పెగాస్‌సపై జేపీసీతో విచారణ చేయించాలి

ABN , First Publish Date - 2021-08-02T08:32:13+05:30 IST

పెగాసస్‌ నిఘా బాగోతంపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీతో విచారణ చేపట్టాలని సీపీఐ జాతీయ కార్యాదర్శి నారాయణ డిమాండ్‌ చేశారు. ఆయన ఆదివారం ఇక్కడ ఏపీ భవన్‌లో

పెగాస్‌సపై జేపీసీతో విచారణ చేయించాలి

ఆంధ్రలో మైనింగ్‌ మాఫియా రాజ్యమేలుతోంది

‘దేవినేని’ అరెస్టు అప్రజాస్వామికం: నారాయణ


న్యూఢిల్లీ, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): పెగాసస్‌ నిఘా బాగోతంపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీతో విచారణ చేపట్టాలని సీపీఐ జాతీయ కార్యాదర్శి నారాయణ డిమాండ్‌ చేశారు. ఆయన ఆదివారం ఇక్కడ ఏపీ భవన్‌లో విలేకర్లతో మాట్లాడారు. తమ ప్రభుత్వాన్ని అస్థిర పరిచే అంతర్జాతీయ కుట్రగా చెబుతున్న ప్రధాని మోదీ... పెగాసస్‌ వ్యవహారంపై విచారణ జరిపించడానికి ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. ఏపీలో మైనింగ్‌ మాఫియా రాజ్యమేలుతోందని ధ్వజమెత్తారు. కొండపల్లిలో యథేచ్ఛగా సాగుతున్న మైనింగ్‌ అక్రమాలను పరిశీలించేందుకు వెళ్లిన టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమాపై దాడి ఆమానుషమన్నారు. తిరిగి ఆయనపైౖనే తప్పుడు కేసులు బనాయించి, అరెస్ట్‌ చేయడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. ఏపీలో నెలకొన్న పరస్థితులపై తక్షణమే కేంద్రం జోక్యం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. రాబోయే సాధారణ ఎన్నికల్లో నగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేయనున్నట్లు వస్తున్న వార్తలను కొట్టిపారేసిన నారాయణ... అదంతా ఎవరో గిట్టనివారు చేస్తున్న తప్పుడు ప్రచారంగా పేర్కొన్నారు.


తెలంగాణలో సీఎం కేసీఆర్‌ ప్రవేశపెడుతున్న దళిత బంధు పథకాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అయితే దానిని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ కేబినెట్‌లో కేవలం ఐదుగురు మంత్రులు మినహా మిగిలిన వారంతా సమైక్యవాదులేనని విమర్శించారు.  టీఆర్‌ఎస్‌ పరిస్థితి అద్దె ఇంటి మాదిరిగా తయారైందని ఎద్దేవా చేశారు. 

Updated Date - 2021-08-02T08:32:13+05:30 IST