విజయవంతంగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌

ABN , First Publish Date - 2021-01-17T04:53:15+05:30 IST

విజయవంతంగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌

విజయవంతంగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌
టీకా వేయించుకుంటున్న వైద్య సిబ్బందితో మాట్లాడుతున్న కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య

  ఉత్సాహంగా ముందుకు వచ్చిన వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది


  టీకా వేయించుకున్న జిల్లా వైద్యాధికారి అప్పయ్య


  ప్రారంభించిన జడ్పీ చైర్మన్‌ జగదీశ్‌


ములుగు, జనవరి 16 : జిల్లాలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ శనివారం తొలి రోజు విజయవంతమైంది. టీకా తీసుకున్న 40 మందికి ఎలాంటి దుష్ప్రభావాలు లేకపోవడంతో సర్వత్రా హర్షం వ్యక్తమైంది. ములుగు ఏరియా ఆస్పత్రితో పాటు ఏటూరునాగారం సామాజిక వైద్యశాలలో కోవి షీల్డ్‌ టీకా పంపిణీని జడ్పీ చైర్మన్‌ కుమస జగదీష్‌ ప్రారంభించారు. తొలిరోజు టీకా వేసేందుకు జిల్లాలో 60 మంది వైద్య ఆరోగ్య సిబ్బందిని ఎంపిక చేయగా 40 మంది టీకా వేయించుకున్నారు. జిల్లాలో తొలి టీకాను ములుగు ఆస్పత్రిలో పనిచేస్తున్న పారిశుధ్య కార్శికుడు కుమారస్వామికి వేయగా, రెండో టీకా జిల్లా వైద్యాధికారి అప్పయ్య వేయించుకున్నారు. ఏరియాస్పత్రిలో వ్యాక్సినేషన్‌ను కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య పరిశీలించి, టీకాలు వేయించుకున్న వారితో మాట్లాడారు. అదనపు కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి, ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి యాదవ్‌, ఆర్డీవో రమాదేవి, సర్పంచ్‌ బండారి నిర్మల, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ జగదీష్‌, జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి శ్యాం సుందర్‌ పాల్గొన్నారు. 

ఏటూరునాగారం సీహెచ్‌సీలో 20 మందికి..


ఏటూరునాగారం రూరల్‌ : మండలకేంద్రంలోని సామాజిక వైద్యశాలలో కరోనా నివారణ వ్యాక్సినేషన్‌ను ములుగు జడ్పీ చైర్మన్‌ కుసుమ జగదీష్‌, ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారి హనుమంత్‌ కె.జెండగే ప్రారంభించారు. సామాజిక ఆస్పత్రి ల్యాబ్‌ టెక్నీషియన్‌ మార్క భాస్కర్‌కు తొలి టీకా వేశారు. మొత్తం 20 మంది వైద్య సిబ్బంది టీకా వేయించుకోగా వారిని 30 నిమిషాల పాటు పర్యవేక్షణలో ఉంచారు. ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించలేదని వైద్యాధికారులు తెలిపారు. 

ధైర్యంగా ముందుకు రావాలి : జడ్పీ చైర్మన్‌


కరోనా వ్యాక్సిన్‌ పట్ల ప్రజలు అపోహలు వీడి టీకా వేయించుకునేందుకు ముందుకు రావాలని ములుగు జడ్పీ చైర్మన్‌ కుసుమ జగదీష్‌ కోరారు. శనివారం సామాజిక ఆస్పత్రిలో వ్యాక్సినేషన్‌ ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్రమోదీ, సీఎం కేసీఆర్‌ సంకల్ప బలంతోనే కరోనా వ్యాక్సిన్‌ రూపొందిందన్నారు. మొదటి దశలో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు కృషి చేసిన వారికి టీకాను అందించడం గర్వకారణమన్నారు. దశలవారీగా ప్రతీ ఒక్కరికి టీకాను వేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందన్నారు. ఐటీడీఏ పీవో హనుమంతు కె. జెండగే మాట్లాడుతూ కరోనా కట్టడికి వైద్యాధికారులు, సిబ్బంది అందించిన సేవలు వెలకట్టలేనివన్నారు. టీకా వేయించుకున్న వారికి ఇబ్బందులు ఎదురైతే వెంటనే వైద్యాధికారులకు సమాచారం ఇవ్వాలని పీవో సూచించారు. ఎంపీపీ అంతటి విజయ, జడ్పీ కో ఆప్షన్‌ సభ్యురాలు ఎమ్డీ వలీయాబీ, సర్పంచ్‌ ఈసం రామ్మూర్తి,  ఆస్పత్రి సూపరింటెండెంట్‌ సురేష్‌ కుమార్‌ పాల్గొన్నారు.




Updated Date - 2021-01-17T04:53:15+05:30 IST