ఖమ్మంలో ఇద్దరు వైద్యులకు కరోనా..? హైదరాబాద్‌లో వైద్యసేవలు

ABN , First Publish Date - 2020-06-30T22:29:12+05:30 IST

ఖమ్మం జిల్లా కేంద్రంలో ఇద్దరు వైద్యులకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్టు తెలియడం జిల్లాలోని ప్రైవేట్‌ డాక్టర్లలో, ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది

ఖమ్మంలో ఇద్దరు వైద్యులకు కరోనా..? హైదరాబాద్‌లో  వైద్యసేవలు

హైదరాబాద్‌ ప్రైవేట్‌ ఆసుపత్రిలో  వైద్యసేవలు

నిర్ధారించని జిల్లా వైద్యశాఖ


ఖమ్మం సంక్షేమ విభాగం(ఆంధ్రజ్యోతి) : ఖమ్మం జిల్లా కేంద్రంలో ఇద్దరు వైద్యులకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్టు తెలియడం జిల్లాలోని ప్రైవేట్‌ డాక్టర్లలో, ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో ప్రైవేట్‌ ఆసుపత్రులకు పొంచిఉన్న కరోనా ముప్పును బయటపెట్టింది. మూడు రోజుల క్రితం కరోనా లక్షణాలతో హైదరాబాద్‌ ప్రైవేట్‌ ఆసుపత్రికి వెళ్లిన ఓ మహిళా డాక్టర్‌కు అక్కడ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ వచ్చిందని, మరో డాక్టర్‌ అయిన ఆమె భర్తకి కూడా లక్షణాలున్నట్టు నిర్ధారణ అయినట్టు సమాచారం. జిల్లా ప్రధాన ఆసుపత్రిలో పనిచేస్తున్న ఓ మహిళా డాక్టర్‌కు వారం రోజులుగా దగ్గు, జలుబు లక్షణాలు ఉండటంతో ఆమెను ఖమ్మంలోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ కరోనా పరీక్షలు చేయగా ఆమెకు పాజిటివ్‌ రిపోర్టు వచ్చినట్టు జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారులకు సమాచారం అందినట్టు తెలుస్తొంది. ఇదే క్రమంలో సదరు మహిళా డాక్టర్‌ భర్త, ఖమ్మంలో ప్రముఖ డాక్టర్‌ కాగా.. ఆయనకు కూడా పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్‌ వచ్చినట్టు తెలుస్తోంది. అయితే జిల్లా వైద్యశాఖ అధికారులు మాత్రం నిర్ధారించడం లేదు. 


ప్రభుత్వ ఉపాధ్యాయుడి మృతి

వైరాకు చెందిన ఓ ప్రభుత్వ టీచర్‌ (56) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో కరోనాకు చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతిచెందారు. కొన్నేళ్లుగా కిడ్నీ, మధుమేహ సమస్యలతో బాధపడుతున్న ఆయన చికిత్స కోసం హైదరాబాద్‌ వెళ్లగా కొవిడ్‌ బారిన పడ్డారు. 25న ఆయనకు కరోనా పాజిటివ్‌ రిపోర్టు రాగా.. అక్కడే ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఓ కుమారుడు ఉన్నారు. 

Updated Date - 2020-06-30T22:29:12+05:30 IST