Abn logo
Jun 12 2021 @ 00:08AM

ధాన్యం కొనుగోళ్లలో కోట్ల అవినీతి

పరిగిలో ఓరైస్‌ మిల్లు ఎదుట బైటాయించి నిరసన తెలుపుతున్న డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి

  • అధికార పార్టీ నాయకులు, మిల్లర్లు కుమ్మక్కు
  • రైస్‌మిల్లర్ల అక్రమాలపై విచారణ జరిపించాలి
  • పరిగి రైస్‌మిల్లు దగ్గర ధర్నాలో డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి


పరిగి: టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, మిల్లర్లు కుమ్మక్కై రైతాంగాన్ని దోచుకతాంటున్నారని పరిగి మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు టి.రామ్మోహన్‌రెడ్డి ఆరోపించారు. ధాన్యం అమ్మకాల్లో రైతులు పడుతున్న కష్టాలను తెలుసుకునేందుకు ఆయన పరిగిలోని శ్రీవెంకటసాయి రైస్‌మిల్లుకు వెళ్లారు. అక్కడ రైతుల కష్టాలు తెలుసుకుని రైస్‌మిల్లు ఎదుటే గంటపాటు బైటాయించి నిరసన వ్యక్తంచేశారు. ఉన్నతాధికారులు వచ్చి రైతులకు న్యాయం చేసేంతవరకూ ఆందోళన చేస్తామని స్పష్టం చేశారు. అనంతరం సివిల్‌సప్లయి కమిషనర్‌ అనిల్‌కుమార్‌,  చైర్మన్‌ శ్రీనివా్‌సరెడ్డి, కలెక్టర్‌ పౌసుమిబసులతో ఫోన్‌లో మాట్లాడి వారికి ఫిర్యాదు చేశారు. పరిగిలో జరుగుతున్న ధాన్యం అమ్మకాల్లో అక్రమాలపై విచారణ జరిపి న్యాయం చేయాలని కమిషనర్‌ను ఫోన్‌లో కోరారు. అనంతరం రామ్మోహన్‌రెడ్డి రైతులను ఉద్దేశించి మాట్లాడారు. బస్తాకు కిలో 500గ్రాములు తరుగు తీయాలని ఉండగా ఇక్కడి రైస్‌ మిల్లు మాత్రం 40కిలోల బస్తాకు నాలుగు కిలోలు, క్వింటాలుకు 10నుంచి 12కిలోల వరకు కోత విధించడమేంటని ప్రశ్నించారు. అదేవిధంగా హమాలీ, రవాణాకు క్వింటాలుకు రూ.100, వెయిటింగ్‌ చార్జీలు వసూలు చేయడంతో రైతుల ఇంటికి ఖాళీచేతులతో వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. అధికారపార్టీ ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో ధాన్యం కొనుగోళ్లలో భారీ అక్రమాలకు తెరలేపారని ఆరోపించారు.  పరిగిలో జరుగుతున్న అక్రమాలపై వివరాలతో కలెక్టర్‌, కమిషనర్‌కు ఇవ్వనున్నట్లు తెలిపారు. రైతులపక్షాన ఎంతటి పోరాటికైనా సిద్ధమని తెలిపారు. ఆయన వెంట సుభా్‌షచందర్‌రెడ్డి, హణ్మంత్‌ముదిరాజ్‌, రాంచంద్రయ్య, జమీల్‌, పరుశరాంరెడ్డి, కృష్ణ, వెంకట్‌రెడ్డి, ఆంజనేయులు, శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

ధాన్యం కొనుగోళ్ళపై సివిల్‌ సప్లయి డీఎం విచారణ 

పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్‌ విమల శుక్రవారం సాయంత్రం పరిగిలోని రైస్‌మిల్లులను సందర్శించారు. పరిగిలో ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలపై డీసీసీ అధ్యక్షుడు టి.రామ్మోహన్‌రెడ్డి  సివిల్‌సప్లయి కమిషనర్‌ అనిల్‌కుమార్‌, చైర్మన్‌ శ్రీనివా్‌సరెడ్డి, కలెక్టర్‌ పౌసుమిబసులతో ఫోన్‌లో ఫిర్యాదు చేయగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డీఎం విమల పరిగిలోని శ్రీవెంకటసాయి బాయిల్డ్‌ రైస్‌మిల్లు, పరిగిలోని కేఏఆర్‌ ఫంక్షన్‌హాల్‌లో ఉన్న వరిధాన్యం నిల్వలలను పరిశీలించారు. క్వింటాలుకు పదికిలోల కోత విధించిన రైతులు లిఖితపూర్వకంగా డీఎంకు వివరించారు. డీఎం రైస్‌మిల్లు యజమానికి ఫోన్‌చేయగా హైదరాబాద్‌లో ఉన్నానని నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో యజమాని తీరుపై అసహనం వ్యక్తం చేశారు. రైస్‌పార్టనర్‌ కంకల్‌ ప్రభాకర్‌ అక్కడకు చేరుకుని ధాన్యంలో తాలు ఉండడం వల్లనే కోత విధించాల్సి వస్తోందని సమాధానమిచ్చారు.డీఎం స్వయంగా పరిశీలించిన వరిధాన్యం బాగుందని చెప్పడం గమనార్హం. అక్కడకు చేరుకున్న కాంగ్రెస్‌ నాయకులు పరశురాంరెడ్డి, తదితరులు టీఆర్‌ఎస్‌ నాయకులు రైస్‌మిల్లర్లు కలిసి అక్రమాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్‌ నాయకులు, రైతులు డీఎం దగ్గర గుమిగూడడంతో అక్కడకు చేరుకున్న ఎస్‌ఐ రమేశ్‌ అక్కడకు చేరుకుని 5గంటల తర్వాత ఎవరూ ఒండవద్దని డీఎం విమలను కారులో ఎక్కించి పంపించారు. ఆ తర్వాత డీఎం ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ వెంకటసాయి రైస్‌ మిల్లులో తరుగుపేరిట కోత విధించారన్న ఆరోపణల మేరకు నాలుగైదు కూట్లలో ధాన్యం సేకరించామని, వాటిని ల్యాబ్‌కు పంపిస్తామని తెలిపారు. ల్యాబ్‌లో నాణ్యత లేదని తేలితే రైస్‌మిల్లుపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Advertisement
Advertisement