అగ్ర‌రాజ్యంలో ఆగ‌ని మృత్యు ఘోష !

ABN , First Publish Date - 2020-04-10T13:10:08+05:30 IST

కరోనా అంటే గుర్తొచ్చేవి స్పెయిన్‌, ఇటలీ. పదివేల మరణాలు తొలిగా చోటుచేసుకొన్న యూరప్‌ దేశాలివి. ఇప్పుడు ఈ లెక్కలనూ అమెరికాలో కరోనా విలయం దాటేస్తోంది. యూర్‌పలోని ఏ దేశంలోనూ ఒకే రోజు మరణాలు వెయ్యి దాటలేదు.

అగ్ర‌రాజ్యంలో ఆగ‌ని మృత్యు ఘోష !

అమెరికాలో పెరుగుతున్న కరోనా మరణాలు

మొత్తం 14,555 మృతులు.. 4.1లక్షల కేసులు

ఇందులో సగంపైగా న్యూయార్క్‌ రాష్ట్రంలోనే

బ్రిటన్‌లో ఒక్కరోజే 938 మరణాలు 

స్పెయిన్‌, ఇటలీని మించి ఇంగ్లండ్‌లో మృతులు

వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 9 : కరోనా అంటే గుర్తొచ్చేవి స్పెయిన్‌, ఇటలీ. పదివేల మరణాలు తొలిగా చోటుచేసుకొన్న యూరప్‌ దేశాలివి. ఇప్పుడు ఈ లెక్కలనూ అమెరికాలో కరోనా విలయం దాటేస్తోంది. యూర్‌పలోని ఏ దేశంలోనూ ఒకే రోజు మరణాలు వెయ్యి దాటలేదు. కానీ, అమెరికాలో దాదాపు రెండు వేలమంది చొప్పున వరుసగా రెండురోజులు చనిపోవడంతో అక్కడ మరణాలు 16,074కు చేరుకొన్నాయి. దీంతో, 15,238 మరణాలు చోటుచేసుకొన్న స్పెయిన్‌ను మించిన విషాదం అమెరికాలో అలుముకొంది. అందులోనూ న్యూయార్క్‌లో శవాలు గుట్టలు పడుతున్నాయి. 731 మంది మృతితో ఒకరోజు అత్యధిక మరణాలు సోమవారం చోటుచేసుకోగా, బుధవారం సంభవించిన 779 మరణాలు ఆ పాత లెక్కలను తుడిపేశాయి. కుప్పలుతెప్పలుగా వచ్చిపడిన పాజిటివ్‌ కేసులను చూడటానికి ఆస్పత్రులు చాలడం లేదు.


24 గంటలూ పోరాడుతున్న వైద్యులకు వ్యక్తిగత రక్షణ పరికరాలను ప్రభుత్వం సరిపడా అందించలేకపోతోంది. వందల్లో చనిపోతున్న పౌరులను పూడ్చడానికి న్యూయార్క్‌, న్యూజెర్సీ లాంటి హాట్‌స్పాట్లలో సమాధి స్థలాలు సరిపోవడం లేదు. అయితే, ప్రభుత్వం కొంత ఆలస్యంగానైనా లాక్‌డౌన్‌ అమలుచేస్తూ, భౌతిక దూరాన్ని తప్పనిసరి చేయడం ఒక్కటే ఇంతటి విపత్కర వాతావరణంలోనూ ఆ దేశ పౌరులకు కొంత కవచంలా నిలిచింది. ఇదే మాట న్యూయార్క్‌ గవర్నర్‌ ఆండ్రూ క్యూమో స్పష్టం చేశారు. ఈ చర్యల వల్లే కేసులు తగ్గుతున్నాయని, ఆస్పత్రుల్లో కొత్తగా చేరేవారు కూడా తగ్గిపోయారని ఆయన వెల్లడించారు. ఇదే పరిస్థితి రెండు వారాలపాటు కొనసాగితే ఆరోగ్య వ్యవస్థను స్థిరీకరించగలుగుతామని, ఇంతటి విపత్కర వాతావరణంలోనూ కరోనా కేంద్రాలుగా మార్చిన ఆస్పత్రులను కనిష్ఠస్థాయికి తీసుకురాగలుతామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.


ఇప్పటికి ఈ సిటీలో 6,268మంది కరోనాబారినపడి చనిపోయారు. కేసులు నాలుగు లక్షలు దాటిపోయాయి. ఇళ్లలోనే చనిపోతున్న వారినీ కలుపుకొంటే మరణాల రేటు మరింత ఎక్కువగా ఉండొచ్చునని న్యూయార్క్‌ మేయర్‌ బిల్‌ డె బ్లాసియో ఆందోళన వ్యక్తం చేశారు. న్యూయార్క్‌వాసుల్లో లాటిన్‌ అమెరికా, ఆఫ్రికా సంతతివారే ఎక్కువగా చనిపోతున్నారని ప్రభుత్వ ప్రాథమిక నివేదిక తెలిపింది. చేతులు కలిపి కరచాలనం చేసే అలవాటును మునుముందు మానేయాలని అంటువ్యాధుల సంస్థ అధినేత ఆంటోనీ ఫౌసీ సూచించారు.


దీనివల్ల వైరస్‌ వ్యాప్తి తీవ్రత తగ్గడమే కాదు, కరోనా పెద్దఎత్తున సోకుతున్న ఘటనలూ తగ్గుముఖం పడతాయని ఆయన వివరించారు. కాగా, కరోనా  విషయంలో చైనాను ప్రపంచ ఆరోగ్య సంస్థ వెనుకేసుకువస్తున్నదంటూ మరోసారి అధ్యక్షుడు ట్రంప్‌ విరుచుకుపడ్డారు. ఈ వ్యవహారాన్ని డబ్ల్యూహెచ్‌వో రాజకీయమయం చేస్తోందని దుయ్యబట్టారు. కరోనా హెచ్చరికల్లో డబ్ల్యూహెచ్‌వో చేసిన జాప్యమే ప్రపంచాన్ని ప్రమాదంలో పడేసిందన్నారు. డబ్య్లూహెచ్‌వోకు గత ఏడాది అమెరికా 450 మిలియన్‌ డాలర్ల నిధులు సమకూర్చితే, చైనా కేవలం 42 మిలియన్‌ డాలర్లే కేటాయించిందని తెలిపారు. డబ్బులు అమెరికా దగ్గర తీసుకొని, మద్దతు చైనాకు ఇస్తున్నారని ఆగ్రహించారు. ఈ హెచ్చరికల దరిమిలా డబ్ల్యూహెచ్‌వో ‘వైర్‌సపై పోరులో ఏకం అవుదాం’ అంటూ ప్రపంచదేశాలకు బుధవారం పిలుపునిచ్చింది. 


ఇదేం పాడు నాకుడు!

ఒక సామాజిక వర్గానికి చెందిన కొంతమంది ప్లేట్లు, చెంచాలు నాకినట్టు వచ్చిన వార్తలు మీడియాలో కలకలం రేపి, ఆ తరువాత అదంతా ఫేక్‌ అని తేలింది. ఈ వార్తల గందరగోళం తొలగిపోకముందే అమెరికాలో ఇలాంటి పనే చేస్తూ ఓ మహిళ పోలీసులకు దొరికిపోయింది. కాలిఫోర్నియాలో జెన్నీఫర్‌ వాకర్‌ అనే యువతి సూపర్‌ మార్కెట్‌లోకి చొరబడి అక్కడి వం టింటి సరుకులు, అరల్లో పేర్చిన నగలను నాకడం మొదలుపెట్టింది. నిర్వాహకులు గమనించి పోలీసులను పిలిచేసరికే 1800 డాలర్ల విలువైన వస్తువులను ఆమె మలినం చేసింది. 


Updated Date - 2020-04-10T13:10:08+05:30 IST