‘హుజూరాబాద్‌’తో కరోనా ముప్పు

ABN , First Publish Date - 2021-07-13T08:51:52+05:30 IST

ఉప ఎన్నిక నేపథ్యంలో రాజకీయ కార్యక్రమాలు ముమ్మరం కావడంతో కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో కరోనా కేసులు పెరుగుతున్నాయి.

‘హుజూరాబాద్‌’తో కరోనా ముప్పు

కరీంనగర్‌ జిల్లా కేసుల్లో 34 శాతం అక్కడే..

జిల్లా కేంద్రం కంటే అధికంగా పాజిటివ్‌లు

ఆరోగ్య శాఖ అధికారుల సమీక్ష


హైదరాబాద్‌/జగిత్యాల/కరీంనగర్‌, జూలై 12(ఆంధ్రజ్యోతి): ఉప ఎన్నిక నేపథ్యంలో రాజకీయ కార్యక్రమాలు ముమ్మరం కావడంతో కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. సమావేశాల నిర్వహణలో కొవిడ్‌ నిబంధనలను పట్టించుకోకపోవడం వైరస్‌ వ్యాప్తికి ఊతమిస్తోంది. జూలై నెల 12 రోజుల్లో జిల్లాలోని పీహెచ్‌సీలు, అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో నిర్వహించిన యాంటీజెన్‌ టెస్టుల్లో 1,095 కేసులు రాగా.. అందులో 374 కేసులు (34 శాతం) హుజూరాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని మండలాల్లోనే నమోదయ్యాయి. హుజూరాబాద్‌ మండలంలో 246 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. జమ్మికుంట (59), వీణవంక (52)ల్లో కేసులు భారీగా ఉన్నాయి. 


మూడున్నర లక్షల జనాభా ఉన్న కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో ఈ నెలలో నమోదైనవి 229 కేసులే. కాగా, రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌ గడల శ్రీనివా్‌సరావు, వైద్య విద్య డైరెక్టర్‌ రమేశ్‌రెడ్డి, సీఎం ఓఎ్‌సడీ గంగాధర్‌ సోమవారం హుజూరాబాద్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. కేసులు పెరగకుండా చర్యలు తీసుకోవాలని  సూచించారు. కాగా, ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డికి పాజిటివ్‌ వచ్చింది.


హైదరాబాద్‌ను మించి ఖమ్మంలో..

రాష్ట్రంలో సోమవారం 1,05,797 మందికి పరీక్షలు చేయగా 696 మందికి కరోనా నిర్ధారణ అయుంది. మరో ఆరుగురు చనిపోయారు. జీహెచ్‌ఎంసీ (68) కంటే ఖమ్మం (82) కొత్త కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఐదు రోజుల్లో ఖమ్మంలో ఇవే అత్యధికం. హైదరాబాద్‌ను మించి ఒక జిల్లాల్లో ఎక్కువ కేసులు రావడం నాలుగు నెలల్లో మొదటిసారి.


ఏపీలో 22 మంది మృతి

ఏపీలో కొత్తగా 1,578 కేసులు నమోదయ్యాయి. 22 మంది చనిపోయారు. ఈ రాష్ట్రంలో మొత్తం కేసులు 19,24,421కు చేర గా.. మరణాలు 13,024కి పెరిగాయి.


వైర్‌సను జయించిన వందేళ్ల బామ్మ

పూల వర్షంతో కుటుంబం స్వాగతం

తల్లాడ: ఖమ్మం జిల్లా తల్లాడకు చెందిన వందేళ్ల వృద్ధురాలు దారా సుబ్బమ్మ కరోనాను జయించారు. జూన్‌ 26న సుబ్బమ్మకు పాజిటివ్‌ రాగా.. హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చేర్పించారు. ఆదివారం డిశ్చార్జయ్యారు. ఇంటి ని పూలు, బెలూన్లతో అలంకరించి కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు. కుమారుడు విష్ణుమోహన్‌రావు, కోడలు రాజ్యలక్ష్మి పుష్పాభిషేకం చేశారు. సుబ్బమ్మకు సినీ కవి సుద్దాల అశోక్‌తేజ ఫోన్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - 2021-07-13T08:51:52+05:30 IST