని ఐసోలేషన్‌ వార్డుకు తరలిస్తున్నట్టు పీహెచ్‌సీ వైద్యాధికారి నాగరాజు తెలిపారు.


అయితే సదరు వ్యక్తి జాతకాలు చెప్పి జీవనం సాగిస్తుంటాడని, ఈ క్రమంలో తరుచూ పలు రాష్ట్రాలకు వెళతాడని అధికారులు తెలిపారు. ఆయనతో పాటు ఈ గ్రామంలోని పలువురు జాతకాలు చెప్పడాన్ని కులవృత్తిగా చేసుకుని ఇతర ప్రాంతాల్లో సంచరిస్తుం టారని వివరించారు. వృత్తిలో భాగంగా మహారాష్ట్ర లోని పుణకు వెళ్లి తిరిగి వచ్చిన అతడికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యిందని ఖమ్మం జిల్లా వైద్య శాఖ అధికారులు సోమవారం ప్రకటించారు. అయితే మహదేవపురం వ్యక్తికి కరోనా పాజిటివ్‌ రావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఖమ్మం అదనపు కలెక్టర్‌ ఎం.స్నేహలత, డీఎంహెచ్‌వో డాక్టర్‌ మాలతి, జిల్లా సర్వేలైన్స్‌ అధికారి కోటిరత్నం, డీఎంవో సైదులుతోపాటు మండల అధికారులంతా గ్రామంలో పర్యటించారు. ప్రజలకు పలు సూచనలు చేశారు. అంతా అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వైద్యసిబ్బంది, పంచాయతీ సిబ్బంది గ్రామంలో పారిశుధ్య చర్యలపై దృష్టిసారిం చారు. హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. కొత్త వారిని గ్రామంలోకి రాకుండా, గ్రామంలోని వారిని బయటకు పోనీయకుండా సరిహద్దులను మూసివేయించారు. వైద్య సిబ్బంది పది బృందాలుగా ఏర్పడి గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. మధిర సీఐ వేణుమాధవ్‌, ఎస్‌ఐ ఉదయ్‌కుమార్‌, తహసీల్దార్‌ సైదులు, వైద్యాధి కారులు నాగరాజు, శ్రీనివాస్‌, ఇన్‌చార్జి ఎంపీడీవో శంకర్‌, ఎంపీవో రాజారావుతోపాటు ఆయాశాఖల సిబ్బంది గ్రామంలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

Updated Date - 2020-05-19T18:03:06+05:30 IST