సీఎస్‌ సోమేశ్‌కు కరోనా పాజిటివ్‌

ABN , First Publish Date - 2021-04-07T08:50:22+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈ విషయాన్ని మంగళవారం ఆయన స్వయంగా ప్రకటించారు.

సీఎస్‌ సోమేశ్‌కు కరోనా పాజిటివ్‌

  • సోమవారం సీఎంతో భేటీ.. కలవరం
  • కొత్తగా 1498 కేసులు.. ఆరుగురి మృతి
  • మంగళవారం వైరస్‌ నిర్ధారణ..
  • సీఎంవో, అధికార వర్గాల్లో కలవరం
  • రాష్ట్రంలో కొత్తగా 1,498 కేసులు
  • గాంధీలో మరో 11 మంది మృతి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈ విషయాన్ని మంగళవారం ఆయన స్వయంగా ప్రకటించారు. సోమేశ్‌ కుమార్‌ సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ప్రగతి భవన్‌లో భేటీ అయినట్లు తెలిసింది. అధికారిక కార్యక్రమాల రీత్యా తరచూ ప్రగతి భవన్‌కు వెళ్లి రావడం, బీఆర్కే భవన్‌లో నిత్యం వివిధ శాఖల అధికారులతో సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో సీఎ్‌సకు కరోనా సోకడంతో అధికారులు, ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాల్లో ఒకింత ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే సీఎ్‌సతో కాంటాక్టు అయిన కొంత మంది అధికారులు పరీక్షలు చేయించుకున్నట్లు సమాచారం. కాగా, సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తూ సీఎస్‌ నిత్యం బిజీగా ఉంటారు. మంగళవారం నిస్సత్తువగా, నలతగా ఉండడంతో కరోనా పరీక్ష చేయించుకున్నారు. పాజిటివ్‌ అని తేలింది. ఇటీవల తనను కలిసినవారిలో ఎవరికైనా లక్షణాలు ఉన్నట్లైతే తక్షణమే పరీక్ష చేయించుకోవాలని సీఎస్‌ సూచించారు. కాగా... బీఆర్కే భవన్‌ చీఫ్‌ సెక్యూరిటీ అధికారికి కూడా కరోనా సోకింది. నాలుగు రోజుల క్రితమే సోమేశ్‌కుమార్‌ కరోనా టీకా తొలి డోసు తీసుకున్నారు. మరోవైపు కరోనా కట్టడిపై మంగళవారం సోమేశ్‌కుమార్‌ ఇంటి వద్ద నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 


జిల్లాల్లో రోజుల్లోనే కేసులు రెట్టింపు

కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా లింగాపూర్‌ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో మంగళవారం 68 మందికి పరీక్షలు చేయగా 39 మందికి పాజిటివ్‌ వచ్చింది. పలువురికి జ్వరాలు ఉండటంతో.. పరీక్షలు చేస్తే ఇంకా బాధితులు పెరిగే అవకాశం కనిపిస్తోంది. మిర్చి కోసేందుకు మహారాష్ట్ర నుంచి ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం నూకాలంపాడుకు వచ్చిన నలుగురు వలస కూలీలకు వైరస్‌ సోకింది. మరోవైపు చాలా జిల్లాల్లో రోజుల వ్యవధిలోనే కేసులు రెట్టింపు అవుతున్నాయి. నిన్నమొన్నటి వరకు 50లోపు పాజిటివ్‌లు రాగా.. ఇప్పుడా సంఖ్య 100 దాటుతోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాల్లో మంగళవారం 252మందికి పాజిటివ్‌ అని తేలింది. నిజామాబాద్‌ జిల్లాల్లో ఇప్పటికే పాజిటివ్‌ రేటు 20 ఉందని వైద్య వర్గాలు వెల్లడించాయి. ఆ జిల్లాలో సోమవారం హెల్త్‌ బులెటిన్‌ ప్రకారం 142 కేసులు వచ్చాయి. ప్రస్తుతం రాష్ట్రంలో పాజిటివ్‌ రేటు 2.40కు పెరిగింది. నెల క్రితం 0.41 మాత్రమే ఉంది. మరోవైపు రాష్ట్రంలో కొత్తగా 1,498 కేసులు నమోదయ్యాయి. గతేడాది నవంబరు 7న 1,607 కేసులు వచ్చాయి. ఆ తర్వాత ఇదే అత్యధికం. వైర్‌సతో మరో ఆరుగురు చనిపోయారు. వైద్య శాఖ లెక్కల ప్రకారం 5 రోజుల్లో 28 మంది మృత్యువాత పడ్డారు.ఈ గణాంకాలతో మొత్తం కేసుల సంఖ్య 3,14,735కు, మరణాలు 1,729కు పెరిగాయి. 9,993 యాక్టివ్‌ కేసులున్నాయి. మరో 245 మంది డిశ్చార్జి అయ్యారు. దీంతో రికవరీల సంఖ్య 3,03,013కు పెరిగింది. కొత్త కేసుల్లో జీహెచ్‌ఎంసీలో 313, మేడ్చల్‌లో 164, నిజామాబాద్‌లో 142, రంగారెడ్డిలో 128 వచ్చాయి. సోమవారం 66,862 మంది తొలి డోసు, 5,187 మంది రెండో డోసు తీసుకున్నారు.


గాంధీలో 80కి చేరిన మరణాలు

గాంధీ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న పలు జిల్లాలకు చెందిన 11 మంది కరోనా రోగులు చనిపోయారు. సోమవారం రాత్రి 10 నుంచి మంగళవారం రాత్రి 10 గంటల మధ్య ఈ మరణాలు సంభవించాయి. దీంతో నాలుగు రోజుల్లో ఆస్పత్రిలో చనిపోయినవారి సంఖ్య 80కి పెరిగింది. గాంధీలో కరోనాతో ఈ నెల 1న 17, 2న 8, 3న 15, 4న 17, 5న 12, 6న 11 మంది చనిపోయారు.


ఏపీలో కొత్తగా 1,941 మందికి పాజిటివ్‌

సెకండ్‌ వేవ్‌లో కరోనా వైరస్‌ కలవరపెడుతోంది. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో కేసులు ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 31,657 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 1,941 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వాటిలో ఒక్క గుంటూరు జిల్లాలోనే 424 మంది వైరస్‌ బారినపడ్డారు.


ఉత్సవాలు వద్దు: మునిసిపల్‌ శాఖ

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఉత్సవాలు, వేడుకలు వద్దని.. ఈ విషయంలో ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేయాల్సిందేనని కమిషనర్లను ఆ శాఖ సంచాలకులు డాక్టర్‌ సత్యనారాయణ ఆదేశించారు. ఏప్రిల్‌ నెలాఖరు వరకు ఎలాంటి ఉత్సవాలూ, వేడుకలూ నిర్వహించరాదని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ నెలలో వచ్చే ఉగాది, శ్రీరామనవమి, రంజాన్‌ పండుగల సందర్భంగా ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించరాదని ఆయన స్పష్టం చేశారు.

Updated Date - 2021-04-07T08:50:22+05:30 IST