వరల్డ్‌ మిలిటరీ గేమ్స్‌లో ఏం జరిగింది?

ABN , First Publish Date - 2020-05-19T09:17:42+05:30 IST

కరోనా వైర్‌సకు పుట్టినిల్లు చైనా అనేది జగమెరిగిన సత్యం. అయితే, ఈ తొలి కేసు ఎప్పుడు నమోదైందనేది కచ్చితంగా బయటపడలేదు. గతేడాది డిసెంబరులో ...

వరల్డ్‌ మిలిటరీ గేమ్స్‌లో ఏం జరిగింది?

అక్టోబరులోనే కరోనా

మభ్యపెట్టిన చైనా!

నివ్వెరపరుస్తున్న అథ్లెట్ల మాటలు


న్యూఢిల్లీ: కరోనా వైర్‌సకు పుట్టినిల్లు చైనా అనేది జగమెరిగిన సత్యం. అయితే, ఈ తొలి కేసు ఎప్పుడు నమోదైందనేది కచ్చితంగా బయటపడలేదు. గతేడాది డిసెంబరులో కరోనా వైరస్‌ కేసు వెలుగు చూసిందని చైనా ఇప్పటిదాకా చెప్పుకొచ్చింది. కానీ, అక్టోబరు కన్నా ముందే అక్కడ కొవిడ్‌-19 కేసులు నమోదైనట్టు క్రీడాకారులు బయటపెట్టడం సంచలనం సృష్టిస్తోంది. వైరస్‌ జన్మస్థానం వుహాన్‌లో 2019, అక్టోబరులో వరల్డ్‌ మిలిటరీ క్రీడలు నిర్వహించారు. ఇందులో 100 దేశాలకు చెందిన 10 వేల మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అయితే, వీరిలో చాలామంది అస్వస్థతకు గురికావడం, కొందరు కరోనా పాజిటివ్‌గా తేలడం నివ్వెరపరుస్తోంది. ఫ్రెంచ్‌ పెంటాథ్లెట్‌ ఎలోడి క్లౌవెట్‌, ఆమె భాగస్వామి వాలంటీన్‌ బిలౌడ్‌ మిలటరీ గేమ్స్‌ సందర్భంగానే కరోనా బారినపడ్డారు. తన అపార్ట్‌మెంట్‌లో ఉన్న అందరూ అనారోగ్యానికి గురయ్యారని ఇటలీ ఫెన్సర్‌ తగ్లియారియోల్‌ విస్తుపోయే విషయాలు చెప్పాడు. వ్యాధి లక్షణాలు కరోనాను పోలి ఉన్నట్టు తెలిపాడు. తన కారణంగా కొడుకు, గాళ్‌ఫ్రెండ్‌కు కూడా వైరస్‌ సోకినట్టు అతను చెప్పాడు. 


అప్పుడే వీధులు నిర్మానుష్యంగా..

అక్టోబరులోనే తనకు, తన సహోద్యోగికి కరోనా సోకిందని మిలిటరీ గేమ్స్‌లో పోటీపడ్డ జర్మన్‌ వాలీబాల్‌ ప్లేయర్‌ జాక్వెలీన్‌ బాక్‌ బయటపెట్టింది. ‘కొన్ని రోజుల తర్వాత కొందరు అథ్లెట్లు అనారోగ్యం బారినపడ్డారు. నాకు కూడా వైరస్‌ సోకింది. నేను తిరిగి వచ్చిన తర్వాత నాన్న జబ్బుపడ్డారు. ఇప్పుడు అనిపిస్తుంది అవి కరోనా లక్షణాల’ని జాక్వెలిన్‌ చెప్పింది. ఫ్లూ లాంటి లక్షణాలతో తాను కూడా ఇబ్బందిపడ్డానని లక్సెంబర్గ్‌ ట్రయాథ్లెట్‌ ఆలివర్‌ జార్జెస్‌ చెప్పాడు. తనకు కరోనా సోకిందో? లేదో? తెలుసుకోవడానికి యాంటీబాడీ టెస్ట్‌ చేయించుకుంటానన్నాడు. డిసెంబరులో తొలి కరోనా కేసును  చైనా ధ్రువీకరించింది. కానీ, అంతకుముందే వుహాన్‌ వీధులు నిర్మానుష్యంగా మారడం తాను గమనించానని జార్జెస్‌ తెలిపాడు. స్థానికులు ఎవరూ బయట తిరగొద్దని అక్కడి ప్రభుత్వం ఆదేశించినట్టు వదంతులు కూడా వినిపించాయన్నాడు. జనవరిలో వైరస్‌ వ్యాప్తి మొదలైనట్టు చైనా చెబుతున్నా.. మిలటరీ గేమ్స్‌ సందర్భంగా వీధుల్లో రసాయనాలను పిచికారీ చేయడం చూశామని చాలా మంది అథ్లెట్లు తెలిపారు. విమానాశ్రయాల్లో తమ శరీర ఉష్ణోగ్రతలను కూడా రికార్డు చేసినట్టు జార్జెస్‌ చెప్పాడు. బయటి ఆహారం తీసుకోవద్దని నిర్వాహకులు ఆటగాళ్లకు పదేపదే సూచించడం తమకు  ఆశ్చర్యంగా అనిపించిందన్నాడు.  

Updated Date - 2020-05-19T09:17:42+05:30 IST