తాయిలాలివ్వరూ!

ABN , First Publish Date - 2020-03-18T06:11:11+05:30 IST

దేశంలో వస్తు తయారీతోపాటు ధరలపై కరోనా వైరస్‌ తీవ్ర ప్రభావం చూపనుందని ఎస్‌బీఐ రీసెర్చ్‌ తాజా నివేదిక హెచ్చరించింది. చైనాలో ఉత్పత్తి నిలిపివేతతో దేశీయ కంపెనీలకు ముడి సరుకులు, విడిభాగాల సరఫరాకు అవాంతరాలు...

తాయిలాలివ్వరూ!

కరోనా ప్రభావిత ఎకానమీకి ఆర్థిక, ద్రవ్య ప్రోత్సాహకాలు అవసరం 

ఎస్‌బీఐ రీసెర్చ్‌ తాజా నివేదిక 


ముంబై: దేశంలో వస్తు తయారీతోపాటు ధరలపై కరోనా వైరస్‌ తీవ్ర ప్రభావం చూపనుందని ఎస్‌బీఐ రీసెర్చ్‌ తాజా నివేదిక హెచ్చరించింది. చైనాలో ఉత్పత్తి నిలిపివేతతో దేశీయ కంపెనీలకు ముడి సరుకులు, విడిభాగాల సరఫరాకు అవాంతరాలు ఏర్పడవచ్చని, తత్ఫలితంగా ఉత్పత్తి తగ్గి ధరలు ఎగబాకే ప్రమాదం ఉందని రిపోర్టు పేర్కొంది. కోవిడ్‌ ప్రభావం నుంచి భారత ఎకానమీని గట్టెక్కించేందుకు ఆర్థిక, ద్రవ్య ప్రోత్సాహకాలు అవసరమని రిపోర్టు సూచించింది. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం ఆర్‌బీఐ వడ్డీ రేట్లు తగ్గిస్తూ పోతే మార్కెట్లో మళ్లీ అసెట్‌ బబుల్‌ ఏర్పడే ప్రమాదం ఉంటుందే తప్ప వినియోగ డిమాండ్‌ పునరుద్ధరణకు అంతగా దోహదపడకపోవచ్చు. కాబట్టి ప్రభుత్వం, ఆర్‌బీఐ పరస్పర సహకారంతో ఆర్థిక, ద్రవ్య విధానపరమైన చర్యలు చేపట్టడం ఉత్తమ మార్గం’’ అని ఎస్‌బీఐ  గ్రూప్‌ ప్రధాన ఆర్థికవేత్త సౌమ్య కాంతి ఘోష్‌ అన్నారు.  


నివేదికలోని ముఖ్యాంశాలు

దేశంలో ఇప్పుడిప్పుడే తీవ్ర రూపం దాలుస్తున్న ఈ మహమ్మారి.. ఆర్థిక వ్యవస్థపై ఇంకా పూర్తి స్థాయిలో ప్రభావం చూపాల్సి ఉంది


ఈ వైరస్‌ వ్యాప్తితో హోటల్‌, ఏవియేషన్‌, రవాణా, మెటల్‌, ఆటో విడిభాగాలు, టెక్స్‌టైల్‌ రంగాలు అధికంగా ప్రభావితం కానున్నాయి. ఆయా రంగాల్లో సంక్షోభ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని సాయాన్ని ప్రకటించాల్సిన అవసరం ఉంది 


అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు 30 శాతం తగ్గడంతో దేశీయంగా లీటరు పెట్రోల్‌పై రూ.12, డీజిల్‌పై రూ.10 తగ్గే అవకాశం ఉండేది. కానీ, కేంద్ర ప్రభుత్వం ఈ రెండు ఇంధనాలపై ఎక్సైజ్‌ డ్యూటీని లీటరుకు రూ.3 చొప్పున పెంచింది. తద్వారా కేంద్ర ప్రభుత్వానికి రూ.35,000-40,000 కోట్ల అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉంది. కరోనా వైరస్‌ ప్రభావంతో ఉపాధి, ఆదాయం కోల్పోయిన అల్పాదాయ వర్గాల కోసం ప్రభుత్వం ఈ అదనపు ఆదాయాన్ని వినియోగించవచ్చు 


ఎయిర్‌లైన్స్‌కు త్వరలో ప్యాకేజీ? 

కరోనా ధాటికి కకావికలం అవుతున్న దేశీయ ఎయిర్‌లైన్స్‌కు కేంద్ర ప్రభుత్వం కొంత ఊరట కల్పించే యోచనలో ఉన్నట్లు సమాచారం. స్వల్పకాలం పాటు విమానాల ల్యాండింగ్‌, పార్కింగ్‌, హౌసింగ్‌తో పాటు ఇతర చార్జీల రాయితీ లేదా తగ్గింపులతో త్వరలోనే ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించే అవకాశాలున్నాయి. ప్రతిపాదిత ప్యాకేజీపై చర్చించేందుకు ఆర్థిక, విమాన మంత్రిత్వ శాఖల మధ్య ఇప్పటికే పలుసార్లు చర్చలు కూడా జరిగినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కరోనా దెబ్బకు ఈనెలలో దేశీయ ఎయిర్‌లైన్స్‌ అంతర్జాతీయ మార్గాల్లో పలు సర్వీసులను రద్దు చేయాల్సి వచ్చింది. 


‘ఆటో’ ఉద్యోగులకూ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ 

వాహన తయారీ కంపెనీలూ తమ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ వెసులుబాటు కల్పిస్తున్నాయి. అమెరికా ఆటో దిగ్గజం ఫోర్డ్‌.. భారత్‌లోని తన 10,000 మంది ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఆదేశాలు జారీ చేసింది. కీలక పదవుల్లో ఉన్న వారు మినహాయించి మిగతావారందరూ ఇంటి వద్ద నుంచే పని చక్కబెట్టాలని కోరింది. వోల్వో ఇండియా, ఫియట్‌ క్రిస్లర్‌ ఇండియా కూడా ఫోర్డ్‌ బాటను అనుసరించాయి. టాటా మోటార్స్‌ సైతం తన ప్రధాన, ప్రాంతీయ కార్యాలయాల్లోని సిబ్బందిని ఇంటి పట్టునుంటూనే ఆఫీసు పనులు చక్కబెట్టాలని కోరింది. 


గోఎయిర్‌ అంతర్జాతీయ సర్వీసులు రద్దు 

సిబ్బందికి వేతనం లేని సెలవులు

ఈ నెల 17 నుంచి ఏప్రిల్‌ 15 వరకు అంతర్జాతీయ మార్గాల్లో నడిపే సర్వీసులన్నింటినీ రద్దు చేస్తున్నట్లు గోఎయిర్‌ ప్రకటించింది. అంతేకాదు, సిబ్బందిని రొటేషన్‌ పద్ధతిలో వేతనం లేని సెలవులపై పంపనున్నట్లు ప్రకటించింది. కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో విదేశీ విమాన ప్రయాణాలకు డిమాండ్‌ భారీగా పడిపోయింది. దేశీయంగానూ ప్రయాణికుల రద్దీ తగ్గుముఖం పట్టింది. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగానే గోఎయిర్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 


రెస్టారెంట్లు విలవిల 

కరోనా వైరస్‌ దెబ్బకు పలు నగరాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లు కస్టమర్లు లేక వెలవెల బోతున్నాయి. కొన్ని రెస్టారెంట్లయితే ఈ వైరస్‌ భయాలు సద్దుమణిగే వరకు దుకాణం కట్టేసే యోచనలో ఉన్నాయట. ఎప్పుడూ కస్టమర్లతో కళకళలాడే రెస్టారెంట్లకు సైతం గడిచిన రెండు వారాల్లో కస్టమర్ల తాకిడి అనూహ్యంగా తగ్గినట్లు తెలుస్తోంది. మొత్తంగా దేశంలో రెస్టారెంట్లకు కస్టమర్లు 30-35 శాతం మేర తగ్గినట్లు, మాల్స్‌లోని రెస్టారెంట్లపై ప్రభావం అధికంగా ఉందని నేషనల్‌ రెస్టారెంట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా 

తెలిపింది.

Updated Date - 2020-03-18T06:11:11+05:30 IST