కమ్మేస్తున్న కరోనా

ABN , First Publish Date - 2021-04-18T05:13:29+05:30 IST

కరోనా మహామ్మారిని రోజురోజుకు విజృంభిస్తుంది.

కమ్మేస్తున్న కరోనా
ఏన్కూరులో హైపోక్లోరైట్‌ ద్రావణం పిచికారి చేస్తున్న దృశ్యం

 పల్లెలోనూ భారీగా పెరుగుతున్న పాజిటివ్‌లు 

 ఆందోళనలో ప్రజలు

 కొవిడ్‌ నిబంధనలు పాటించని జనం

 పాజిటివ్‌ వచ్చినా జనంలోనే ..

వైరా/ఏన్కూరు/కారేపల్లి, ఏప్రిల్‌ 17: వైరాలో కరోనా మహామ్మారిని రోజురోజుకు విజృంభిస్తుంది. కరోనా సెకండ్‌వేవ్‌ అత్యంత వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో వైరాలో కూడా ఆఉధృతి అధికంగానే ఉంది. వైరా మునిసిపాలిటీ పరిధిలో ఇద్దరు వృద్దురాళ్లు కరోనా మహామ్మారికి బలయ్యారు. మునిసిపాలిటీ 11వ వార్డు సోమవరంలో ఓ వృద్ధురాలు, అలాగే మునిసిపాలిటీలోని ఐదారు వార్డుల పరిధిలోకి వచ్చే సుందరయ్యనగర్‌ ప్రాంతంలో మరో వృద్ధురాలు కూడా కరోనా బారీనపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ రెండు సంఘటనలు వైరా వాసులను తీవ్ర ఆందోళనలకు గురిచేస్తున్నాయి.

కరోనా మహామ్మారి సెకండ్‌వేవ్‌ ఉధృతంగా ఉన్న సమయంలో ప్రతిరోజూ పాజిటివ్‌ బాధితుల సంఖ్య పెరుగుతుంది. గత నెల 27వతేదీ నుంచి వైరా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 45సంవత్సరాలుపైబడిన వారికి కరోనా వ్యాక్సిన్‌ వేస్తున్నారు. మొదట మూడ్నాలుగురోజులు మాత్రం కరోనా టెస్టులు లేకుండా టీకాలు వేశారు. ఆతర్వాత నుంచి ముందుగా కరోనా టెస్టులు నిర్వహించి నెగిటివ్‌ వచ్చిన వారికి మాత్రమే టీకాలు వేస్తున్నారు. టీకాలు వేయించుకొనేందుకు వెళ్లిన అనేకమందికి టెస్టుల్లో పాజిటివ్‌ బయటపడుతుంది. అలాంటి వారిని హోంక్వారంటైన్‌కు తరలిస్తున్నారు. కొంతమంది పాజిటివ్‌ ఉన్నవారు కనీస బాధ్యతను విస్మరించి జనంలో కలిసి తిరుగుతూ ఇతరులకు వైరస్‌ వ్యాపింపజేస్తున్నారని పలువురు ఆందోళన చెందుతున్నారు. ప్రజలు తమను తాము కాపాడుకొనేందుకుగానూ విధిగా మాస్క్‌లు ధరించి భౌతిక దూరం పాటిస్తూ కొవిడ్‌ నిబంధనలమేరకు నడుచుకోవాలని వైద్యఆరోగ్యశాఖ అధికారులు, పోలీసులు హితవు చెపుతున్నారు.

వైరాలో 14మందికి కరోనా పాజిటివ్‌

వైరా, ఏప్రిల్‌ 17: వైరాలో శనివారం 14మందికి కరోనా పాజిటివ్‌ నిర్థారణ అయింది. వైరా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 180మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. వీరిలో 14మందికి పాజిటివ్‌ వచ్చింది. 130మందికి కరోనా టీకా వేశారు.

ఏన్కూరులో ఇప్పటికే 121మందికి..

ఏన్కూరు, ఏప్రిల్‌ 17: ఏన్కూరు మండలాన్ని కరోనా క్రమేణా కమ్మేస్తుంది. ఇప్పటికే 121మందికి మండల వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. వీరిలో పదిమంది కోలుకోగా 111యాక్టివ్‌ కేసులున్నాయి. తాజాగా శనివారం మండలంలో మరో 11మందికి కరోనా పాజిటివ్‌ నిర్థారణ అయినట్లు వైద్యులు తెలిపారు. ఒక్క కోదండరాంపురం తండాలోనే సుమారు 55మందికి పాజిటివ్‌ తేలింది. మండలంలోని అన్నిగ్రామాలకు కరోనా సోకుతుండటంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. పంచాయతీ పాలకులు కరోనా పాజిటివ్‌ ఉన్న గ్రామాల్లో బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లటం, హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారి చేయించటం చేస్తూ కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. శనివారం ఏన్కూరులోని ప్రధాన వీధుల్లో హైపోక్లోరైల్లో ద్రావణాన్ని పిచికారి చేయించారు. కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మైకు ద్వారా ప్రచారం చేస్తున్నారు.

మండలంలో 33 కేసులు నమోదు

కారేపల్లి: మండలంలో శనివారం 33 కరోనా పాజీటీవ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా వ్యాప్తిచెందిన దగ్గరనుంచి మండలంలో ఇన్ని కేసులు నమోదు కావడం విశేషం. దీంతో మండలంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మొత్తం మండలంలో 115మందికి కొవిడ్‌ టెస్టులు నిర్వహించగ వారిలో 33మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధాణ అయింది. నానునగర్‌ తండాలో 8, భాగ్యనగర్‌తండాలో 6, మండలకేంద్రం కారేపల్లిలో 5, టేకులగూడెం4, వెంకిటియ్యా తండా3, పేరుపల్లి2, ఎర్రబోడు2, విశ్వనాధపల్లి1, లింగంబంజర1, మోట్లగూడెం1 కేసులు నమోదయ్యాయి.


Updated Date - 2021-04-18T05:13:29+05:30 IST